సుక్కు తల్లి ఆదితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ మాలతి
ఏన్కూరు: ‘రోడ్లు బాగాలేవు... వాహనాలెలా వస్తాయి... ఉదయం ఆరు గంటలకు చిన్నారి మృతదేహాన్ని తీసుకువేళ్లేందుకు పార్థివ వాహనం ఏర్పాటు చేస్తామని ఖమ్మం జిల్లా ఆస్పత్రి ఆర్‌ఎంఓ చెప్పినా వారే బండి మీద తీసుకెళ్లారు.... గ్రామస్తులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటించడం లేదు’ అని ఖమ్మం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి వ్యాఖ్యానించారు. ‘బైక్‌పై కూతురు మృతదేహంతో 55 కి.మీ’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం వచ్చిన కథనానికి స్పందించిన డీఎంహెచ్‌ఓ మాలతి ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా మృతురాలు సుక్కు తల్లి ఆదితో మాట్లాడారు. పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారని ఆరా తీయడంతో పాటు గ్రామంలో గర్భిణులతో మాట్లాడి చికిత్స, కాన్పు తేదీల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. కొత్తమేడేపల్లి ఏన్కూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి 10కి.మీ దూరంలో ఉండగా, రోడ్డు అధ్వానంగా ఉన్న కారణంగా అధికారులు గ్రామానికి రావడం లేదన్నారు. వాహనాలు కూడా రాలేని పరిస్థితి ఉండడంతో ఎవరైనా అనారోగ్యానికి గురైతే సకాలంలో వైద్యం అందదని చెప్పారు.
గ్రామంలో ఫిట్స్, నిమ్ము వచ్చి చిన్నారులు మృతి చెందుతున్నారని ఆమె వెల్లడించారు. గ్రామంలో సబ్‌సెంటర్ ఏర్పాటు చేయొచ్చు కదా అని ‘సాక్షి’ ప్రశ్నించగా చిన్నారులకు బాగా జ్వరం వచ్చినపుడు ఫిట్స్ వస్తాయే తప్ప అదేమీ వ్యాధి కాదని తెలిపారు. అయినప్పటికీ ప్రతీ వారం గ్రామానికి ఏఎన్‌ఎం వస్తున్నందున, సబ్‌సెంటర్ ఏర్పాటుపై పరిశీలిస్తామని తెలిపారు. కాగా, కోవిడ్ సమయాన కొత్తమేడేపల్లిలో ఒక కేసు కూడా నమోదు కాలేదని డీఎంహెచ్‌ఓ గుర్తు చేశారు. డీఎంహెచ్‌ఓ మాలతి వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సీతారాం, ఎంపీపీ అరెం వరలక్ష్మి, ప్రభుత్వ వైద్యాధికారి పవన్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment