కోవాగ్జిన్‌కు డిక్లరేషన్‌ మస్ట్‌.. | Corona Patients Give Declaration Acceptance Letter For Covaxin Vaccine | Sakshi
Sakshi News home page

కోవాగ్జిన్‌కు డిక్లరేషన్‌ మస్ట్‌..

Published Thu, Jan 14 2021 1:48 AM | Last Updated on Thu, Jan 14 2021 8:48 AM

Corona Patients Give Declaration Acceptance Letter For Covaxin Vaccine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా వేసుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఆ పత్రంపై సంతకం చేసిన వారికే టీకా వేస్తారని పేర్కొంది. కోవాగ్జిన్‌ ట్రయల్స్‌ పూర్తి కానందున అంగీకారపత్రం (కన్సెంట్‌) అడుగుతున్నారని తాము భావిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. కేంద్రం ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ భారత్‌ బయోటెక్‌ సంస్థ లబ్ధిదారుల నుంచి అంగీకారపత్రం తీసుకోవా లని కోరిన అంశంపై చర్చ జరిగిందని ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు.

అయితే అంగీకారపత్రంలో ఎటువంటి అంశాలుంటాయో ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. సాధారణంగా ట్రయల్స్‌లో ఉన్నవాటి విషయంలో మాత్రమే అంగీకారపత్రం తీసుకుంటారని, అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న ఆక్స్‌ఫర్డ్‌ కోవిషీల్డ్‌ టీకాకు ఎలాంటి అంగీకారపత్రం అడగడం లేదని ఆయన తెలిపారు. కాగా తెలంగాణకు 20 వేల డోసుల కోవాగ్జిన్‌ టీకాలు బుధవారం వచ్చి నట్లు ఆయన ధ్రువీకరించారు. వాటిని హైదరాబాద్‌ స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే అంగీకారపత్రంపై సంతకం చేస్తూ టీకా తీసుకునే వారు ఎవరు ఉంటారన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. 

ప్రారంభ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు
ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. 40 ప్రైవేట్, 99 ప్రభుత్వ కేంద్రాల్లో టీకాలు వేయాలని తొలుత నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇప్పుడు మార్చుకుంది. ప్రైవేట్‌ కేంద్రాల్లో టీకాల కార్యక్రమాన్ని వాయిదా వేసి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 139 కేంద్రాల్లో టీకాలు వేయాలని నిర్ణయించారు. తొలిరోజు 55,270 మంది వైద్య సిబ్బందికి టీకా వేస్తారు. మొత్తం వ్యవస్థను తన నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా ఏదైనా సమస్య తలెత్తితే సరిదిద్దాలనేది సర్కారు యోచనగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్‌ మొదలైన వారం రోజుల తర్వాత ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కానుందని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

రాష్ట్రంలో తొలి టీకాను గాంధీ ఆసుపత్రిలో ఒక పారిశుధ్య కార్మికునికి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. 139 టీకా కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన పద్దతుల్లో ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించుకోవచ్చని, రిబ్బన్‌ కటింగ్‌ చేయడం ద్వారా ప్రారంభం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతీ టీకా కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌ ఉంటారు. లబ్దిదారుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలుకానీ, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటే టీకా వేయబోమని డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. అందుకోసం టీకా కేంద్రం వద్ద తప్పనిసరిగా థర్మల్‌ గన్‌తో జ్వరం చూస్తారు. 

వ్యాక్సిన్‌ వేసుకున్నాక సర్టిఫికేట్‌
కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నవారందరికీ కోవిన్‌ యాప్‌ ద్వారా సర్టిఫికేట్లు అందజేయనున్నారు. లబ్దిదారుల ఫోన్‌ నెంబర్లకు ఆయా సర్టిఫికేట్లు లింక్‌ ద్వారా పంపుతారు. మొదటి డోస్‌ టీకా వేసుకున్నాక రెండో టీకా ఎప్పుడు ఎక్కడ వేసుకోవాలో లబ్దిదారుడి మొబైల్‌ నెంబర్‌కు మెసేజ్‌ వస్తుంది. రెండో డోస్‌ సమయం దగ్గర పడుతున్నప్పుడు గుర్తుచేసే (రిమైండర్‌) మెసేజ్‌లు కూడా వస్తాయి. రెండు నెలలపాటు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకే టీకా వేస్తారని శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి సమస్యలు, సైడ్‌ఎఫెక్ట్‌లు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్రస్థాయిలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ప్రతీ టీకా నిల్వ కేంద్రంలో 24 గంటల భద్రత ఏర్పాటు చేస్తారు. కోల్డ్‌చైన్‌ సెంటర్లలో సీసీటీవీలను ఏర్పాటు చేస్తారు. అడిషనల్‌ డీజీ జితేంద్ర రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ భద్రతను పర్యవేక్షిస్తారని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలావుండగా ఎవరికి ఎప్పుడు టీకా వేయాలో సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆటోమేటిక్‌గా లబ్దిదారుల మొబైల్‌లకు మెసేజ్‌లు వెళ్తాయి. అయితే లబ్దిదారుల ప్రాధాన్యాన్ని గుర్తించే అవకాశం తమకు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 

సైడ్‌ఎఫెక్ట్స్‌‌ పరిష్కారానికి రాష్ట్రస్థాయి కాల్‌ సెంటర్‌
కరోనా టీకా సమయంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌‌‌ వస్తే అవసరమైన సందర్భాల్లో వైద్య సూచనలు, సలహాలు పొందడానికి రాష్ట్రస్థాయిలో ఒక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐదుగురు వైద్య నిపుణులు ఉంటారు. వీరిలో ఒక్కొక్కరికి ఐదారు జిల్లాల చొప్పున కేటాయిస్తారు. ఆయా జిల్లాల్లో టీకా పంపిణీ కేంద్రాల్లోని మెడికల్‌ ఆఫీసర్‌ వద్ద ఈ వైద్య నిపుణుల ఫోన్‌ నెంబర్లు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో మెడికల్‌ ఆఫీసర్లు సంబంధిత వైద్యనిపుణులను ఫోన్‌ ద్వారా సంప్రదిస్తారు. ఆయా నిపుణుల సూచనల మేరకు అత్యవసర చికిత్స అందిస్తారు. పరిస్థితి తీవ్రతను బట్టి సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement