సాక్షి, హైదరాబాద్: ‘బడ్జెట్‌లో పెట్టిన నిధులు ఇవ్వరు, బడ్జెట్‌తో సంబంధం లేని పనులను హడావుడిగా చేపడుతూ నిధులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ సభ ఎందుకు, సమావేశాలు ఎందుకు?’అంటూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గురువారం అసెంబ్లీలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి పేర్కొనగా, పవిత్ర సభను అవమానించేలా ఎలా మాట్లాడతారని, అలా చేస్తే మాట్లాడేందుకే అనుమతి ఇవ్వనని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ మీద గౌరవం లేనప్పుడు సభలో మాట్లాడటమెందుకని ప్రశ్నించారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సభలో ఆవేశంగా మాట్లాడారు. తొలుత ఆయన పేరును కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా స్పీకర్ పిలవగా, తన పేరు రాజగోపాలరెడ్డి అంటూ ఆయన పేర్కొనటంతో స్పీకర్ సారీ చెప్పారు. ఆ తర్వాత రాజగోపాల్‌రెడ్డి మాట్లా డుతూ తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట ఎక్కువగా నడిచింది నిరుద్యోగులేనని, రాష్ట్రం సిద్ధిస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని, ఉపాధికి ఢోకా లేదని కేసీఆర్ చెప్పారని, కానీ ఇప్పుడు అది అమలు కాకపోయేసరికి నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకొన్నాయని అన్నారు.
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు..
పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు రావటం లేదని, ప్రైవేటులో 50 శాతం ఉద్యోగాలు స్థానికు లకే ఇచ్చేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌లో 100 ఫార్మా కంపెనీలుంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగ మేంటని ప్రశ్నించారు.
పథకాలు రూపొందించినా అమలుకు నిధులు ఇవ్వక పనుల కోసం సర్పంచులపై ఒత్తిడి పడుతోందని పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాలకు వేల కోట్ల నిధులు పోతు న్నాయని, మరి తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని, ప్రతిపక్ష సభ్యులను గెలిపించుకోవటం మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపమా అంటూ ప్రశ్నించారు. శివన్నగూడెం ప్రజలు ప్రాజెక్టుకు భూములిచ్చి త్యాగం చేస్తే పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment