సాక్షి, హైదరాబాద్: ‘నేను శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన దగ్గరి నుంచి తమ సభ్యులను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకునే ప్రక్రియ మొదలు సభలో కాంగ్రెస్ పక్ష నాయకునిగా నా పాత్ర పోషించే క్రమంలో సభలో మాట్లాడే సమయంలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసేలా ఉన్నాయి. సభలో మాట్లాడకుండా చేయడం, అర్ధంతరంగా మైక్ కట్ చేయడం చాలా అవమానకరం.
ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తికి సరైంది కాదు’ అని పేర్కొంటూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క లేఖ రాశారు. పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, వీరయ్య, సీతక్కతో మంగళవారం అసెంబ్లీలో స్పీకర్‌ను కలసి ఈ లేఖను అందజేశారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానమైన అసెంబ్లీలో ఏ విభాగం బలహీనపడినా ప్రజాస్వామ్య పునాదులకు పెను ప్రమాదం ఏర్పడుతుందని ఆ లేఖలో తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల ఫిరాయింపులపై లేఖ ఇచ్చే సమయంలో ప్రతిపక్ష నేతగా ఫొటో దిగాలను కున్నప్పుడు స్పీకర్ అంగీకరించకపోవడం తన మనసును తీవ్రంగా గాయపర్చిందని పేర్కొన్నారు. శాసనసభాపక్ష నాయకుడిగా బడ్జెట్‌పై చర్చలో భాగంగా వివరణలపై మాట్లాడుతున్నప్పుడు అర్ధంతరంగా మైక్ కట్ చేయడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.
దశాబ్దాల పోరాటం తర్వాత ఏర్పడిన రాష్ట్రం సామాజిక తెలంగాణగా రూపొందాలని ఆశించామని, కానీ సభలో తన పాత్ర పోషించకుండా అడుగడుగునా అడ్డుపడుతున్న పరిణామాలు ఏ విధంగా సామాజిక తెలంగాణ నిర్మాణానికి దోహదపడతాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. తమ హక్కులను కాపాడాలని, సభాపతి స్థానంలో రాగద్వేషాలకు అతీతంగా తాము అవమానాలకు గురికాకుండా, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ఆ లేఖలో స్పీకర్‌ను భట్టి కోరారు.
ఆత్మగౌరవంతో మాట్లాడలేని పరిస్థితి..
అంతకుముందు కాంగ్రెస్ సభ్యులు మంగళవారం సభకు హాజరవుతున్న సమయంలో నల్ల కండువాలు ధరించి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని విమర్శించారు. సభలో తమ గొంతు నొక్కు తున్నారని, కుట్రలతో తమను మాట్లాడ నీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూలదోస్తున్నారని, ఏ రంగం పనిచేయకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ప్రతి పక్షాలను నిర్వీర్యం చేసే కుటిల యత్నాలను ప్రజలు గమనించాలని భట్టి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment