సాక్షి, హైదరాబాద్: కరోనా వైద్యం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికే పరిమితం కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక కరోనా ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం వైఖరి తెలియాల్సివుందని హైకోర్టు గురువారం పేర్కొంది. ఈ నెల 17న జరిగే విచారణ సమయంలో ప్రభుత్వం వివరణ ఇస్తుందని, ఆ తర్వాతే స్పందిస్తామని కోర్టు తెలిపింది. పూర్వపు జిల్లా కేంద్రాల్లో వంద పడకల కరోనా ఆస్పత్రి, కొత్త జిల్లా కేంద్రాల్లో 50 పడకల కరోనా ఆస్పత్రి ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, రిటైర్డు ప్రిన్సిపల్ రాజేంద్రబాబు పిల్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలని వారి తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోరారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలిచ్చామని, జిల్లా కేంద్రాల్లో కరోనాకు ప్రత్యేకంగా ఆస్పత్రుల ఏర్పాటుపై ప్రభుత్వం 17న జరిగే విచారణ సమయంలో తెలియజేస్తుందని, అప్పుడే ఈ పిల్‌ను కూడా కలిపి విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment