అదో గుట్ట.. దానిపై ఉన్న గుండ్లనే కాన్వాస్‌గా మలచి ఆదిమానవులు దానిపై పురివిప్పి నర్తించిన నెమలిని గీశారు.. ఘీంకరిస్తూ కదలాడిన ఏనుగును సాక్షాత్కరింపజేశారు.. భారీ అడవిదున్నలను నియంత్రించిన తమ సహచరుల వీరత్వాన్ని చూపారు. సుమారు పదివేల ఏళ్ల నాటి ఈ చిత్రాలు పాత రాతియుగం మొదలు క్రీ.పూ.2 వేల ఏళ్ల క్రితం విలసిల్లిన తొలి చారిత్రక యుగం వరకు వివిధ కాలాల్లో ఆదిమానవులు గీసినవి. కానీ ఇప్పుడు వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లు మింగేస్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో చారిత్రక విధ్వంసం జరుగుతోంది. హైదరాబాద్‌కు 30 కి.మీ. దూరంలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఆదిమానవుల కాలం నాటి చిత్రకళ కనుమరుగవుతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లలో భాగంగా ఆదిమానవులు గీసిన చిత్రాలున్న గుట్ట శిథిలమవుతోంది. ఇప్పటికే రెండు కాన్వాస్‌లు మాయమవగా మరో మూడు విధ్వంసం అంచున నిలిచాయి. వాటిని పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా గుర్తించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
30 అడుగుల భారీ కాన్వాస్..
గుట్టమీద ఎక్కువ చిత్రాలున్న గుండు ఓ కాన్వాస్‌లాగా కనిపిస్తోంది. దాదాపు 30 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తుతో ఈ కాన్వాస్ నిండా ఆదిమానవులు ఎరుపురంగుతో గీసిన చిత్రాలే కనిపిస్తున్నాయి. క్రీ.పూ.10 వేల ఏళ్ల నుంచి 4 వేల ఏళ్ల మధ్యలో విలసిల్లిన పాత రాతియుగం, క్రీ.పూ.4 వేల ఏళ్ల నాటి కొత్త రాతియుగం, ఆ తర్వాతి తొలి చారిత్రక యుగం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రాలు గీసినట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీటిల్లో ఎక్కువగా అడవి దున్నల చిత్రాలున్నాయి.
ఒక దున్న విడిగా ఉండగా, మరోచోట లావుగా ఉన్న దున్న ముందు మనిషి చేతిలో ఆయుధం పట్టుకుని నిలబడి ఉన్నాడు. దానికి ఓ పక్కన ఏనుగు చిత్రం కనిపిస్తోంది. దానికి దిగువన భారీ పింఛాన్ని విప్పిన నెమలి చిత్రం ఉంది. ఈ చిత్రం కొంత అస్పష్టంగా ఉంది. దాన్ని జిరాఫీ లేదా నీల్గాయ్ లాంటి జంతువుగా కూడా పరిశోధకులు భావిస్తున్నారు. వాటి చుట్టూ మరిన్ని చిత్రాలున్నాయి.
వాటిలో పక్షులు, చెట్లు, చేపలు తదితర ఆకృతులున్నాయని అంటున్నారు. మరోపక్కన మనిషి రెండు చేతులతో రెండు భారీ జంతువుల మెడలు పట్టుకొని గాలిలో ఎత్తి పట్టుకున్నట్లు ఉంది. మరో కోణంలో చూస్తే మనుషులు చేతులను జతగా పట్టుకొని నర్తిస్తున్న అనుభూతి కూడా కలుగుతోంది.
2016లో చిత్రాల గుర్తింపు..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 80 ప్రాంతాల్లో ఆదిమానవుల చిత్రాలు వెలుగుచూశాయి. 2016లో గుండ్ల పోచంపల్లికి చెందిన సాయికృష్ణ అనే రీసెర్చ్ స్కాలర్ గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉన్న మల్లన్నగుట్ట, చిత్రాలగుట్టలో ఆదిమానవులు గీసిన చిత్రాలతో ఉన్న ఐదు ప్రాంతాలను గుర్తించారు.
ఆదిమానవులు గీసిన చిత్రాల్లో ఏనుగు బొమ్మ ఉందంటే అప్పుడు, అక్కడ ఏనుగులు తిరగాడాయని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని పోతనపల్లిలో తొలి చారిత్రక కాలానికి చెందిన చిత్రాల్లో, సిద్దిపేట సమీపంలోని దాసర్లపల్లిలో చారిత్రక యుగానికి చెందిన చిత్రాల్లో ఏనుగులు ఉన్నాయి. తాజాగా గుండ్లపోచంపల్లిలో ఆదిమానవులు గీసిన చిత్రాల్లోనూ అవి కనిపించడం విశేషం.
ప్రస్తుతం హైదరాబాద్ విస్తరించిన ప్రాంతంలో ఒకప్పుడు ఏనుగులు తిరిగేవనడానికి ఆదిమానవులు గీసిన ఈ చిత్రమే సాక్ష్యం.
చట్టం ఏం చెబుతోంది?
ప్రభుత్వ స్థలం కానప్పటికీ చరిత్రలో కీలక ప్రాధాన్యం ఉన్న ఆధారాలు ఉంటే ఆ ప్రాంతాన్ని పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా గుర్తించే వీలుంది.
పురావస్తు శాఖ పరిరక్షించాలి..
పురాతన స్థలాలు, రక్షిత కట్టడాల పరిరక్షణ చట్టం ప్రకారం చారిత్రక ఆధారాలున్న స్థలాన్ని సేకరించి రక్షిత కట్టడంగా ప్రకటించొచ్చు. లేదా ప్రైవేటు వ్యక్తుల అధీనంలోనే ఉంచుతూ దాన్ని రక్షిత కట్టడంగా ప్రకటించొచ్చు. ఇలాంటి ప్రాంతాలు ప్రమాదంలో పడ్డప్పుడు పురావస్తు శాఖ వెంటనే స్వాధీనం చేసుకొని పరిరక్షించాలి. వాటిని ధ్వంసం చేయకుండా స్థల యజమానులతో మాట్లాడాలి.
– డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ
అవి ధ్వంసమైతే ఆధారాలు దొరకవు..
గుండ్లపోచంపల్లిలో వెలుగుచూసిన ఆదిమానవుల చిత్రాలు అరుదైనవే. ఏనుగు, నెమలి బొమ్మలు రెండు, మూడుచోట్లనే కనిపించాయి. వాటి ఆధారంగా ఆదిమానవులకు సంబంధించి మరింత ఆసక్తి కలిగించే సమాచారం తెలుసుకునే వీలుంటుంది. అవి ధ్వంసమైతే అత్యంత విలువైన సమాచారాన్ని మనం చేజేతులా నాశనం చేసుకున్నట్టే. ప్రభుత్వం పరిరక్షణకు కదలాలి.
– బండి మురళీధర్‌రెడ్డి, ఆదిమానవుల రాతిచిత్రాల నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment