సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూపాదేవి గురవారం రాత్రి అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే, రూపాదేవి రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదు. మరోవైపు.. ఎమ్మెల్యే మేడిపల్లి ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఈ సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే, రూపాదేవి అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆమె గత రెండు సంవత్సరాల నుంచి తీవ్ర కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపారు. ఈ కారణంగానే రెండు రోజులుగా స్కూల్‌కి సెలవు తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. మరోవైపు.. రూపాదేవి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ఇక, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment