
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి
సాక్షి, మహబూబాబాద్: బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించే వరకూ తమ ఉద్యమం ఆగదని, తెలంగాణ రాష్ట్ర సాధన తరహాలో ఉక్కు పరిశ్రమ సాధన ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఒక్కరోజు నిరసన దీక్షకు మంత్రి హాజరై మద్దతు తెలిపారు.
అనంతరం దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ.. తెలంగాణను మోసం చేశాయన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీలను తుంగలో తొక్కారన్నారు. ఈ ప్రాంతంలోని ఇనుప ఖనిజం నాణ్యమైందని, బొగ్గు లభ్యత, రవాణా సౌకర్యం, బైరటీస్ వంటి ఖనిజాలు ఉన్న బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు నిపుణులు చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. దీనికి తోడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు.
ఆయన కానీ.. బీజేపీ నాయకులు కానీ.. ఈ ప్రాంతానికి వస్తే రాళ్లతో కొట్టి తరమాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఎస్సీల వర్గీకరణ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాజ్యాంగంలో సవరణ చేయాలని సూచనలు చేసిన ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించిన బీజేపీ నాయకులు.. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎందుకు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, రాములునాయక్, రేగ కాంతారావు, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తాతా మధు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment