Telangana Police Arrested YSRTP President Y.S Sharmila At Lotus Pond - Sakshi
Sakshi News home page

వైఎస్‌ షర్మిలకు జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించిన నాంపల్లి కోర్టు

Published Mon, Apr 24 2023 11:33 AM | Last Updated on Tue, Apr 25 2023 11:45 AM

TS Police arrested YS Sharmila At Lotus Pond - Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతోపాటు ఆమె డ్రైవర్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి సోమవారం షర్మిల లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయం నుంచి బయలుదేరుతుండగా.. పోలీసులు అక్కడకు చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ షర్మిలను అడ్డుకోవడంతో ఆమెకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె కారులో ఉన్న డ్రైవర్‌ను పోలీసులు బలవంతంగా కిందికి దింపేశారు.

ఈ పరిణామంతో షర్మిల, పోలీసులమధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ ఠాణాకు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న తనపై షర్మిల చేయి చేసుకున్నారని, నేమ్‌ ప్లేట్‌ను చించేశారని, తమ కానిస్టేబుల్‌ గిరిబాబు కాలు పైకి బలవంతంగా కారు ఎక్కించారని ఎస్సై రవీందర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా షర్మిల తదితరులపై కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా ఆమె కారు డ్రైవర్‌ బాబు, ఏ3గా మరో డ్రైవర్‌ జాకబ్‌లను చేర్చారు. షర్మిల, బాబులను అరెస్టు చేయగా.. జాకబ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో షర్మిల, బాబులకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మే 8 వరకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించగా, పోలీసులు షర్మిలను చంచల్‌గూడ జైలుకు తరలించారు.  

పోలీసుల తీరు సరిగాలేదు: షర్మిల 
‘సిట్‌ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. ఒక పార్టీ అధ్యక్షురాలి పట్ల పోలీసుల తీరు సరిగాలేదు. ఈ విధుల్లో మహిళా కానిస్టేబుల్‌ను నియమించలేదు. పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగానే రోడ్డుపై బైఠాయించా’అని షర్మిల మీడియాతో పేర్కొన్నారు. కాగా, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో షర్మిలను పరామర్శించేందుకు భర్త అనిల్, తల్లి వైఎస్‌ విజయమ్మ వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. కాగా, అరెస్ట్‌ను నిరసిçస్తూ వైఎస్సార్‌టీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

షర్మిలపై కక్ష సాధింపు చర్యలు  
వైఎస్‌ విజయమ్మ ధ్వజం

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేయడంపై వైఎస్‌ విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం షర్మిలను ఎందుకు అడ్డుకుంటోందని గట్టిగా నిలదీశారు. సోమవారం ఆమె తన నివాసంలో మీడియా తో మాట్లాడుతూ.. షర్మిలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కోర్టుకు వెళ్తామని తెలిపారు. తాను షర్మిలను చూడటానికి పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్తోంటే పోలీసులు అనుమతించలేదన్నారు. ‘నా కూతురుని చూసి పోతానన్నా పోలీసులు ఒప్పుకోలేదు. షర్మిలను ఎందుకు అరెస్ట్‌ చేశారని అడిగితే పోలీసుల దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక వ్యక్తి షర్మిల కాబట్టి ప్రభుత్వం ఇంతటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది’అని విజయమ్మ చెప్పారు.

ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్‌కు ఫిర్యాదు చేసేందుకు ఒంటరిగా వెళ్తున్న షర్మిలను ఎందుకు అరెస్టు చేశారన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించిన అంశాలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేంటని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న ఆమె వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆశయాలు సాకారం చేయడానికి ఎంతో కష్టపడుతోందని చెప్పారు. ‘అంతమంది పోలీసులు కనీస గౌరవం లేకుండా ఒక మహిళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటే ఆవేశం రాదా? పది మంది మహిళా పోలీసులు నాపై పడు తూ కార్లో ఎక్కించబోతే నాకు కూడా ఆవేశం వచ్చింది. పోలీసులు షర్మిల డ్రైవర్, గన్‌మెన్లను కొట్టారు. చివరికి మీడియా వాళ్లను కూడా కొట్టారు. మీడియాకు చేతులెత్తి అభ్యర్థిస్తున్నా.. ప్రజల తరఫున నిలబడి నిజాలు చూపించండి. చిన్నచిన్న విషయాలను పెద్దగా చూపించడం కాదు.. ప్రజల కోసం పని చే యాలి’అని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement