
సాక్షి, హైదరాబాద్: దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ దళితులను దగా చేశారని వైఎస్ షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కావాలని ఏ దళితుడు అడగలేదని, కేసీఆరే మాట ఇచ్చి, దగా చేశారని మండిపడ్డారు. ఇప్పటి పాలకులకు దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని బుధవారం ఆమె తన కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంకా వారిపట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని మండిపడ్డారు. మూడెకరాల భూమి, రిజర్వేషన్ల పెంపు, డబుల్ బెడ్రూం ఇళ్లు, పెన్షన్లు ఇలా ఎన్నో హామిలిచ్చి నెరవేర్చకుండా దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. రాజయ్య మీద ఒక్క ఆరోపణ రాగానే పదవి నుంచి తప్పించిన కేసీఆర్.. మల్లారెడ్డిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు.
దళితులపై కేసీఆర్ ప్రేమకు ఇదే నిదర్శనమన్నారు. నాగార్జునసాగర్ ఎన్నికలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు అంబేద్కర్ జయంతి వేడుకలకు మాత్రం అడ్డొస్తాయా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. ఆ ప్రాజెక్ట్‌ను రీడిజైన్ పేరిట అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ట్యాంక్‌బండ్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని ఇప్పటికీ దాని ఊసే లేదని ఎద్దేవా చేశారు. సమానత్వం కోసం అంబేడ్కర్ పోరాడితే.. సమాన అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు కృషి చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు ఆత్మగౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేదలకు 6 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేసిన నేత వైఎస్ అని కొనియాడారు. రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా రాజన్న సంక్షేమ పాలనను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో దళిత నేత, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న, బి.సంజీవరావు, డేవిడ్ శాంతరాజ్, జార్జ్ హెర్బర్ట్, పాకాల డానియేల్, దయానంద్, బి.మరియమ్మ, పోలీసు రాంచందర్, బి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment