మీడియాతో మాట్లాడుతున్న ఇందిరా శోభన్. చిత్రంలో రాంరెడ్డి, రాజ్‌గోపాల్
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మంలో ఈ నెల 9న నిర్వహించతలపెట్టిన సంకల్ప సభపై అపోహలు వద్దని, జరపడం తథ్యమని..కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే సభను నిర్వహిస్తామని వైఎస్ షర్మిలమ్మ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పేర్కొన్నారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని షర్మిలమ్మ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పిట్టా రాంరెడ్డి, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్‌తో కలసి ఆమె మాట్లాడారు. సాయంత్రం 5 గంటలకు అనుమతిచ్చిన సంకల్ప సభకు షర్మిలమ్మ తల్లి, వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరై ఆశీస్సులు అందజేస్తారని చెప్పారు.
తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనను తీసుకొచ్చేందుకు షర్మిలమ్మ పట్టుదలతో ఉన్నారని, అందుకు ఆమె ఓ రాజకీయ వేదికను సిద్ధం చేసుకున్నారని చెప్పారు. అందరూ తరలివచ్చి షర్మిలమ్మ సంకల్పాన్ని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఎన్నికలకు సభలు నిర్వహిస్తున్నారని, సభల విషయంలో పాలకులకు ఏ నిబంధనలు వర్తిస్తాయో తమకూ అవే రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవాలు, సభలతో పాటుగా, వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, వాటికి లేని అభ్యంతరాలు మాకెందుకని ప్రశ్నించారు.
సభకు అనుమతులు
కోవిడ్ నిబంధనలకు లోబడి సభ నిర్వహించుకోవాలని ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్(సీపీ) అనుమతులిచ్చారని, వాటి ప్రకారమే సభ నిర్వహిస్తామని కొండా రాఘవరెడ్డి తెలిపారు. సంకల్ప సభకు అనుమతులిచ్చిన సీపీకి ధన్యవాదాలు తెలిపారు. సభకు వచ్చే అభిమానులు మాస్క్‌లు ధరించిరావాలని, లేనివారికి తామే అందజేస్తామని తెలిపారు. మైదానంలోకి వచ్చే మార్గం వద్ద శానిటైజర్ చేసి లోపలకు అనుమతిస్తామన్నారు.
షర్మిల రూట్ మ్యాప్
ఈ నెల 9న ఉదయం 8 గంటలకు లోటస్‌పాండ్ నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిలమ్మ భారీ ర్యాలీతో ఖమ్మం సంకల్ప సభకు బయలుదేరుతారని పిట్టా రాంరెడ్డి తెలిపారు. షర్మిలమ్మ ర్యాలీకి కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట, పాలేరు, నాయకన్ గూడెం, కూసుమంచి ప్రాంతాల్లో స్వాగత పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో కోదాడ నుంచి పాలేరుకు మధ్యాహ్నం 3.30కు చేరుకుంటారని, అక్కడి నుంచి పెద్ద తండాలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుంచి ర్యాలీగా పెవిలియన్ గ్రౌండ్‌కి షర్మిల వెళ్తారని వివరించారు. సమావేశంలో షర్మిల అనుచరులు భాస్కర్ రెడ్డి, నవీన్ యాదవ్, విద్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment