టెస్టులు భారీగా పెంచండి | Corona tests should increase High court directs TG Govt | Sakshi
Sakshi News home page

టెస్టులు భారీగా పెంచండి

Published Wed, Jul 29 2020 1:53 AM | Last Updated on Wed, Jul 29 2020 7:46 AM

Corona tests should increase High court directs TG Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌
కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య భారీగా పెంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. రాజస్తాన్‌లో కరోనా కేసుల సంఖ్య 35,909 ఉండగా ప్రతి 10 లక్షల జనాభాకు 17,833 మందికి పరీక్షలు చేస్తున్నారని, తెలం గాణలో 54,059 కేసులున్నా కేవలం 9,496 టెస్టులే చేస్తున్నారెందుకని ప్రశ్నించింది. ఢిల్లీలో ప్రతి మిలియన్‌కు 46 వేలు, ఏపీ, తమిళనాడుల్లో 30 వేల చొప్పున పరీక్షలు చేస్తున్నారని, ఈ తరహాలో తెలంగాణలోనూ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణలో తీసుకోవాల్సిన చర్యలు, డాక్టర్లు ఇతర సిబ్బందికి పీపీఈ కిట్లు ఇవ్వాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశించా లని... ఇలా దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శులు, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లు వ్యక్తిగతంగా వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. గత 2 నెలల కాలంలో  తామి చ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం సోమేష్‌కుమార్‌ను ప్రశ్నించింది. 

21–50 వయసు వారు జాగ్రత్తగా ఉండాలి
‘‘ప్రభుత్వం సమర్పించిన లెక్కల ప్రకారం మొత్తం కరోనా బారినపడిన వారిలో 21–50 ఏళ్ల వయస్సున్న వారు 65 శాతం, 50 ఏళ్లు పైబడినవారు 25.6 శాతం, 10 ఏళ్లలోపు చిన్నారులు 3.4 శాతం మంది ఉన్నారు. 21–50 మధ్య వయసున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను మరింత జాగ్రత్తగా పాటించాలి. అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. వచ్చినా మాస్కు పెట్టుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. సానిటైజర్‌ను వెంటపెట్టుకోవాలి. కరోనా మరింత మందికి వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి’’అని ధర్మాసనం ఆదేశించింది. 

నిరుపేదలకూ క్వారంటైన్‌ కేంద్రాలు
‘‘నిరుపేదలకూ క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయండి. చిన్న ఇళ్లలో ఉన్న వారిలో ఒకరికి కరోనా వస్తే ఇతర కుటుంబసభ్యులు వ్యాధి బారినపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ హాల్స్‌ను క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చండి. వ్యాధి తీవ్రత ఎక్కువగా లేని వారిని ఆయా కేంద్రాలకు తరలించండి. వ్యాధి మరింత మందికి వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే డబ్బు పెట్టుకునే వారికి ప్రత్యేకంగా ఎక్కడైనా క్వారంటైన్‌లో ఉండేందుకు ఏర్పాట్లు చేయండి’’అని ధర్మాసనం ఆదేశించింది. 

తెలుగులో సమాచారం ఇవ్వండి
‘‘కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తెలుగులో కూడా ఇవ్వండి. అలాగే ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లోనూ పొందుపర్చండి. ప్రసార మాద్యమాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయండి. ఏ హాస్పిటల్‌లో ఎన్ని బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి ? అందులో వెంటిలేటర్‌ బెడ్స్‌ ఎన్ని, ఆక్సిజన్‌ బెడ్స్‌ ఎన్ని ? సాధారణ బెడ్స్‌ ఎన్ని ఉన్నాయి? తదితర పూర్తి వివరాలు ప్రజలకు అందించండి. ప్రతి హాస్పిటల్‌లో బెడ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రధాన ద్వారం దగ్గర బోర్డుపై ఉంచేలా చూడండి. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో ఆడ్మిషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేయండి. కరోనా పాజిటివ్‌ పేషెంట్స్‌ను కలిసిన వారి వివరాలూ తెలియజేయండి. వారికి 5వ, 10వ రోజున పరీక్షలు చేయండి. ఆ వివరాలను కూడా బులెటిన్‌లో పొందుపర్చండి’’అని ధర్మాసనం ఆదేశించింది.

ఫీ‘జులుం’పై దృష్టి పెట్టండి
‘‘కరోనా పరీక్షలకు సంబంధించిన ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ వంటి పరీక్షలకు ఫీజులు ఎంత ఉండాలనేది నిర్ణయించండి. గతంలో ఇచ్చిన జీవోను సమర్థవంతంగా అమలు చేయండి. అలాగే కరోనా చికిత్సలకు నిర్ణయించిన మేరకే ప్రైవేటు హాస్పిటల్స్‌ ఫీజులు వసూలు చేసేలా చర్యలు తీసుకోండి. చికిత్సలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించండి. నిబంధనలు ఉల్లంఘించిన హాస్పిటల్స్‌పై తగిన చర్యలు చేపట్టండి’’అని ధర్మాసనం ఆదేశించింది. అన్ని ఆదేశాలను అమలు చేయాలని, తీసుకున్న చర్యలను ఆగస్టు 13 లోగా సమర్పించాలని, 13న విచారణకు సీఎస్‌తోపాటు ఇతర అధికారులు హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 

సాధ్యమైనవన్నీ చేస్తున్నాం : సీఎస్‌
కరోనా కట్టడికి మానవ సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ నివేదించారు. ఏ సమాచారాన్ని రహస్యంగా పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం శాయశక్తులా పనిచేస్తోందని తెలిపారు. కొందరు జిల్లా కలెక్టర్లు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, ఇతర సిబ్బంది కరోనా బారినపడినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా కరోనా కట్టడికి, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడతున్నామని వివరించారు. హైకోర్టు ఆదేశాలను రెండు వారాల్లో పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

సీఎస్‌ ఇంకా ఏం చెప్పారంటే....
ప్రతి 10 లక్షల జనాభాకు టెస్టుల సంఖ్యను 10,245కు పెంచాం. ఈ సంఖ్యను రానున్న రోజుల్లో మరింతగా పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,100 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. లక్షణాలు ఉన్నా లేకపోయినా పరీక్షా కేంద్రాలకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నాం. కరోనా పాజిటివ్‌ రోగులను కలిసిన వారికీ పరీక్షలు చేస్తున్నాం.
పరీక్షల సంఖ్య ఇంతగా ఎలా పెంచారంటూ కర్ణాటక ప్రభుత్వ అధికారులు మన వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. 
గాంధీ హాస్పిటల్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. లక్షణాలతో వచ్చిన వారిని వెంటనే అడ్మిట్‌ చేసుకొని చికిత్స ప్రారంభిస్తున్నాం. 
హితం యాప్‌ను రూపొందించాం. పదవీ విరమణ చేసిన, ఇళ్ల నుంచే పనిచేయాలనుకునే 173 మంది డాక్టర్లు ఇందులో రిజిస్టర్‌ చేసుకున్నారు. ఒక డాక్టర్‌ 50 నుంచి 70 మంది రోగులను ఫోన్‌లో సంప్రదిస్తారు. వారు పూర్తిగా కోలుకునే వరకూ నిత్యం వారికి వైద్య సహాయం అందిస్తారు. ప్రిస్కిప్షన్‌ సైతం ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపిస్తారు. అవసరమైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తాం.
కరోనాకు సంబంధించిన సమాచారాన్ని 104 నెంబర్‌కు కాల్‌ చేసి తెలుసుకోవచ్చు. ఇందుకు 85 లైన్లను ఏర్పాటు చేశాం. ఒకేసారి 85 మంది ఫోన్‌ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 108 నెంబర్‌కు కాల్‌ చేసినా వెంటనే అంబులెన్స్‌ను పంపుతున్నాం.
జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 1,045 కంటైన్‌మెంట్‌ జోన్లను గుర్తించాం. 2,940 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతం పర్యవేక్షిస్తున్నాం. 1.22 లక్షల ఇళ్లు క్వారంటైన్‌లో ఉన్నాయి. ఆయా ఇళ్లలో ఉన్న వారు బయటకు రాకుండా వారికి అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నాం. 
లక్షణాలు ఉన్న వారికి వెంటనే వైద్యం అందిస్తున్నాం. కరోనా కిట్‌ను కూడా ఇస్తున్నాం. 85 శాతం మంది ప్రజలు హాస్పిటల్స్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే సరిపోతుంది. 
జిల్లా ఆసుపత్రుల్లో ఉన్న సాధారణ బెడ్స్‌ను ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చాం. 1,471 వెంటిలేటర్లకు, 500 హైఫ్లో నాసల్‌కెలాన్స్‌కు ఆర్డర్స్‌ ఇచ్చాం. 
నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు హాస్పిటల్స్‌పై దాడులు చేసి వాటిని సీజ్‌ చేయవచ్చు. కాకపోతే ప్రజలు ఇబ్బందిపడతారనే ఆ పని చేయడం లేదు. షోకాజ్‌ నోటీసులు ఇచ్చి నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నాం. 
ప్రైవేటు హాస్పిటల్స్‌కి సమీపంలో ఉన్న హోటల్స్‌ను క్వారంటైన్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ మేరకు 857 గదులను అందుబాటులో ఉంచగా, 248 గదుల్లో పాజిటివ్‌ వచ్చిన, స్వల్పలక్షణాలు ఉన్నవారు ఉన్నారని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement