కటకటాల్లో ‘కరోనా బాబా’ | Coronavirus Fraud Baba Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

కటకటాల్లో ‘కరోనా బాబా’

Published Sun, Jul 26 2020 8:25 AM | Last Updated on Sun, Jul 26 2020 10:03 AM

Coronavirus Fraud Baba Arrested In Hyderabad - Sakshi

‘నా పేరు కరోనా బాబా... నాకు అతీత శక్తులున్నాయి... మాయలు మంత్రాలతో ‘కరోనా’ రాకుండా చేస్తా... మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు...’ అంటూ అమాయక ప్రజలు నమ్మేలా తన శిష్యులతో ప్రచారం చేయించాడు. మోసపూరిత మాటలను నమ్మి ఆయన వద్దకు వచ్చిన అమాయకుల నుంచి వేలాది రూపాయలు దండుకున్నాడు. 

సాక్షి, మియాపూర్‌: కరోనా పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన కరోనా బాబాను మియాపూర్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకటేష్‌ సమాచారం మేరకు... మియాపూర్‌ న్యూ హఫీజ్‌పేట్‌లోని హనీఫ్‌కాలనీకి చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ అలియాస్‌ కరోనా బాబా కొన్ని సంవత్సరాలుగా కాలనీలోని దర్గా వద్ద కూర్చొని ప్రజలకు మంత్రాలు వేస్తూ... తాయత్తులు కడుతుండేవాడు. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో వారి ఆందోళనను ఆసరాగా చేసుకొని తనకు అతీత శక్తులున్నాయి.. కరోనాను మటుమాయం చేస్తాను అని అమాయక ప్రజలను నమ్మించాడు. మంత్రాలు, నిమ్మకాయలు, విభూతితో పూజలు చేసి కరోనాను నయం చేస్తానంటూ తన దగ్గరకు వచ్చే అమాయకులను నమ్మించాడు. తనకున్న అతీత శక్తులతో కరోనా బారిన పడకుండా చేస్తానని... ఎవరూ మాస్కులు పెట్టుకోనవసరం లేదని చెప్పుకొచ్చాడు.

దగ్గు, జలుబు ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా వచ్చిందని తన శిష్యులతో ప్రచారం చేసి తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నాడు. అతని వద్దకు వచ్చిన అమాయకులను కోవిడ్‌–19 బూచిగా చూసి భయభ్రాంతులకు గురిచేçస్తూ వ్యాధి నయం చేస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో అతని మాయమాటలు నమ్మిన జనం శుక్రవారం రాత్రి 30 మంది వరకు వచ్చారు. చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు మెహిదీపట్నం, బోరబండ తదితర ప్రాంతల నుంచి కూడా వచ్చారు. బాబా ఉన్న ప్రాంతంలో జనం ఎక్కువగా గుమిగూడటంతో స్థానికులు మియాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న జనాన్ని పంపించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే ఆస్పత్రికి వెళ్లాలని ప్రజలకు సూచించారు. ఇలాంటి మూఢ నమ్మకాల బూచితో అమాయక ప్రజలను నమ్మించి మోసాలు చేసే బాబాలను నమ్మకూడదని కోరారు.

మార్చి నుంచి కరోనా బాబాగా అవతారం ఎత్తాడని ఇప్పటి వరకు సుమారు 70 మంది వరకు బాధితులు మోసపోయారని సమాచారం. బోరబండకు చెందిన ఇద్దరితో ఒకరి నుంచి రూ. 12 వేలు, ఇంకొకరి నుంచి రూ. 28 వేలు వసులు చేశాడని బాధితులు మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అమాయక జనాన్ని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు. అతనిపై సుమోటో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement