సాక్షి, హైదరాబాద్: ఏదో ఒక తెలియని భయం, ఆందోళన, అభద్రతా భావం ఇప్పుడు అందరినీ ప్రభావితం చేస్తోంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా లోలోపల ఏదో టెన్షన్, అసంతృప్తి భావనలు మనసుపై ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కూడా అంతర్గతంగా మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటు, ఆదుర్దాలకు కారణమవుతున్నాయి. దాదాపు ఏడెనిమిది నెలలు గడిచినా కోవిడ్ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదా జవాబు దొరక్కపోవడంతో వివిధ వర్గాల ప్రజల్లో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇటు కోవిడ్ బారిన పడినవారు దాని దుష్ప్రభావాల నుంచి తేరుకునే క్రమంలో ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. (సెకండ్ వేవ్: కరోనా మార్గదర్శకాలు)
కరోనా సోకినపుడు పడిన బాధలు, రోగ లక్షణాలు ఇప్పటికీ కొందరిలో తొంగిచూస్తున్నాయి. ఈ వైరస్ ఇంకా సోకని వారు దాని బారిన తామెక్కడ పడతామోనన్న భయాందోళనల్లో బతుకుతున్నారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఇక వైరస్ ముగిసిన అధ్యాయమనే భావనలో ఏ జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న వారున్నారు. దీనికి భిన్నంగా ఇది రాకుండా చూసుకునేందుకు అతి జాగ్రత్తలు తీసుకుంటున్న వారూ ఉన్నారు. ఇవన్నీ వెరసి కొంత శాతం మినహాయిస్తే విభిన్న రంగాలు, వర్గాలకు చెందిన అత్యధిక శాతం మంది ఆందోళనలతో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సీనియర్ సైకియాట్రిస్ట్ ఎమ్మెస్ రెడ్డి, సైకాలజిస్ట్ సి.వీరేందర్ తమ విశ్లేషణతో పాటు అనుభవాలను పంచుకున్నారు.. వివరాలు వారి మాటల్లోనే..
ఇప్పుడు మాస్కే వ్యాక్సిన్.. ఏమరుపాటు తగదు!
కోవిడ్ మహమ్మారికి ఇప్పట్లో ‘ఎండ్ పాయింట్’అనేది కనిపించడం లేదు. కరోనా బారిన ఇప్పటికే పడినవారు ఒకవైపుండగా, అది ఎప్పుడు సోకుతుందా అన్న భయంతో బతుకుతున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తమ కుటుంబంలోనో, దగ్గరి బంధువులో లేక మిత్రులకో కరోనా సోకడమో లేక దానివల్ల వారిలో ఎవరైనా మరణించిన ఘటనలు అధిక శాతం మందిని కలవరపెడుతున్నాయి. ఆప్తుల నుంచో లేక సహోద్యోగుల నుంచో తమకు కరోనా ఎక్కడ సోకుతుందో, చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందేమో, దాని నుంచి బతుకుతామో లేదోనన్న భయాందోళనలు పలువురిని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దీనికి సంబంధించిన వార్తలు వినేందుకు, తెలుసుకునేందుకు కూడా కొందరు సిద్ధపడటం లేదు. ఆప్తుల నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు అది ఏ దుర్వార్తో అని ఊహించుకుంటున్న వారూ ఉన్నారు. కరోనా వచ్చి తగ్గాక పలువురు ఆరు వారాలకు మించి ‘యాంగ్జయిటీ, డిప్రెషన్’లను ఎదుర్కొంటున్నారు. (ఈ సమయంలో ఎన్నికలా?)
కొంచెం దగ్గు, జలుబు చేసినా ఆందోళన పడేవారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటూ ‘అబ్ససీవ్ కంపల్సీవ్ డిజార్డర్స్’(ఓసీడీ)తో బాధపడుతుంటే.. మరికొందరు 30 ఏళ్ల లోపు వాళ్లు పూర్తిగా రిలాక్సయ్యి బహిరంగ ప్రదేశాలు, ఇతర చోట్ల గుంపులుగా తిరిగేస్తున్నారు. 50 నుంచి 60 శాతం మందే మాస్క్‌లు ధరిస్తున్నారు. పండుగలప్పుడు చాలామంది ఏ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అప్రమత్తంగా ఉండకుండా, మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలు పాటించకపోతే 10 నిమిషాల్లోనే వైరస్ సోకే ప్రమాదముంది. భారత్‌లో ఇప్పుడు కేసులు తగ్గినట్టు కనిపిస్తున్నా యూఎస్, ఐరోపాలో మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీసం వచ్చే మూడు నెలల పాటు 55 ఏళ్లకు పైబడిన వారంతా ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరో 6 నెలల దాకా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనందున తక్కువ ఖర్చుతో, సులభంగా ఉపయోగించే మాస్క్‌నే వ్యాక్సిన్‌గాభావించాలి... (రాబోయే మూడు నెలలు జాగ్రత్త! )
– సీనియర్ సైకియాట్రిస్ట్ ఎమ్మెస్ రెడ్డి
సమాజంలో పెరుగుతున్న అశాంతి..
సమాజంలో క్రమంగా అశాంతి పెరుగుతోంది. స్థితిమంతమైన కుటుంబాలు మినహాయించి ఇతర కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, ఇంటి సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగి, అర్థం చేసుకునే పరిస్థితులు తగ్గాయి. ముసలివారి నుంచి పిల్లల వరకు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అన్ని సమయాల్లో అందరూ ఇళ్లలోనే ఉండటంతో దంపతుల మధ్య ‘ప్రైవసీ’సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుత అనిశ్చితి ఎంతకాలం కొనసాగుతుందో తెలియక స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు చిన్న వ్యాపారాలు మొదలుకొని ఒక మోస్తరు వ్యాపారాలు చేసేవారు కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడం వివిధ వర్గాల ప్రజలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది.
ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలను ఒక రకమైన అభద్రతా భావానికి గురిచేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితులే మరో 3, 4 నెలలు కొనసాగితే అశాంతి మరింత పెరిగి, దొంగతనాలు, కిడ్నాప్‌లు, హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వ పరంగా ‘సపోర్టింగ్ మెకానిజం’ఆవశ్యకత ఏర్పడింది. మహిళలు, పురుషుల్లో, పెద్దవారిలో యాంగ్జయిటీ ఏర్పడటంతో పాటు నిద్రలేమి అధిక శాతం మందిని బాధపెడుతోంది. రాత్రి ఆలస్యంగా నిద్ర పోయినా, మళ్లీ ఏ అర్ధరాత్రో నిద్రలేచి కూర్చోవడం, మున్ముందు ఏదైనా ఉపద్రవం రాబోతోందా? ఇంకా తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయా అన్న ఆందోళనలో చాలామంది గడుపుతున్నారు. తెలంగాణ, ఏపీల నుంచి మాకు వచ్చే ఫోన్ కాల్స్ ఎక్కువగా ఈ సమస్యలకు సంబంధించే ఉంటున్నాయి. కరోనా వస్తే ఏర్పడే ‘సోషల్ స్టిగ్మా’చాలామందిని భయపెడుతోంది. సమాజం, తెలిసిన వారి దృష్టిలో చులకనై పోతామనే భావనను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. – సైకాలజిస్ట్ సి.వీరేందర్
10 మంది మహిళల్లో 8 మందిపై దుష్ప్రభావాలు:
డెలాయిట్ గ్లోబల్ సర్వే
కోవిడ్ మహమ్మారి తమ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు మహిళలు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా తమ మానసిక స్థితి, వ్యక్తిగత ఆరోగ్యంపై దుష్ప్రభావాలతో పాటు ఆఫీసు, ఇంటి పనులు/రోజువారీ జీవన సమతూకం దెబ్బతిన్నట్లు 82 శాతం మంది తమ పరిశీలనలో వెల్లడించారని డెలాయిట్ గ్లోబల్ సర్వే తెలిపింది. కరోనా కేసులు మొదలయ్యాక చాలా మంది మహిళల పనిచేసే పద్ధతులు, రోజువారీ జీవన విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్టు, కుటుంబ భారం, ఇళ్ల పనుల బాధ్యతలు మరింతగా పెరిగినట్లు 65 శాతం మంది మహిళలు వెల్లడించినట్టు ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్స్‌పై నిర్వహించిన అధ్యయనంలో డెలాయిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment