సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా హాళ్లను తిరిగి మూసివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఒకవేళ అది సాధ్యం కాకుంటే కనీసం సగం సీట్లు (50%) మాత్రమే నింపుకొనేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని కోరింది. తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త సినిమా విడుదలైతే థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయని, పైగా ప్రేక్షకులు మాస్కులు పెట్టుకోకుండా పక్కపక్క సీట్లలో కూర్చుంటున్నారని పేర్కొంది. తలుపులు మూసేసి ఏసీలు వేస్తుండటంతో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపింది.
కాబట్టి సినిమా హాళ్లు, జిమ్‌లు, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సముదాయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేసింది. విద్యాసంస్థలను మూసివేయాలని పది రోజుల క్రితమే తాము ప్రతిపాదించామని, ఇప్పటికే ఆలస్యమైందని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. అందువల్ల సినిమా హాళ్ల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు.
మూడు నెలలపాటు వ్యాక్సిన్ల స్టాక్...
రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి, రెండో డోసులతో కలుపుకొని 9.68 లక్షల వ్యాక్సి న్లు వేశారు. ప్రస్తుతం ఇంకా 12 లక్షల డోసులు రాష్ట్రంలో నిల్వ ఉన్నాయి. అయి తే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా లు వేయాలంటే ఇప్పుడున్న డోస్‌లు సరి పోవు. కరోనా కేసులు పెరిగితే వ్యాక్సిన్లు వేసుకొనే వారి సంఖ్య కూడా అదేస్థాయి లో అధికమవుతుంది. ప్రస్తుతం నెలకు సరిపడా వ్యాక్సిన్లనే నిల్వ పెట్టుకుంటున్నారు.
కరోనా కేసులు పెరుగుతుండటం తో 3 నెలల వరకు సరిపడే వ్యాక్సిన్లను తెప్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు కరోనా బాధితులకు అవసరమైన మందులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కంపెనీలకు ఇండెంట్లు పెట్టారు. అన్ని ముఖ్యమైన ఆ సుపత్రుల్లోనూ కరోనా వార్డులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కరోనా సెకండ్ వేవ్!
దేశవ్యాప్తంగా ఐదారు నెలల క్రితం తగ్గినట్లే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని, వైరస్ వ్యాప్తి రెండో దశలోకి చేరుకుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మున్ముందు రోజురోజుకూ కేసులు మరింతగా పెరుగుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా జాగ్రత్తలు పాటించడమే అందుకు పరిష్కారమని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, అర్హులైన వారంతా వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు.
మరోవైపు మాస్కులు పెట్టుకోకుంటే జరిమానా విధించాలని, పోలీసులు రోడ్లపైనా, మాల్స్ వద్ద, గుమిగూడే అన్ని ప్రాంతాల్లో దాడులు చేసి జరిమానాలు విధిస్తే నిర్లక్ష్యం వహించే వారిలో కదలిక వస్తుందని, భయంతోనైనా మాస్కులు పెట్టుకుంటారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఈ మేరకు పోలీసు శాఖకు ప్రతిపాదన చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 90 శాతం వరకు మాస్కులు ధరించకపోవడం వల్లేనని, మిగిలిన 10 శాతం కేసులు భౌతికదూరం పాటించకపోవడం, చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్లేనని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అందువల్ల ఉన్నతస్థాయి వర్గాల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ మాస్కులు పెట్టుకోవాలని, ఆ మేరకు ప్రభుత్వం అవగాహనతోపాటు ధరించని వారికి జరిమానా విధించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment