దౌల్తాబాద్‌కు చెందిన అనురాధ కరోనా నివారణకు కొద్ది రోజుల క్రితమే తొలిడోస్‌ను తీసుకున్నారు. అయితే రెండో డోస్ కూడా తీసుకున్నట్లు ఆమె భర్త సెల్‌కు మెసేజ్ రావడంతో అవాక్కయ్యారు. మరో ఘటనలో.. దౌల్తాబాద్‌కు చెందిన సత్యనారాయణ మొదటి డోస్ తీసుకున్నారు. రెండో డోస్‌కు వైద్యసిబ్బంది దగ్గరకు వెళ్ళగా మీరు తీసుకున్నారు కదా అని చెప్పడంతో అయోమయానికి గురయ్యారు. నా సెల్‌కు మెసేజ్ రాలేదు కదా అంటే సమాధానం లేదు.
సాక్షి,దౌల్తాబాద్(హైదరాబాద్): కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే దివ్యౌషధమని, ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసు కోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రారంభంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుకడుగు వేసిన ప్రజలు రెండో వేవ్ ఉధృతం కావడంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అదే సమయంలో వ్యాక్సిన్ పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వ్యాక్సిన్ వేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించింది కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో మొదటిడోస్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.
రెండో డోస్‌లోనే..
మొదటి డోస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యసిబ్బంది రెండో డోస్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో అనేక తప్పులు దొర్లుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకున్నా తీసుకున్నట్లు ప్రజల సెల్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో వారంతా కంగారు పడుతున్నారు. టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఆతృతనా..? మరేమైనా కారణంతోనా..? తెలియదు కానీ మెసేజ్‌లు మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిడి పెరగడంతోనే ఆన్‌లైన్‌లో అంకెల గారడీ ప్రదర్శించేందుకే అన్ని విధాలా కసరత్తు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
9 ఉపకేంద్రాల పరిధిలో..
మండలంలో 39,065 మందిని వ్యాక్సిన్‌కు అర్హులుగా గుర్తించి వందశాతం లక్ష్యాన్ని ఇటీవలే అధిగమించారు. రెండో డోస్‌కు మండలంలోని 9 ఉపకేంద్రాల పరిధిలో ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది రెండోడోస్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు 15,551 మందికి రెండో డోస్ వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొంతమంది సిబ్బంది తొలిడోస్ వేసుకున్న వారికి ఫోన్‌చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.రెండోడోస్ వేసుకున్నారా..?ఆన్‌లైన్‌లో నమోదు చేయమంటారా..? అంటూ అడుగుతున్నారు. ఈ క్రమంలో రెండో టీకా తీసుకున్నట్లు సంక్షిప్త సందేశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: వైరస్ టెన్షన్!.. తారస్థాయిలో విరుచుకుపడుతున్న థర్డ్‌వేవ్
Comments
Please login to add a commentAdd a comment