సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ రవాణా.. వినియోగం.. విక్రయం.. ఇన్నాళ్లూ ఈ కోణాలే బయటపడేవి. విదేశీయుల నుంచి రాష్ట్రంలోని విద్యార్థుల దాకా ఎందరో పట్టుబడ్డారు. సినీ ప్రముఖులూ డ్రగ్స్ వాడినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ తొలిసారిగా డ్రగ్స్ కారణంగా ఓ యువకుడు మరణించిన విషయం బయటపడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
నార్కోటిక్స్ వినియోగమే ఎక్కువ
మాదకద్రవ్యాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. వృక్షాల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యేవి నార్కోటిక్ సబ్‌స్టాన్సస్. కృత్రిమంగా తయారు చేసేవి సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్. గంజాయి, ఓపియం, కొకైన్‌లతోపాటు గంజాయి నుంచి ఉత్పత్తి చేసే చెరస్, హష్ ఆయిల్, బంగ్, ఓపియం ద్వారా ఉత్పత్తి అయ్యే బ్రౌన్ షుగర్, హెరాయిన్ నార్కొటిక్స్ కిందికి వస్తాయి. కెటామిన్, ఎఫిడ్రిన్, పెథిడిన్ వంటివి సైకోట్రోపిక్ డ్రగ్స్.
హైదరాబాద్‌లో నార్కోటిక్స్ వినియోగం ఎక్కువ. ఈ ఉత్పత్తులు ప్రధానంగా ఆదిలాబాద్, విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలతోపాటు హిమాచల్‌ప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని వరంగల్, మెదక్, జహీరాబాద్‌లతోపాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి గంజాయి, హష్ ఆయిల్ వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక విదేశాల నుంచి కూడా వివిధ రూపాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది.
నైజీరియన్ల నుంచి లోకల్ దాకా..
ముంబై, గోవా, ఢిల్లీ, చండీగఢ్ తదితర చోట్ల డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారి డ్రగ్ నెట్‌వర్క్‌లో నైజీరియన్లు, ఇతర ఆఫ్రికా దేశాల వారిని వినియోగిస్తున్నారు. వీరు డ్రగ్స్‌ను రవాణా చేసి, తీసుకున్న డబ్బును డీలర్లకు పంపి.. వారిచ్చే కమీషన్ తీసుకుంటారు. నైజీరియన్లు పట్టుబడినా తమకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా డీలర్లు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో డ్రగ్స్ బానిసలైన స్థానిక యువకులు డ్రగ్స్ విక్రయించే పెడ్లర్లుగా మారుతున్నారు. కొందరు నేరుగా డార్క్‌నెట్ నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు.
నిఘా పెరిగితే గోవాకు వెళ్తూ..
డ్రగ్స్‌కు వారాంతాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. పబ్బులు, ఫామ్‌హౌజ్‌లు, రిసార్టుల్లో శని, ఆదివారాల్లో రాత్రంతా జరిగే పార్టీలు, కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. పెడ్లర్లు తెలిసినవారి ద్వారా ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. వీటిని వినియోగించేవారిలో వీఐపీలు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు, వారి పిల్లలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
ఇక గంజాయి, హష్‌ఆయిల్ వంటివాటిని చిన్నస్థాయి ఉద్యోగులు, విద్యార్థులు వంటివారు వాడుతున్నట్టు వివరిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో నిఘా పెరిగితే.. యువత గోవా వంటి చోట్లకు వెళ్లి డ్రగ్స్ కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. కొందరు అక్కడే డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘తొలి మరణానికి’ సంబంధించిన యువకుడు కూడా గోవాలో జరిగిన పార్టీతోనే ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు.
హైదరాబాద్‌లో ఎఫిడ్రిన్ తయారీ!
అల్లోపతి ఔషధాల తయారీలో ఉపయోగించే ఎఫిడ్రిన్ కూడా మాదకద్రవ్యాల తరహాలోనే మత్తునిస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ. కొన్ని ముఠాలు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో భారీగా ఎఫిడ్రిన్ తయారు చేసి.. ఇతర ప్రాంతాలు, విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. అయితే స్థానికంగా ఈ డ్రగ్ వినియోగం తక్కువేనని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
హెచ్– న్యూ ఆవిర్భావం తర్వాత
రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 9న ‘హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్– న్యూ)’ ఆవిర్భవించింది. సీనియర్ అధికారులతో కూడిన ఈ వింగ్ గత 51 రోజుల్లో మొత్తం 20 ముఠాలను పట్టుకుంది. పెడ్లర్లు, వినియోగదారులు సహా 120 మందిని అరెస్టు చేసింది. వీరిలో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కువగా ఉన్నారు.
వీటితో ప్రమాదకరమే..
హెరాయిన్: బ్లాక్‌ట్రా, చివా, నెగ్రా, హార్స్ మారుపేర్లు. కరిగించి ఇంజెక్షన్‌లా తీసుకోవడం (ఇంజెక్టింగ్), ముక్కుతో పీల్చడం (నోజింగ్), సిగరెట్‌లో నింపుకొని కాల్చడం (స్మోకింగ్) చేస్తారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులతోపాటు కోమాలోకి వెళ్లి మరణించే ప్రమాదం ఉంటుంది.
కొకైన్: స్టఫ్, కోకి, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా దీనికి మారుపేర్లు. ముక్కుతో పీల్చడం, సిగరెట్‌లో నింపుకొని కాల్చడం, వైన్‌లో కలుపుకుని తాగడం (స్పైకింగ్) చేస్తారు. దీనివల్ల నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్, గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ.
గాంజా, చెరస్, హష్ ఆయిల్: ఓ మాల్‌గా పిలుస్తుంటారు. గంజాయి ఆకులను సిగరెట్‌లో నింపుకొని కాలుస్తారు. ఈ చెట్టు నుంచి కారే బంక నుంచి చెరస్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని నేరుగా తీసుకోవడం లేదా సిగరెట్ ద్వారా సేవిస్తారు. వీటితో ఊపిరితిత్తులు, మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది.
ఎవరినీ వదిలిపెట్టం
నషా ముక్త్ హైదరాబాద్ లక్ష్యంగా సీఎం కేసీఆర్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) ఏర్పాటు చేశాం. ఈ విభాగం స్థానికంగా జరిగే డ్రగ్స్ క్రయవిక్రయాలతోపాటు వాటి మూలాలను కనిపెట్టి చెక్ పెడుతుంది. మాదకద్రవ్యాలతో ఏ రకమైన ప్రమేయం ఉన్నా.. ఎవరినైనా వదిలిపెట్టం. డ్రగ్స్ వ్యవహారాలపై సమాచారం ఉన్న వారు 9490616688, 040–27852080 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. –డీఎస్ చౌహాన్, అదనపు సీపీ
విష వలయంలో విద్యార్థులెందరో..
నగరంలో మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతోపాటు విద్యార్థులు, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. హెచ్–న్యూ ఏర్పడిన రెండు నెలల్లోనే పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి అనేక మందిని అరెస్టు చేశాం. విక్రేతలు, వినియోగదారులుగా చిక్కిన వారిలో వివిధ కాలేజీలతోపాటు యూనివర్సిటీల విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ డ్రగ్స్ దందాలపై నిఘా పెట్టాం. –‘హెచ్–న్యూ’కు చెందిన అధికారి
నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది
డ్రగ్స్ ప్రభావం నాడీ వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. అవి సెరటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లను అతిగా ప్రేరేపించి అకారణ ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అందుకే వేరే లోకంలో ఉన్న భ్రాంతి కలుగుతుంది. కొద్దిరోజులు తరచూ డ్రగ్స్ తీసుకుంటే బానిసవడం ఖాయం. అలాంటి వారిని చాలా జాగ్రత్తగా డ్రగ్స్‌కు అలవాటు మానుకునేలా చేయాల్సి ఉంటుంది.
– డాక్టర్ అభినయ్, న్యూరాలజీ, కన్సల్టెంట్, ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్
Comments
Please login to add a commentAdd a comment