కడప అర్బన్: అసభ్య దూషణలతో ఫేక్ పోస్టులు పెడుతూ దీన్ని వైఎస్సార్ సోషల్ మీడియాకు ఆపాదించేందుకు యత్నించిన టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి. విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీడీపీ సానుభూతిపరుడైన పినపాల ఉదయ్ భూషణ్ ఫేస్‌బుక్‌లో జుగుప్సాకరంగా వైఎస్ షర్మిల, నర్రెడ్డి సునీతపై పోస్టింగ్‌లు పెడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
బుధవారం కడపలో అదనపు ఎస్పీ (అడ్మిన్) లోసారి సుధాకర్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. సాక్ష్యాధారాలతో దొరికిపోయినప్పటికీ తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారంటూ నిందితుడు ఉదయ్ భార్య ఏకంగా విశాఖలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఆరోపణలు చేయడం ఆ పార్టీతో వారి అనుబంధాన్ని రుజువు చేస్తోంది.
ఒకవైపు షర్మిలతో తాను రూపొందించిన స్క్రిప్టు చదివిస్తూ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబు మరోవైపు తన శిష్య గణం ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టింగ్‌లకు పురిగొల్పుతున్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎవరినైనా సరే తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని అవసరం తీరాక బురద చల్లడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఫేక్ అకౌంట్ సృష్టించి..
విశాఖపట్నంలోని మహారాణిపేట సామ్రాట్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న నిందితుడు పినపాల ఉదయ్ ఈ ఏడాది జనవరి 13వతేదీన పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ సృష్టించాడు. వైఎస్‌ఆర్ సోషల్ మీడియా సభ్యుడైన రవీంద్రారెడ్డి ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి సదరు ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి షర్మిల, సునీతపై అసభ్యకర పదజాలంతో పోస్టులు పెడుతున్నాడు. తన పేరు, ఫోటోను వినియోగించి దుష్ప్రచారానికి పాల్పడటంపై రవీంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఈనెల 3న క్రైం.నెం. 45/2024 కేసు నమోదైంది.
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అదనపు ఎస్పీ (అడ్మిన్) లోసారి సుధాకర్ పర్యవేక్షణలో పులివెందుల డీఎస్పీ కేఎస్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐ సి.శంకర్‌రెడ్డి, సైబర్ క్రైం సీఐలు శ్రీధర్‌నాయుడు, మధుమల్లేశ్వర్‌రెడ్డిలను రెండు బృందాలుగా విభజించి దర్యాప్తు ప్రారంభించారు. ఫేస్‌బుక్ డేటా బేస్ ఆధారంగా నిందితుడు ఉపయోగించిన ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేసి విశాఖకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్‌గా గుర్తించారు.
టీడీపీకి వీరాభిమాని అయిన నిందితుడు పార్టీ తరఫున పలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపుల్లో అసభ్యకరమైన మెస్సేజ్‌లు, పోస్టులు పెడుతున్నట్లు నిర్ధారించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతడి నివాసం వద్ద ఈనెల 13న అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన యాపిల్ ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కేసును త్వరితగతిన ఛేదించిన పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్, అర్బన్ సీఐ శంకర్‌రెడ్డి, సైబర్ క్రైం సీఐలు శ్రీధర్‌నాయుడు, మధుమల్లేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ జీవన్‌రెడ్డి, పులివెందుల ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తదితర సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ వ్యవహారంలో ఇతర కుట్రదారులెవరన్నది తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment