రాష్ట్ర మున్సిపల్, జిల్లా అధికారులతో సమావేశమైన వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల రూపురేఖలు త్వరలో మారబోతున్నాయి. రెండు పట్టణాలను పక్కా ప్రణాళికతో సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ హాజరైన ఈ సమావేశంలో హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. రెండు మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిస్థాయిలో పరిష్కరించి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు పట్టణాలను మోడల్ టౌన్‌లుగా తీర్చిదిద్దడానికి అవసరమైన సమగ్ర పట్టణ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని మంత్రి ఈటల వారికి సూచించారు. వచ్చే ఆరునెలల్లో ఈ రెండు పట్టణాల రూపురేఖలు మారుస్తానన్న మంత్రి అందుకు అవసరమైన చర్యలను వేగంగా పూర్తి చేయాలని కోరారు.
పట్టణాల్లో అన్ని సౌకర్యాలు
పట్టణాల్లో ఉన్న ప్రధాన రహదారులన్నింటికీ సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇంటింటికి తాగునీరు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పట్టణాల్లో పారుశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్కులు, రోడ్లపక్కన ఫుట్‌పాత్‌లు, పట్టణ ప్రజలకు అవసరమైన మార్కెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని హంగులతో కూడిన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు, చెరువుల సుందరీకరణ, టాంక్‌బండ్‌ల నిర్మాణం, పందుల పునరావాసం, రింగ్ రోడ్డు నిర్మాణాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎంతో చరిత్ర గలిగిన హుజూరాబాద్, జమ్మికుంట 2021లో మోడల్ టౌన్‌లుగా రూపుదిద్దుకోవడం చూడాలన్నారు. మంత్రి ఈటల సూచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు పురపాలక శాఖ ఉన్నతాధికారులు అరవింద్‌కుమార్, సత్యనారాయణ తమ అంగీకారం తెలిపారు.
ఈ మేరకు మంత్రి సూచనల మేరకు అన్ని విభాగాల అధికారులతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే వారంలో రెండు పట్టణాలు పర్యటించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్‌పర్సన్ స్వప్న, కమిషనర్ రషీద్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గందే రాధిక, వైస్ చైర్‌పర్సన్ నిర్మల, కమిషనర్ జోనా పాల్గొని పట్టణాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. అంతేగాక హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలు రెండు కళ్ల లాంటివని ఈటల అన్నారు. రెండు పట్టణాల్లో విశాలమైన రోడ్లు వేశామని చెప్పారు.
2014లోనే తాగునీటి కోసం రూ.40 కోట్లు మంజూరు చేసుకున్నాం. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి రూ.40 కోట్ల అదనపు నిధులు మంజూరు చేశానన్నారు. వాటిని పురపాలక శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టాలని, ఇంకెన్ని నిధులైనా మంజూరు చేయించే బాధ్యత తనదని పేర్కొన్నారు. నిధులు కొరత లేదని, అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పట్టణాల్లో ఎక్కడ కూడా డ్రైనేజ్ నీరు నిలవకుండా చూడాలని, కాలువలు, రోడ్లు దోమలకు నిలయాలుగా మారొద్దని చెప్పారు. రోడ్లు, డ్రెయిన్లు, టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి రాబోయే వంద సంవత్సరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలే తప్ప తాత్కాలికంగా పనులు చేయవద్దని, త్వరలోనే పట్టణాల అభివృద్ధిలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఈటల అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment