Megha Engineering To Set Up Rig Maker Drillmec SpA Manufacturing Plant In Hyderabad - Sakshi
Sakshi News home page

Telangana: రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ

Published Tue, Feb 1 2022 1:54 AM | Last Updated on Tue, Feb 1 2022 8:55 AM

Drillmec Spa Company Set Up Manufacturing Plant In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ వస్తోంది. ఆయిల్‌ డ్రిల్లింగ్‌ రిగ్స్‌ తయారీ దిగ్గజ కంపెనీ ‘డ్రిల్‌మెక్‌ ఎస్పీఏ’ హైదరాబాద్‌లో 200 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల (రూ.1,500 కోట్ల) భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఆ శాఖతో డ్రిల్‌మెక్‌ సంస్థ సోమవారం ఇక్కడ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. డ్రిల్‌మెక్‌ ఎస్పీఏ సీఈఓ సిమోన్‌ ట్రెవిసాని, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఎంఓయూపై సంతకాలు చేశారు.

రిగ్స్‌ పరికరాల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల శాఖతో కలిసి డ్రిల్‌మెక్‌ ఎస్పీఏ స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ప్రారంభించనుంది. ఆయిల్‌ రిగ్‌లు, అనుబంధ పరికరాల తయారీకి డ్రిల్‌మెక్‌ రాష్ట్రంలో అంతర్జాతీయ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఇటలీలోని పోడెన్‌జానో పీసీ కేంద్రంగా రిజిస్టర్డ్‌ కార్యాలయం ఉన్న డ్రిల్‌మెక్‌ను 2020లో మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) కొనుగోలు చేసింది. డ్రిల్‌మెక్‌ 200 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల వార్షిక టర్నోవర్‌ను కలిగి ఉంది.  

రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం, పనితీరు నచ్చి.. 
డ్రిల్‌మెక్‌ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 600 డ్రిల్లింగ్‌ రిగ్‌లను సరఫరా చేసింది. రిగ్‌ల రూపకల్పనలో అనేక వినూత్న డిజైన్లను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా పేటెంట్లను పొందింది. చమురు, ఇంధనం వెలికితీసే హైటెక్‌ రిగ్‌లను ఇప్పటికే తమ సంస్థ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిందని ఎంఈఐఎల్‌ పేర్కొంది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌లో చమురు వెలికితీసేందుకు అవసరమైన అత్యాధునిక డ్రిల్లింగ్‌ రిగ్‌ల తయారీ, వర్క్‌ ఓవర్‌ రిగ్‌ల రూపకల్పన, తయారీ, సరఫరాలో గ్లోబల్‌ లీడర్‌గా ఉందని చెప్పింది. డ్రిల్లింగ్‌ రిగ్‌లకు అవసరమైన విడిభాగాల తయారీలో కూడా ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది.

రాష్ట్రంలో పరిశ్రమలకు స్నేహపూర్వక వాతావరణం, ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు నచ్చి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నట్టు డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ సీఈఓ సిమోన్‌ ట్రెవిసాని పేర్కొన్నారు. భవిష్యత్తులో తమ హైడ్రోజన్‌ ఇంధన ప్రాజెక్టును భారత్‌లోకి తీసుకొస్తావని ప్రకటించారు. తమ వద్ద 1 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని, హైదరాబాద్‌ యూనిట్‌తో సరఫరా వేగం పెరుగుతుందని డ్రిల్‌మెక్‌ ఇంటర్నేషనల్‌ సీఈఓ ఉమా మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా నాణ్యమైన మానవ వనరులను తయారు చేస్తామన్నారు.  

5 ఖండాల్లో.. 30కి పైగా దేశాల్లో డ్రిల్‌మెక్‌ 
డ్రిల్‌మెక్‌ ఎస్పీఏ ఇటలీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ హైడ్రో కార్బన్‌ సంస్థ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాండ్‌ డ్రిల్లింగ్, వర్కోవర్‌ రిగ్స్, ఇతర డ్రిల్లింగ్‌ ఉపకరణాలను తయారు చేస్తుంది. 5 ఖండాల్లో విస్తరించి 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సంప్రదాయ డ్రిల్లింగ్‌ రిగ్గులైన స్వింగ్‌ లిఫ్ట్‌/స్లింగ్‌ షాట్, మొబైల్‌ రిగ్స్, ఆటోమేటిక్‌ రిగ్స్, హైడ్రాలిక్, హెచ్‌హెచ్‌ సిరీస్, స్ట్రైకర్‌–800 వంటి సంప్రదాయేతర ప్లే రిగ్స్‌ తయారీలో మేటి. వీటిని ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌ క్షేత్రాల్లో వాడతారు. భూ ఉపరితలం నుండి 6 వేల మీటర్ల వరకు సులువుగా.. అతి శీతల, అత్యుష్ణోగ్రతల్లో కూడా సమర్థంగా పని చేసే రిగ్స్‌ను తయారు చేసే కంపెనీగా గుర్తింపు పొందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement