అతనో మాజీ వార్డు సభ్యుడు, ఆ ప్రాంతం పై గట్టిగా పట్టు ఉంది. అంతకు మించి ఆయన ఇంట్లో ప్రస్తుతం అధికారం ఉంది. దీంతో ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. భార్య పదవిని అడ్డుపెట్టుకొని అక్రమంగా యథేచ్ఛగా అక్రమాలను పోత్సహిస్తున్నాడు. ఇదీ ఓ కౌన్సిలర్ భర్త బాగోతం. అతడి అక్రమ దందా తన వార్డులోనే కాకుండా మున్సిపాలిటీలోని మిగిలిన 15 వార్డుల్లోనూ కొనసాగిస్తున్నాడు. ఏ వార్డుల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్ట వచ్చు అని బిల్డర్లు ముందుగా భరత్‌సింగ్‌ను సంప్రదిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.
సాక్షి,శామీర్‌పేట్: శామీర్‌పేట మండల రెవెన్యూ పరిధి, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి గ్రామాలను కలుపుతూ పంచాయతీ ఉన్న తూంకుంటలో మరి కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ తూంకుంట కేంద్రంగా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉండటమే కాకుండా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, కరీంనగర్ – హైదరాబాద్ రాజీవ్ రహదారి ఉండటంతో ఇక్కడి భూములకు ఊహించని రీతిలో రెక్కలొచ్చాయి. ఇదే స్థాయిలో పెద్ద పెద్ద భవంతులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, విల్లాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన తూంకుంట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ పూజ భర్త భరత్‌సింగ్ అనుమతులు లేని నిర్మాణ యజమానులకు అండగా ఉంటూ కోట్లు దండుకుంటున్నాడు.
అక్రమ నిర్మాణాలు ఇక్కడే అధికం..
తూంకుంట మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. కానీ అన్ని వార్డులతో పోలిస్తే ఈ ఒక్క వార్డులోనే 90 శాతం అక్రమ నిర్మాణాలు వేలిశాయి. దీనికి కారణం లేకపోలేదు. 1వ వార్డు కౌన్సిలర్ భర్త భరత్‌సింగ్ తూంకుంట గ్రామపంచాయతీ ఉన్నప్పుడు వార్డు సభ్యుడు. దీంతో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు, కల్వర్టులు ఉన్నాయనేది పూర్తిగా తెలుసు. అంతేకాకుండా అధికారులకు ఎలాంటి ముడుపులు అప్పజెప్పాలి, అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు ఎలా చేపట్టాలనేవి పూర్తిగా తెలిసుండటంతో ఇతడి కనుసన్నల్లో మూడు షాపింగ్ కాంప్లెక్సులు.. ఆరు భవంతులుగా అతడి అక్రమ దందా కొనసాగుతోంది.
► ప్రభుత్వ స్థలాలు, నాలాలను కాపాడాల్సిన పదవిలో భార్య ఉండగా భర్త భరత్‌సింగ్ మాత్రం వాటిని కబ్జా చేసి నగదును సొమ్ము చేసుకుంటున్నాడు. ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకొని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
►ఇటీవల ఉప్పరిపల్లిలోని 2వ వార్డులో సైతం స్థానిక కౌన్సిలర్‌కు ఫోన్ చేసి అన్నా.. వాళ్లు మనవాళ్లే.. నీకు నేను ఉన్నా.. చూసుకుంటా.. వాళ్ల ను ఇబ్బంది పెట్టకు అంటూ మ« ద్యవర్తిత్వం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
►1వ వార్డులో ఉన్న కల్వర్లులు, ప్రభుత్వ పార్కులు సైతం కబ్జాకు గురయ్యాయి. తూంకుంట నుంచి దేవరయాంజాల్‌కు వెళ్లే దారిలో కల్వర్టును సైతం మూసివేసి నిర్మించిన కట్టడాల వెనుక ఇతని పూర్తి సహకారం ఉన్నట్లు సమాచారం.
►అలాగే కరీంనగర్–హైదరాబాద్ రాజీవ్ రహదారికి ఆనుకొని ప్రభుత్వ పార్కు స్థలంలో ఓ వ్యాపారం కొనసాగుతుంది. ఈ స్థలాన్ని వాడుకున్నందుకు భరత్‌సింగ్‌కు ఏటా నగదు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భరత్‌సింగ్ ఆగడాలతో అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తోటి ఉద్యోగులతో బాహాటంగానే చెప్పుకుంటున్నారు.
చదవండి: TS Inter 1st Year Result: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్
Comments
Please login to add a commentAdd a comment