దిగాలు పడుతున్న థియేటర్లు | movie theatres closed in hyderabad | Sakshi
Sakshi News home page

Movie Theaters: దిగాలు పడుతున్న థియేటర్లు

Published Thu, May 16 2024 6:53 AM | Last Updated on Thu, May 16 2024 7:40 AM

movie theatres closed in hyderabad

కత్తిమీద సాముగా మారిన సినిమా హాళ్ల నిర్వహణ 

 కరోనా నుంచి వరుస దెబ్బలతో కుదేలు 

నగరంలో ఒకప్పుడు 113..ఇప్పుడు 70కి చేరిన వీటి సంఖ్య

సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా అంతర్జాతీయ స్థాయి సినిమా నిర్మాణాలకు, రూపకర్తలకు పుట్టినిల్లుగా నగరం ఓ వైపు దూసుకుపోతుంటే.. ఒకనాడు సినిమా వైభవానికి మేము సైతం అన్నట్టు బోయీలైన సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు నేడు నానాటికీ తీసికట్టు.. అన్నట్టు మారుతున్నాయి. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తాత్కాలికంగా థియేటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించడం వీటి యజమానుల్లో పేరుకుపోయిన నిరాశకు అద్దం పడుతోంది. ఓటీటీలూ, మల్టీప్లెక్సుల దెబ్బలు ఓర్చుకుంటుంటే.. పులి మీద పుట్రలా అన్నట్టు ఐపీఎల్‌ మ్యాచ్‌లూ, ఠారెత్తించిన ఎండలు, హోరెత్తించిన ఎన్నికలు పెరిగిపోయిన ప్రత్యామ్నాయ వినోదాలు.. అన్నీ కలిసి.. సింగిల్‌ స్క్రీన్‌ సందడికి తాత్కాలికంగానైనా తెరపడేలా చేసింది. 

 ఒకప్పుడు అంటే.. 1980లలో నగరంలో 113 సినిమా హాళ్లు ఉండేవి. ఆ సమయంలో నగరవాసులకు కాలక్షేపానికి కొదవ కూడా ఉండడంతో అవి రద్దీతో వరి్ధల్లేవి. కాలక్రమంలో నగర వాసులకు ప్రత్యామ్నాయ వినోదాలు పెరిగిపోతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లోనే పలు సింగిల్‌ స్క్రీన్స్‌  అంతర్థానమైతే మరికొన్ని మాల్స్‌గా, మల్టీప్లెక్స్‌లుగా కూడా రూపాంతరం చెందాయి. ఇప్పుడు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల సంఖ్య దాదాపు 70కి పడిపోయింది.  టికెట్‌ రేట్లు అమాంతం పెరగడం, మాల్స్, మల్టీప్లెక్సులు పుంజుకోవడం వంటి వరుస దెబ్బలతో ఒకటొకటిగా మూతపడుతూ వచ్చిన థియేటర్లను కరోనా, లాక్‌డౌన్‌ కోలుకోలేని దెబ్బ తీసింది. నగరంలోని అనేక సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌ లాక్‌ డౌన్‌ దెబ్బకి షటప్‌ అయిపోయాయి.
  
సింగిల్‌ స్క్రీన్స్‌ టు.. గోడౌన్స్‌.. 
లాక్‌డౌన్‌ ధాటికి క్రాస్‌ రోడ్స్‌లోని శ్రీ మయూరి, నారాయణగూడలోని శాంతి, టోలిచౌకిలోని గెలాక్సీ, మెహిదీపట్నంలోని అంబా, బహదూర్‌పురాలోని శ్రీరామ. థియేటర్‌లలో కొన్ని గోడౌన్స్‌గా మరికొన్ని ఇతర వ్యాపార వ్యవహారాల కోసం వినియోగంలోకి వెళ్లాయి. సుదర్శన్‌ 35ఎంఎం, దేవి 70 ఎంఎం థియేటర్ల యజమాని ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బాలగోవింద్‌ రాజు మాటల్లో చెప్పాలంటే.. ‘అమెజాన్‌ వంటి కంపెనీలకు గోడౌన్లుగా ఉపయోగించడానికి నగరంలో విశాలమైన  స్థలం అవసరం. అలాగే కొత్తగా వచ్చే సూపర్‌ మార్కెట్‌ బ్రాండ్‌లు కూడా థియేటర్‌లను సంప్రదిస్తున్నారు’ అని అభిప్రాయపడ్డారు. థియేటర్లకు అయ్యే ఖర్చుల గురించి మరో యజమాని  మాట్లాడుతూ.. ‘విద్యుత్, సిబ్బంది, నిర్వహణ మొదలైన ఖర్చుల కోసం నెలకు రూ. 1.2 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రేక్షకులు కరువైన సినిమాలను ప్రదర్శిస్తే నెలకు రూ.3 లక్షలకు ఆ నష్టం పెరుగుతుంది. దీనికన్నా కంపెనీలకు ఇవ్వడం బెటర్‌ కదా’ అన్నారు   

ఆదుకోని రీ రిలీజ్‌లూ...పార్కింగ్‌ ఫీజులూ... 
ప్రేక్షకుల నుంచి పార్కింగ్‌ ఫీజు వసూళ్లపై నిషేధం ఎత్తివేత వంటి ప్రభుత్వ చర్యలు కొంత ఊరటనిచి్చనా.. సింగిల్‌ స్క్రీన్స్‌కి అవి పూర్తిగా తెరిపినివ్వలేదు. భారీ వ్యయంతో సినిమాల రాకతో సింగిల్‌ స్క్రీన్స్‌కి పుట్టగతులు లేకుండా పోయిన పరిస్థితుల్లో.. రీ రిలీజ్‌ ల రూపంలో స్టార్స్‌ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. 

 ఆ కొత్త ట్రెండ్‌ కొంత కాలం సింగిల్‌ స్క్రీన్స్‌కి పూర్వవైభవంపై ఆశలు చిగురించేలా చేసింది. ఇటీవల ఆ ట్రెండ్‌కు కూడా గండి పడింది. ఈ నేపథ్యంలో నగరంలో సింగిల్‌ స్క్రీన్స్‌ మనుగడ సాగించాలంటే.. దండిగా సినిమాలు రావడం మాత్రమే కాదు మరిన్ని అనుకూల మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉందనేది సినీ థియేటర్‌ నిర్వహణలో అనుభవజు్ఞలు చెబుతున్న మాట.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement