
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగం పేరుతో అధికార టీఆర్‌ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన సర్వేలో ప్రభుత్వంపై నిరుద్యోగులు, యువతలో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలడంతోనే అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారే తప్ప నిరుద్యోగులపై ప్రేమతో కాదని విమర్శించారు.
శనివారం గాంధీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అలాంటప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ద్వారా శిక్షణ ఎందుకు ఇప్పిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో చెప్పిన రోజు నుంచే నోటిఫికేషన్లు వస్తాయని కేసీఆర్ చెప్పారని, కానీ నేటికీ ఒక్క నోటిఫికేషన్ రాలేదని మండిపడ్డారు. అన్ని ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేసి, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment