డాక్టర్ సేనాపతిపై దాడి చేస్తున్న మృతుడి కుటుంబ సభ్యులు(ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
డిస్పూర్: మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి మరి కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల జనాలు వారి త్యాగాన్ని మర్చిపోయి.. వైద్య సిబ్బందిపై దాడి చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి అసోంలో చోటు చేసుకుంది. ఆక్సిజన్ కొరత వల్ల కరోనా బాధితుడు ఒకరు మృతి చెందారు. ఈ క్రమంలో అతడి కుటుంబ సభ్యులు మృతుడికి వైద్యం చేసిన డాక్టర్‌పై దారుణంగా దాడి చేశారు. కింద పడేసి తంతూ.. చేతికి దొరికిన వస్తువులతో చితకబాదారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే.. వెంటపడి మరీ కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
అసోం గువహటి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజై నగరంలోని ఉడాలి మోడల్ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పిపాల పుఖురి గ్రామానికి చెందిన ఉద్దీన్ అనే వ్యక్తికి కరోనా సోకింది. ఈ క్రమంలో అతడిని హుజైలని ఉడాలి మోడల్ ఆస్పతిలో చేర్పించారు. డాక్టర్ సీజ్ కుమార్ సేనాపతి అతడికి వైద్యం అందించారు. చికిత్స పొందుతున్న ఉద్దీన్ మంగళవారం సాయంత్రం మరణించాడు. డాక్టర్ సేనాపతి నిర్లక్ష్యం వల్లనే ఆక్సిజన్ కొరతతో ఉద్దీన్ మరణించాడని భావించిన అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రిపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సేనాపతిని వెంటాడి మరీ చితకబాదారు.
డాక్టర్ సేనాపతి మాట్లాడుతూ.. ‘‘మంగళవారం సాయంత్రం నేను విధుల్లో ఉండగా ఉద్దీన్ సహాయకుడు ఒకరు వచ్చి అతడి పరిస్థితి విషమిస్తుందని నాకు తెలిపాడు. నేను రూమ్‌లోకి వెళ్లేసరికే ఉద్దీన్ మరణించాడు. దీని గురించి అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశాను. వారంతా నా వల్లనే ఉద్దీన్ చనిపోయాడని భావించి నాపై దాడికి దిగారు. సుమారు 30 మంది వరకు ఆస్పత్రిపై దాడి చేశాను. వారికి భయపడి నేను ఓ రూమ్‌లోకి పరిగెత్తి దాక్కుందామని ప్రయత్నించినప్పటికి దాని డోర్ తెరుచుకుని వచ్చి.. నాపై దాడి చేశారు. నా మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు, మోబైల్ ఫోన్ లాక్కున్నారు’’ అని తెలిపాడు.
Such barbaric attacks on our frontline workers won't be tolerated by our administration. @gpsinghassam @assampolice Ensure that the culprits brought to justice. https://t.co/HwQfbWwYmn
— Himanta Biswa Sarma (@himantabiswa) June 1, 2021
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సేనాపతిని వెంటనే నాగావ్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జె.ఎ.జయలాల్ ఈ దాడిపి తీవ్రంగా ఖండించారు. అసోం చాప్టర్ ఆఫ్ అసోం మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (అమ్సా) సభ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుడిపై దాడికి నిరసనగా అన్ని ప్రభుత్వ వైద్య సదుపాయాలలో వారు ఈ రోజు ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) సేవలను బహిష్కరించారు. అత్యవసర సేవలు, కోవిడ్ విధులు కొనసాగుతాయని.. బ్లాక్ బ్యాడ్జీ ధరించి వైద్యులు విధుల్లోకి హాజరవుతారని తెలిపారు. ఈ దాడిపై దర్యాప్తు జరిపి బాధ్యులను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పోలీసులను ఆదేశించారు.
చదవండి: లక్షలతో కాదు, ఒక్క ఫోన్ కాల్ తో కరోనా పేషెంట్లను బ్రతికిస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment