సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ పాల విక్రయాలపై కుట్ర జరుగుతోందా..?. అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ పాలు సరఫరా కాకుండా అధికారులే అడ్డుపడుతున్నారా.. ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనాల్సి వస్తోంది. విజయ డెయిరీకి టెండర్ దక్కకుండా అధికారులే నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అంగన్ వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఇటీవల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో టెండర్లు ఆహా్వనించారు. కేవలం కర్ణాటక, గుజరాత్‌లకు చెందిన డెయిరీలకే టెండర్ దక్కేలా నిబంధనలు రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న హాకా ఆయా టెండర్లు పిలవాల్సి ఉండగా, దాన్ని పక్కనపెట్టి ఐసీడీఎస్ ద్వారా టెండర్లు పిలవడంపై కూడా వివాదం రేగుతోంది.
ఏడాదికి 3 కోట్ల లీటర్ల విజయ పాలకు ఎసరు
రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిల్లో 4.57 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారు. 10.34 లక్షల మంది ఏడాది నుంచి నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 6.67 లక్షలు 3 ఏళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు లబ్ది పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం తరపున పాలు అందజేస్తారు. ఒక్కో తల్లికి 200 మిల్లీలీటర్ల పాలు అందజేస్తారు. అందుకోసం ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేస్తుంది.
ఏడాదికి అంగన్‌వాడీ కేంద్రాలకు దాదాపు 3 కోట్ల లీటర్ల టెట్రాప్యాక్ పాలు సరఫరా చేస్తున్నారు. ఈ పాలను రాష్ట్రంలోని విజయ డెయిరీ వంటి సహకార డెయిరీల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో ప్రభుత్వ జీవోలో స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు నిబంధనలు మార్చడంతో విజయ డెయిరీకి భారీగా నష్టం వాటిల్లనుంది. దాదాపు రూ.120 కోట్ల విలువైన వ్యాపారానికి గండిపడుతుందనే చెప్పాలి.
సామర్ధ్యానికి మించి నిబంధనలు...
20 రోజుల క్రితం హాకా ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. అప్పుడు సింగిల్ టెండరే వచ్చింది. దీంతో మళ్లీ టెండర్లు వేయాలనుకున్నారు. కానీ ఈసారి హాకాను పక్కనపెట్టి ఐసీడీఎస్ వర్గాలు టెండర్లకు వెళ్లాయి. విజయ డెయిరీ టెట్రాప్యాక్ పాల సామర్థ్యం రోజుకు 50 వేల లీటర్లు కాగా, టెండర్‌లో 3 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండాలని పొందుపరిచారు.
అలాగే గత మూడేళ్లలో ఏదో ఒక ఏడాది 1.5 కోట్ల లీటర్ల టెట్రాప్యాక్‌లు సరఫరా చేసిన సామర్థ్యం ఉండాలన్న నిబంధనను కూడా విధించారు. ఈ సామర్థ్యం కూడా విజయ డెయిరీకి లేదు. గతంలో ఇలాంటి నిబంధనలను విధించలేదు. కేవలం కర్ణాటక, గుజరాత్‌కు చెందిన డెయిరీలకే అనుకూలంగా నిబంధనలు ఉన్నాయని చెబుుతు న్నారు. ఈ నెల 20వ తేదీన టెండర్ దా ఖలుకు చివరి తేదీ కాగా, నిబంధనలు ఎలా ఉన్నా టెండర్లు వేస్తామని విజయ డెయిరీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment