రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా మంది బాధితులు ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఇలాంటి కొందరిలో ఆరోగ్య పరిస్థితి మరీ సీరియస్‌గా లేకపోయినా.. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతుండటం కనిపిస్తోంది. అలాంటి వారి రక్తంలో ఆక్సిజన్ స్థాయులను సహజంగా పెంచుకునేలా ‘ప్రోనింగ్’ అనే టెక్నిక్ ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. స్వల్పంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో.. ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోకుండా ఉండేందుకు, వీలైతే స్థాయులు పెరిగేందుకు ఈ పద్ధతి తోడ్పడుతుందని సూచించింది. అసలు ఈ ప్రోనింగ్ టెక్నిక్ ఏమిటి? ఎలా చేయాలి? శ్వాస సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం..
ప్రోనింగ్ టెక్నిక్ అంటే?
ఊపిరి సరిగా అందని సమయంలో బోర్లా పడుకోవడం, పక్కలకు తిరగడం, వాలుగా కూర్చోవడం వంటివి చేయడమే ప్రోనింగ్. కరోనా సోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఆవశ్యకత ఏంటి?
ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారు రక్తంలో ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రోనింగ్ టెక్నిక్ ద్వారా గాలి పీల్చుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. వాయుకోశాలు తెరుచుకోవడం ద్వారా శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది. ఆక్సిజన్ లెవల్స్ 94 కన్నా తగ్గితే ప్రోనింగ్ ద్వారా ప్రాణాలు కాపాడొచ్చు.
ప్రోనింగ్‌కు ఏమేం కావాలి?
ప్రోనింగ్‌కు కావాల్సిందల్లా 4 నుంచి 5 దిండ్లు. బోర్లా పడుకుని ఒక దిండు తల కింద పెట్టుకోవాలి. 1 లేదా 2 దిండ్లు ఛాతీ నుంచి తొడల వరకు నిలువుగా ఉంచుకోవాలి. రెండు దిండ్లు మోకాళ్ల కింద నిలువుగా ఉంచుకోవాలి.
ఏ పొజిషన్‌లో కూడా ఎక్కువ సేపు పడుకోవద్దు. 30 నిమిషాలకోసారి పడుకునే పొజిషన్లను మారుస్తూ ఉండాలి.
సొంతంగా కదలగలిగితే పేషెంట్ స్వయంగా దీనిని అనుసరించవచ్చు. పేషెంట్ సొంతంగా కదిలే పరిస్థితి లేకుంటే కొందరి సాయంతో ప్రోనింగ్ చేయాల్సి ఉంటుంది.
సొంతంగా ఎలా చేయాలి..?
ప్రతి పొజిషన్ కూడా 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండొచ్చు. రెండు గంటలకు మించి మాత్రం ఒకే పొజిషన్‌లో ఉండొద్దు.
పొజిషన్–1: బోర్లా పడుకోవాలి.
పొజిషన్–2: కుడివైపు తిరిగి పడుకోవాలి.
పొజిషన్–3: వాలుగా కూర్చోవాలి.
పొజిషన్–4: ఎడమ వైపు తిరిగి పడుకోవాలి.
పొజిషన్–5: తిరిగి మొదటి పొజిషన్‌లో పడుకోవాలి. అంటే బోర్లా పడుకోవాలి.
ఎవరు ప్రోనింగ్ చేయొద్దు?
► గర్భంతో ఉన్న వారు ప్రోనింగ్ చేయొద్దు
► సిరల్లో రక్తం గడ్డ కట్టుకుపోయిన వారు
(వీనస్ త్రాంబోసిస్) (48 గంటలలోపు చికిత్స తీసుకున్నవారు)
► తీవ్రమైన గుండె సమస్యలు ఉన్న వారు
► వెన్నెముక, తొడ ఎముక, కంటి ఎముకలకు తీవ్రంగా గాయాలైన వారు
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
► ఆహారం తీసుకున్న గంట వరకు ప్రోనింగ్ చేయొద్దు.
► ఏ పొజిషన్‌లో అయినా భరించగలిగినంత సేపు మాత్రమే పడుకోవాలి.
► శరీర భాగాలపై ఒత్తిడి తగ్గించేందుకు దిండ్లను మార్చుకుంటూ ఉండొచ్చు.
► ఎక్కడైనా నొప్పి కానీ, బొబ్బలు కానీ
వస్తున్నాయో గమనించాలి.
► పెద్దగా ఇబ్బందేమీ లేకుంటే ప్రోనింగ్‌ను రోజుకు 16 గంటల వరకు దశలు దశలుగా చేయొచ్చు.
కదలలేని పేషెంట్లకు ప్రోనింగ్ ఎలా?
► పలుచటి బెడ్‌షీట్ ఉపయోగించి రోగిని బెడ్‌పై ఒక పక్కకు జరపాలి.
► పేషెంట్‌ను ఒక పక్కకు తిప్పి మరో బెడ్‌షీట్‌ను పరచాలి. తర్వాత పేషెంట్‌ను మరోవైపునకు తిప్పి ఆ బెడ్‌షీట్‌ను రెండోవైపు లాగాలి.
► ఆ బెడ్‌షీట్లను పైకి లాగుతూ.. పేషెంట్ బోర్లా పడుకునేలా తిప్పాలి. అదే సమయంలో దిండ్లను ఛాతీ కింద, మోకాళ్ల దిగువన ఏర్పాటు చేయాలి.
► తర్వాత రోగిపై బెడ్‌షీట్‌ను తొలగించాలి.
► ఇదే తరహాలో బెడ్‌షీట్లను ఉపయోగిస్తూ పేషెంట్‌ను పక్కలకు తిప్పాలి.
(చదవండి: టీకా వేసుకున్నా కరోనా వస్తుందా? వస్తే రెండో డోసు పరిస్థితి ఏమిటి? )
Comments
Please login to add a commentAdd a comment