ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సూర్యాపేట(నల్లగొండ): నెల రోజుల క్రితం వరకు వ్యాక్సిన్ కోసం ఆస్పత్రుల ఎదుట బారులే బారులు కన్పించేవి. సరిపడా వ్యాక్సిన్ లేక అందరికీ ఇవ్వలేకపోయేవారు. దీంతో ధర్నాలు రాస్తారోకోలు చేసేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డోసులు అందుబాటులో ఉన్నా వాక్సిన్ వేసుకోవడానికి మాత్రం ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడంలేదు. సరైన అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు.
ప్రధానంగా పట్టణ ప్రాంత ప్రజలు కరోనా బారినపడకుండా రెండు డోసులు వేయించుకుంటున్నా పల్లెవాసులు మాత్రం అంతగా శ్రద్ధకనబర్చడంలేదు. జిల్లా వ్యాప్తంగా 10.50లక్షల జనాభా ఉంటే 7.50లక్షల మందికి టీకా వేయాలని టార్గెట్‌గా పెట్టుకోగా ఏడునెలల కాలంలో కేవలం 3.24లక్షల మంది మాత్రమే వేయించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
3.24 లక్షల డోసులు పూర్తి..
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ప్రక్రియ ప్రారంభమైంది. విడతల వారీ గా జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 2,65,546 శాంపిల్స్ సేకరించగా.. 23,435 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ నెల 17 వరకు ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, ప్రైవేట్ ఆస్పత్రుల పరిధిలో వ్యాక్సినేషన్‌న్ ప్రక్రియ రెండు డోసులు కలిపి 3.24 లక్షలు పూర్తయింది.
ఇందులో మొదటి డోసు 2,41,825 కాగా రెండో డోసు 82,901. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ ఉన్న చోట వ్యాక్సినేషన్ కూడా ఇదే స్థాయిలో ఉంది. కానీ పీహెచ్‌సీల పరిధిలో మాత్రం పాజిటివ్ కేసులు తక్కువ శాతం ఉన్న చోట ఎక్కువగా వ్యాక్సినేషన్‌జరుగుతోంది. పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకోకుండా.. జనాభా ఆధారంగానే వ్యాక్సిన్ వేస్తున్నట్లు సమాచారం. పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నచోట టీకాలు ఎక్కువ మందికి వేస్తేన్‌కరోనాకు కళ్లెం పడనుంది.
అవగాహన కల్పించకే.. కేసులు నమోదు..?
రాష్ట్ర స్థాయిలోనే జిల్లాలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి అధికారుల బృందం రెండుసార్లు జిల్లాలో పర్యటించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉన్న కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఎక్కువ కేసులు నమోదుకావడానికి గల కారణాలను రాష్ట్రస్థాయి బృందం జిల్లా వైద్యాధికారుల నుంచి ఆరా తీసింది. సరిహద్దున బెల్ట్ షాపులు అధికంగా ఉండటం, రెండు రాష్ట్రాలకు రాకపోకలు జరుగుతుండటం తదితర కారణాలతో ఇక్కడ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు జిల్లా అధికారుల బృందం రాష్ట్రస్థాయి అధి కారులకు వివరించింది.
అయితే ఈ బృందం పర్యటించిన తర్వాత పాజిటివ్ కేసుల శాతం తగ్గింది. ఏ ప్రాంతంలో పాజిటివ్ కేసుల శాతం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో కరోనా కట్టడికి అదేస్థాయిలో వ్యాక్సినేషన్‌జరగాలి. వైద్య ఆరోగ్య శాఖ ముందు చూపు లేకపోవడమో.. ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవడం లేదా.. ప్రజలకు అవగాహన లేకపోవడమేమో కానీ వ్యాక్సినేషన్‌లో వేరియేష¯న్ ఉన్నట్లుగా బృందం గుర్తించి పరీక్షలు, టీకాలు పెంచాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఆ వైపు అడుగులు వేయడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి.
రెండు నెలలకు సరిపడా టీకాలు ఉన్నాయి
జిల్లాలోని ప్రజలకు కోవిడ్ టీకాలు రెండు నెలలకు సరిపడా అందుబాటులో ఉన్నాయి. 60 వేలకు పైగా కోవిడ్ టీకాలు సిద్ధంగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో టీకాలు వేసుకునేందుకు ప్రజలు ముందుకువస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారికి కరోనా టీకాలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకుంటే మహమ్మారి నుంచి రక్షించబడతారు.
– డాక్టర్ వెంకటరమణ, జిల్లా టీకాల అధికారి
కేసులు గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో ఏయే ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా యో గుర్తిస్తున్నాం. ఆయా చోట్ల పటిష్టచర్యలతో పాటుగా పరీక్షలు పెంచి టీకాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రెండోదశ కరోనా కొంతమేర తగ్గుముఖం పట్టినట్లయింది. మూడో దశను ఎదుర్కొనేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాం. ప్రజలు విధిగా మాస్క్, శానిటైజర్‌ను వినియోగించాలి.
– డాక్టర్ కోటాచలం, జిల్లా వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment