దాగుడు మూతలతో మాస్‌ కాపీయింగ్‌  | Cybercrime Caught Gang Involved Mass Copying In TOEFL And GRE | Sakshi
Sakshi News home page

దాగుడు మూతలతో మాస్‌ కాపీయింగ్‌ 

Published Wed, Feb 8 2023 8:19 AM | Last Updated on Wed, Feb 8 2023 8:41 AM

Cybercrime Caught Gang Involved Mass Copying In TOEFL And GRE  - Sakshi

సాక్షి,హిమాయత్‌నగర్‌: అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీటు పొందేందుకు ఉద్దేశించిన టోఫెల్, జీఆర్‌ఈ ఆన్‌లైన్‌ టెస్టుల్లో ‘దాగుడు మూతల’ పంథాలో మాస్‌ కాపీయింగ్‌ చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు చేశారు. దాదాపు రెండేళ్లుగా ఈ దందా చేస్తున్న చేస్తున్న నిందితులను డెకాయ్‌ ఆపరేషన్‌ ద్వారా పట్టుకున్నట్లు జాయింట్‌ సీపీ డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌ మంగళవారం తెలిపారు.

మండల శ్రావణ్‌ కుమార్, మండల సాయి సంతోష్‌ పి.కిశోర్, ఎ.కిరణ్‌కుమార్‌ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సూత్రధారి, ప్రధాన నిందితుడు గుణశేఖర్‌ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలిపారు. డీసీపీ స్నేహ మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్‌స్పెక్టర్లు నవీన్, హరి భూషణ్‌ రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  

హస్తినాపురం కేంద్రంగా వ్యవహారం... 
టోఫెల్, జీఆర్‌ఈ టెస్టుల్లో అధిక స్కోరు వచ్చేలా తాము సహాయ సహకారాలు అందిస్తామంటూ నగరానికి చెందిన గుణశేఖర్‌ సోషల్‌ మీడియా ద్వారా కోవిడ్‌ సీజన్‌ నుంచి ప్రచారం చేస్తున్నాడు. దీనికి సంబంధించి కొందరు విద్యార్థులు గుణశేఖర్‌ను సంప్రదించగా.. ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 వేలు చొప్పున తీసుకున్నాడు. ఇలా దాదాపు ఇతనొక్కడే వంద మంది విద్యార్థులకు మాస్‌ కాపీయింగ్‌కు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. తమతో ఒప్పందం చేసుకున్న వారికి టెస్టు మరో గంటలో ఉందనగా హస్తినాపురంలోని ఎగ్జామ్‌ రూమ్‌ అడ్రస్‌ చెప్పేవాడు.

అక్కడికి వచ్చిన స్టూడెంట్‌తో పాటు తాను ఏర్పాటు చేసిన టెస్టు టేకర్‌ను లోపలికి పంపేవాడు. కెమెరా 360 డిగ్రీస్‌ తిప్పుతున్న సమయంలో టెస్టు టేకర్‌ స్టూడెంట్‌ వెనుక దాక్కునేవాడు. టెస్టు ప్రారంభం అయ్యాక సుమారు 20 నిమిషాల వరకు ప్రశ్నలను టెస్ట్‌ టేకర్‌ వాట్సప్‌ ద్వారా పంపేవాడు. ఆన్సర్స్‌ను తిరిగి అదే వాట్సప్‌ నంబర్‌కు వచి్చన తర్వాత కనుసైగలు, చేతి వేళ్లతో సమాధానాలు స్టూడెంట్‌కు చెప్పి రాయించే వాడు.  

రాయ్‌పూర్‌ ఎన్‌ఐటీ స్టూడెంట్స్‌తో జవాబులు..
గుణశేఖర్‌కు పరిచయం ఉన్న వైజాగ్‌కు చెందిన ఆదిత్య, నగరానికి చెందిన శ్రావణ్‌ రాయ్‌పూర్‌లోని ఎన్‌ఐటీలో చదువుతున్నారు. వీరికి టోఫెల్, జీఆర్‌ఈలకు సంబంధించిన ఆన్సర్స్‌ చెప్పడంలో మంచి ప్రతిభ ఉంది. తొలి రోజుల్లో బంధువులకు, స్నేహితులకు సాయం చేయాలని చెప్పి వారి నుంచి ఆన్సర్స్‌ రాబట్టేవాడు. కొన్నాళ్లకుæ ఇదో దందాగా తెలుసుకున్న వారిద్దరూ గుణశేఖర్‌కు వస్తున్న రూ.20 వేలలో నుంచి కొంత డబ్బును కమీషన్‌గా తీసుకుంటూ ఈ మాస్‌ కాపీయింగ్‌లో భాగస్వాములయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో గుణశేఖర్‌ అమెరికా వెళ్లాడు. అతను వాడే సిమ్‌కార్డును ఇక్కడే ఉంటున్న శ్రావణ్‌కు ఇచ్చాడు. దానికి సంబంధించిన వాట్సాప్‌ను మాత్రం అతడు అక్కడ తన ఫోన్‌ ద్వారా వాడుతున్నాడు.  

అక్కడి నుంచే కథ నడుపుతూ... 
సోషల్‌ మీడియాలో యాడ్స్‌ చూసి రెగ్యులర్‌ కాల్స్‌ చేసిన వారితో మాట్లాడే శ్రావణ్‌ అర్ధగంట తర్వాత వాట్సప్‌ కాల్‌ చేయమనే వాడు. ఈ కాల్స్‌ను అమెరికాలో ఉన్న గుణశేణర్‌ ఆన్సర్‌ చేసే వాడు. విద్యార్థి వివరాలు, ఏ దేశానికి వెళ్లేది, టెస్టుకు సంబంధించిన వివరాలు తీసుకునేవాడు. గుణశేఖర్‌ చెప్పిన వాటికి ఒప్పుకున్న స్టూడెంట్‌కు టెస్టు రోజున గంట ముందు హస్తినాపురంలోని ఎగ్జామ్‌ రూమ్‌ అడ్రస్‌ చెప్పేవారు.

గుణశేఖర్‌ అమెరికా నుంచి వాట్సప్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తుండగా, ఆదిత్య రాయ్‌పూర్‌ నుంచి ఆన్సర్స్‌ను ఇక్కడ టెస్టు కండక్ట్‌ చేయించే శ్రావణ్‌కు వాట్సప్‌ ద్వారా పంపేవాడు. ఇలా 2020 ఏప్రిల్‌ నుంచి ఈ దందా చేస్తున్నట్లు, వందల మందిని మాస్‌ కాపీయింగ్‌ ద్వారా స్కోర్‌ సాధించి విదేశాలకు పంపినట్లు తేలింది. ఈ కేసులో శ్రావణ్‌తో పాటు టెస్ట్‌ టేకర్స్‌గా వ్యవహరించి ఇతడికి సహకరించిన కిరణ్, సాయి సంతోష్‌ కిషోర్‌లను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఆదిత్య, గుణశేఖర్‌ కోసం గాలిస్తున్నామని గజరావ్‌ భూపాల్‌ తెలిపారు.  

(చదవండి: జీహెచ్‌ఎంసీకి పైసా పరేషాన్‌.. గండం గట్టెక్కేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement