Coronavirus: ‘లాంగ్‌ కోవిడ్‌..’ లైట్‌ తీస్కోవద్దు! | Coronavirus: Lung Covid Infections In Recovered Corona Patients | Sakshi
Sakshi News home page

Coronavirus: ‘లాంగ్‌ కోవిడ్‌..’ లైట్‌ తీస్కోవద్దు!

Published Sat, May 22 2021 8:43 AM | Last Updated on Sat, May 22 2021 1:13 PM

Coronavirus: Lung Covid Infections In Recovered Corona Patients - Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: కోవిడ్‌ వచ్చి తగ్గినవారిలో పూర్తిగా  కోలుకుంటున్నవారు, కొద్దిరోజులపాటు  ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు.  కానీ  కొందరిలో కోవిడ్‌ తగ్గిన మొదట్లో మామూలుగానే  అనిపించినా.. కొద్దిరోజుల తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరికొందరు రెండు, మూడు నెలల వరకు ఇబ్బంది పడుతున్నారు. దీనినే ‘లాంగ్‌ కోవిడ్‌..’గా పిలుస్తున్నారు. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ సమయంలో ఇలా దీర్ఘకాలం లక్షణాలు కనిపిస్తున్నాయి. మరి ఇలా ఎందుకు అవుతోంది, ఏమేం సమస్యలు వస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న సందేహాలు వస్తున్నాయి. దీనికి కేంద్ర వైద్యారోగ్య శాఖతోపాటు పలువురు వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. అవేంటో తెలుసుకుందామా? 

కోవిడ్‌ తగ్గాక ఎలాంటి సమస్యలు, ఎన్నిరోజుల వరకు ఉంటాయి? 
కోవిడ్‌ లక్షణాలు తగ్గిపోగానే దాన్నుంచి పూర్తిగా బయపడినట్టు కాదు. కోవిడ్‌ తర్వాత (పోస్ట్‌ కోవిడ్‌) లక్షణాలు సుమారు నెల రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. కొందరిలో అయితే రెండు, మూడు నెలల తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్నే ‘లాంగ్‌ కోవిడ్‌’ లేదా ‘లాంగ్‌ హాల్‌ కోవిడ్‌’ అని పిలుస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, కిడ్నీల సమస్యలు ఉంటాయి. నీరసం,  తల తిప్పుతున్నట్టుగా ఉండటం, ఒళ్లు నొప్పులు, ఆయాసం వస్తాయి. కొందరిలో మాత్రం బ్లాక్‌ ఫంగస్‌ సోకే ప్రమాదం ఉంటుంది.  

ఎవరెవరు.. ఎప్పటి నుంచి సాధారణ జీవితం గడపొచ్చు? 
కోవిడ్‌ సోకినవారిలో జలుబు, జ్వరం మాత్రమే ఉంటే.. లక్షణాలు మొదలైన పదో రోజుకు వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. వారి నుంచి ఇతరులకు సోకే అవకాశం చాలా తక్కువ. 17వ రోజు నాటికి కోవిడ్‌ తగ్గిపోయినట్టు భావించవచ్చు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. సాధారణ జీవితం గడపవచ్చు. 

కరోనా తీవ్రంగా ఉండి ‘తీవ్రస్థాయి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ (సీవర్‌ ఆక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌)’గా మారితే.. వైరస్‌ నియంత్రణలోకి రావడానికి కనీసం 20 రోజులు పడుతుంది. ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు ఏమేరకు నష్టం జరిగింది, ఎంతకాలం చికిత్స అవసరమన్న దాన్ని బట్టి వారు ఎప్పటి నుంచి సాధారణ జీవితం గడపవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. 

కొందరిలో సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.. ఎందుకు? 

► కరోనా తగ్గిపోయాక చాలా మంది సాధారణ జీవితం గడుపుతుండగా.. కొందరిలో మాత్రమే దీర్ఘకాలం సమస్యలు బాధిస్తున్నాయి. దీనికి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పలు కారణాలు చెప్తున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, కరోనా సమయంలో దెబ్బతిన్న అవయవాలు పూర్తిగా రికవర్‌ అయ్యేందుకు సమయం పట్టడం ప్రధాన కారణమని అంటున్నారు. షుగర్‌ స్థాయిలు నియంత్రించలేని స్థాయికి వెళ్లడం, శరీరంలో వచ్చే ఇతర ఇన్ఫెక్షన్లూ దీర్ఘకాలం ఆరోగ్య సమస్యలను కలిగిస్తున్నాయి. 

కొంత మంది శరీరంలో రోగ నిరోధక శక్తికి దొరకకుండా కరోనా వైరస్‌ దాగి ఉండి, పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలకు కారణం అవుతోందన్న అంచనాలు ఉన్నాయని ఢిల్లీకి చెందిన దియోస్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ అభిషేక్‌ బన్సల్‌ తెలిపారు. ఈ అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. 

ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? 
దీర్ఘకాలిక వ్యాధులు, హైపర్‌ టెన్షన్, మధుమేహం, గుండె, కిడ్నీ జబ్బులు ఉన్నవారు కరోనా సోకి తగ్గిపోగానే.. ఆయా వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాల పనితీరు బాగానే ఉందా, ఏమైనా సమస్యలు తలెత్తాయా అన్నది తేల్చుకోవాలి. ఆయా జబ్బులకు సంబంధించిన మందులను తప్పనిసరిగా వాడాలి.   

వీలైనంత వరకు ద్రవ పదార్థాలు, పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. వైద్యుల సూచన మేరకు మెడిటేషన్, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. తగినంత నిద్ర ఉండాలి. మద్యం, పొగతాగడం మానేయాలి. 

ఆరోగ్య శాఖ చేస్తున్న సూచనలేంటి? 
కోవిడ్‌కు చికిత్స పొంది కోలుకున్నాక వారం రోజుల్లోపే మరోసారి వైద్యులను సంప్రదించి ఆరోగ్యాన్ని చెక్‌ చేయించుకోవాలి. 

వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో మందులను వాడొద్దు. ఒక మందు మరో మందు పనితీరుపై ప్రభావం చూపి సైడ్‌ ఎఫెక్ట్స్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. అలాగని అత్యవసర మందులను ఆపొద్దు. వైద్యులను సంప్రదించి ఏవి అవసరమో, వేటిని ఆపేయొచ్చో సూచనలు తీసుకోవాలి. 

పొడి దగ్గు, గొంతులో నొప్పి, వాపు ఉంటే ఉప్పు, పసుపు కలిపిన నీళ్లతో అప్పుడప్పుడూ పుక్కిలించాలి. ఆవిరిపట్టొచ్చు. దగ్గు మందులు వాడొచ్చు. 

వ్యాయామం ఎప్పుడు మొదలుపెట్టొచ్చు.. ఎలా చేయాలి? 

కోవిడ్‌ సోకి కోలుకున్నవారిలో ఆయాసం, నీరసం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 కోవిడ్‌ తగ్గిన తర్వాత మొదట వారం రోజులు.. రోజూ పది, పదిహేను నిమిషాల పాటు తేలికైన వ్యాయామాలు మాత్రమే చేయాలి. వీలైతే వాకింగ్, తక్కువ వేగంతో జాగింగ్‌ చేయడం మంచిది. 
రెండో వారం నుంచి వ్యాయామం చేసే సమయాన్ని, తీవ్రతను మెల్లగా పెంచుకుంటూ వెళ్లొచ్చు. 
న్యుమోనియా, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు.. కోవిడ్‌ తగ్గాక కనీసం పది, పదిహేను రోజులు విశ్రాంతి తీసుకోవాలి. అప్పటివరకు వ్యాయమం జోలికి వెళ్లకపోవడం మంచిది. 
 గుండె జబ్బులు ఉన్నవారైతే కనీసం రెండు, మూడు వారాల పాటు వ్యాయామాలకు దూరంగా ఉండాలి.

చదవండి: Coronavirus: కరోనా చికిత్సకు కొత్త ఔషధం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement