మార్చి నెలతో పోలిస్తే.. నవంబర్‌లో 20.71% పెరుగుదల
డిసెంబర్‌లో మరింత పెరిగే అవకాశం
చలి తీవ్రతతో తగ్గుతున్న విద్యుత్ వినియోగం
ఎక్కువ మంది 150 యూనిట్లలోపే వాడకం
సాక్షి, హైదరాబాద్: గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్య గ్రేటర్‌లో రోజురోజుకూ పెరుగుతోంది. 200 యూనిట్లలోపు వినియోగించే గృహాలకు ఈ పథకం కింద ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో లబ్ధిదారుల సంఖ్య 8,71,841 ఉండగా, నవంబర్ నాటికి 10,52,432కు చేరింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం గత మార్చి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
చలిగాలులు వీస్తుండటంతో..
గృహజ్యోతి పథకానికి గ్రేటర్‌లో 21 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు పదిన్నర లక్షల మందికిపైగా అర్హత సాధించారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తరాది నుంచి చలి గాలులు వీస్తుండటంతో ఇప్పటికే ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేశారు. ఫలితంగా నిన్నా మొన్నటి వరకు నెలకు సగటున 200 యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగించిన వారు.. ప్రస్తుతం 150 యూనిట్ల లోపే వాడుతున్నారు. ఫలితంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనున్నట్లు డిస్కం అంచనా వేస్తోంది.
9 నెలల్లో కోటికి చేరిన జీరో బిల్లులు..
గృహజ్యోతి పథకం కింద ఒక్కో వినియోగదారుకు నెలకు సగటున రూ.1,150 నుంచి రూ.1,200 వరకు లబ్ధి చేకూరుతోంది. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. లబ్ధిదారుల పెరుగుదల రేటు హైదరాబాద్ సౌత్‌లో అత్యధికంగా 54.07 శాతం నమోదైంది. మేడ్చల్ సర్కిల్‌లో అతి తక్కువగా 9.28 శాతం నమోదైంది. గ్రేటర్ మొత్తంగా పరిశీలిస్తే.. 20.71 శాతం నమోదు కావడం గమనార్హం. గత తొమ్మిది మాసాల కాలంలో ఈ పథకం కింద గ్రేటర్‌లో సుమారు కోటి జీరో బిల్లులు జారీ అయ్యాయి. పథకం అమలుతో ప్రభుత్వంపై నెలకు సగటున రూ.100 కోట్లకుపైగా భారం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment