సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టడంలో భాగంగా ఆమె ఇక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగరానికి వస్తున్న ఆమె 3, 4 గంటలపాటు ఇక్కడ ఉండే అవకాశముంది. ఏదైనా హోటల్‌లో గిరిజన, ఆదివాసీ వర్గాల నాయకులు, ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతో ద్రౌపది ముర్ము విడివిడిగా సమావేశమవుతారని సమాచారం.
రాష్ట్ర బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు గురు ఎంపీలు(రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ సహా), ముగ్గురు ఎమ్మెల్యేలతోనూ భేటీ కానున్నారు. ఈ సమావేశాల ద్వారా తన అభ్యర్థిత్వానికి విశాల సమాజ మద్దతు కోరడం, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో తాను ప్రజల కోసం చేయబోయే కృషి తదితరాలను వివరిస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలను పురస్కరించుకుని ఆదివాసీ, గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్దతునివ్వకపోవడాన్ని ఎండగట్టే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీ వర్గాల ప్రజలపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచ కుండా తాత్సారం చేయడం, గిరిజనులకు ఇచ్చి న హామీలు నెరవేర్చకపోవడం, పోడుభూములకు పట్టాలు ఇవ్వకపోవడం వంటి అంశాలను ప్రస్తావించవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా మోదీ ప్రభుత్వం ఆదివాసీ, గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి చేపడుతున్న చర్యల గురించి వివరించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment