రాసుకుంటే రామాయణమంత..
గత పాలకుల హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్
నల్లగొండ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తాం
పెన్షన్‌దారుల గుర్తింపు {పక్రియ ఇంకా కొనసాగుతోంది
ఇప్పటివరకు 24.21 లక్షల మందిని అర్హులుగా గుర్తించాం
‘ఆసరా’పై అసెంబ్లీలో {పభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్
హైదరాబాద్: ‘‘గత పాలకుల హయాం లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు జరిగిన అన్యాయం గురించి రాసుకుంటే రామాయణమంత.. చెప్పుకుంటే భారతమంత’’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరోక్షంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చురకలంటించారు. బుధవారం శాసనసభలో శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి కలిగించేందుకు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు దోహదపడుతుందని, తుది దశలో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సుమారు రూ.3000 కోట్లు అవసరమైతే, బడ్జెట్లో కేవలం రూ.327 కోట్లే కేటాయించారంటూ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసేలా ఏడాదికి రూ.వెయ్యి కోట్లయినా కేటాయిస్తే బాగుండేదన్నారు. చివరి దశ పనులు వేగంగా జరగాలంటే.. ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టరుకే అప్పగించాలని, నిర్మాణ వ్యయాన్ని కూడా సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం స్పందిస్తూ.. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నల్లగొండ జిల్లాకు చెందిన శాసన సభ్యులతో గురువారం సమావేశమై సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేవలం తాగునీరు అందించడం వల్లే నల్లగొండ జిల్లా బాధలు సమసిపోవని చెప్పారు. సాగునీరు కూడా అందించడం ద్వారా పశువుల గడ్డిలోనూ, అవి ఇచ్చే పాలల్లోనూ ఫ్లోరైడ్ లేకుండా నివారించగలమన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పడం సత్యదూరమన్నారు. 1981లోనే ఈ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చినా దశాబ్దాల పాటు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టంచేశారు.
పింఛన్ సొమ్ము దేశంలోనే అధికం
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెన్షన్‌దారులకు చెల్లిస్తున్న సొమ్ముతో పోల్చితే తెలంగాణ రాష్ట్రమే పెన్షన్లకు అధికంగా చెల్లిస్తోందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అర్హులైన పింఛన్‌దారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు 24.21 లక్షల మందిని అర్హులుగా గుర్తించామని వెల్లడించారు. ఫింఛన్ల పంపిణీకి ఏటా దాదాపు రూ.3,350 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని, అయినా నిరుపేదలు, నిస్సహాయులకు చేయూతే లక్ష్యంగా ఆసరా పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. బుధవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ‘ఆసరా’ పథకంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ‘‘పెన్షన్లు రాక గుండెలు ఆగిపోతున్నాయి.. నిన్నటిదాకా రైతులు, ఇప్పుడు వృద్ధులు మరణిస్తున్నారు’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, భట్టివిక్రమార్క, రాంరెడ్డి వెంకటరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి నినాదాలు చేశారు. ఓసారి వాయిదా పడ్డ తర్వాత కూడా ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో సీఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. సభలో ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.