సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువు కోవాలనుకునే భారత విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. స్టూడెంట్, అకడమిక్ ఎక్స్‌ఛేంజ్ విజిటర్ వీసాల దరఖాస్తు ప్రక్రియను పరిమితంగా ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈనెల 17న హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని యూఎస్ ఎంబసీల్లో ఈ ప్రక్రియ మొదలుకానుందని హైదరాబాద్‌లోని కాన్సులేట్ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో పరిమిత స్థాయిలోనే ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు వివ రించింది. శీతాకాల సెమిస్టర్ (ఫాల్ సెమిస్టర్) ప్రారంభమయ్యే సమయానికి తమ వద్ద చాలా తక్కువ అపాయింట్‌మెంట్లు మాత్రమే ఉన్నందున.. వాటి కోసం వచ్చే అన్ని విజ్ఞప్తు లనూ పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.
తరగతులు ఎప్పుడు మొదలవుతాయి? అపాయింట్‌మెంట్ల కోసం విజ్ఞప్తులు ఎప్పుడు అందాయనే ప్రాతిపదికన వాటిని పరిశీలిస్తామని, ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులు వేచి చూడాలని సూచించింది. తొలుత ఆగస్టు 12వ తేదీకి ముందు వచ్చిన అత్యవసర విద్యార్థి, ఎక్స్‌ఛేంజ్ విజిటర్ అభ్యర్థనలను పరిశీలించి వీసా అపాయింట్ మెంట్లను ఇస్తామని పేర్కొంది. ఆ తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలు, అవస రాన్ని బట్టి రెండు వారాల ముందు అపాయింట్‌మెంట్లు ఇస్తామని తెలిపింది. అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యా ర్థులు, ఎక్స్‌ఛేంజ్ విజిటర్స్ తమ తరగతులు మొదలుకావడానికి 3 వారాల కంటే ముందు మాత్రమే అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అపా యిం ట్‌మెంట్ వివరాలను ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని పేర్కొంది.
ఆ వీసా సర్వీసుల నిలిపివేత యథాతథం..
సాధారణ ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసా సర్వీసుల నిలిపివేత మాత్రం యథాతథంగా కొనసాగుతుందని, వీలైనంత త్వరగానే సాధారణ వీసా సర్వీసులను మొదలుపెట్టే అవకాశాలున్నా.. దానికి సంబంధించిన తేదీని మాత్రం వెల్లడించలేమని కాన్సులేట్ తెలి పింది. గతంలో ఎమ్మార్‌వీ ఫీజు కట్టినవారు ఏడాదిలోగా దానిని ఇంటర్వూ్య అపాయింట్ మెంట్ షెడ్యూల్ కోసం ఉపయోగించు కోవచ్చునని స్పష్టం చేసింది. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు ‘ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్’కోసం సూచించిన మార్గ దర్శకాలను పాటించాలని సూచించింది. ఇక హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, ఎల్, కొన్ని జే కేటగిరీల దరఖాస్తుదారులు తాము అపాయిం ట్‌మెంట్ పొందడానికి వీలుందో లేదో పరిశీ లించిన తర్వాత అందుకు విజ్ఞప్తి చేయాలని స్పష్టంచేసింది. అమెరికా వెళ్లేందుకు తమకు ఏ వీసా కేటగిరి సరిపోతుందని అనేది డైరెక్టరీలో సరిచూసుకోవాలని సూచించింది. కాగా, హైదరాబాద్ నుంచి దాదాపు 8వేల మంది విద్యార్థులకు అమెరికా వెళ్లే అవకాశం లభించ నుందని సమాచారం. వీసా అపాయింట్ మెంట్లు, ఇంటర్వూ్యలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి వీసాల జారీకి అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment