
కొండ కింద వైకుంఠద్వారం ఎదుట కుటుంబ సభ్యులతో కలసి మండుటెండలో ధర్నా చేస్తున్న ఆటో కార్మికులు. (ఇన్‌సెట్‌లో) చిన్నారికి పాలు తాగిస్తూ ధర్నాలో కూర్చున్న ఆటో కార్మికుడి కుటుంబీకురాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ప్రధానాలయం పునఃప్రారంభం నుంచి కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో ఆలయ ఈవోను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వైకుంఠద్వారం వద్ద ఆటోకార్మికులు కుటుంబాలతో కలసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆందోళన విరమించాలని చెప్పగా కార్మికులు అందుకు నిరాకరించారు.
ఫైనాన్స్, అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేశామని, ఆటోలను అనుమతించకపోతే సుమారు 300 కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొట్టమీద కొడుతున్న ఈవోను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ దశలో పోలీసులకు ఆటోకార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. దీంతో భక్తులు కొద్దిసేపు ఇబ్బందులకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఆటోకార్మికులు స్వచ్ఛందంగా ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment