బిపిన్ రావత్‌తో దుర్గాప్రసాద్ దంపతులు (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మాజీ కల్నల్ పీవీ దుర్గా ప్రసాద్ కొన్నేళ్ల పాటు బిపిన్ రావత్‌తో కలిసి పని చేశారు. ఇద్దరూ కలిసి అనేక కీలక ఆపరేషన్లు కూడా చేశారు. 1978 నుంచి ఇద్దరూ కలిసి ఒకే బెటాలియన్‌లో దాదాపు 18 ఏళ్లు విధులు నిర్వర్తించారు. లెఫ్ట్‌నెంట్ నుంచి కల్నల్ వరకు కలిసే ఎదిగారు.
ఆపై దుర్గా ప్రసాద్ పదవీ విమరణ పొందారు. రావత్ సీడీఎస్ వరకు ఎదిగారు. ఈ ద్వయం అమృత్‌సర్, యూరిల్లో అత్యంత సన్నిహితంగా పని చేసి, అనేక ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. బిపిన్ హఠాన్మరణం నేపథ్యంలో దుర్గా ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే..
నిబద్ధతకు నిదర్శనం..
► బిపిన్ రావత్‌తో కలిసి 11 గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఆల్ఫా కంపెనీలో పని చేశా. ఓ రోజు ఇద్దరం కలిసి యూరి క్యాంప్‌లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద గార్డ్ చేస్తూ మధ్యాహ్న భోజనానికి వచ్చాం. అది పూర్తయిన తర్వాత ఎవరో మేజర్ జనరల్ వస్తే ఆయన బ్రీఫింగ్ చేస్తూ నేను ఆగిపోగా... బిపిన్ ఆర్మీ వాహనంలో తన విధులకు వెనక్కు వెళ్తున్నారు. నేను చూస్తుండగానే బాంబు పేలింది.
ఆ ప్రమాదంలో ఆయన గాయాలతో బయటపడ్డారు. నాటి దసరా సందర్భంలో గాయాలతో ఉన్నారు. అలాంటి వారికి క్యాంప్ నుంచి వెనక్కు వచ్చే అవకాశం ఉన్నా... ఆయన ఒప్పుకోలేదు. అంతటి నిబద్ధతతో విధులు నిర్వర్తించే వారాయన.
► దసరా రోజు సాయంత్రం 5.30 గంటలకు పాకిస్థాన్‌కు చెందిన ఛగోతీ పోస్టు వద్ద ఉన్నాం. ‘నేను నా ట్రూప్స్‌తో వెళ్లి దసరా బోర్డర్ లైన్ వద్ద సెలబ్రేట్ చేస్తా’ అని వెళ్లారు. దాదాపు రెండుమూడు గంటలు అక్కడ గడిపి వెనక్కు వచ్చారు. ఆయన నడిచే పరిస్థితి లేకపోవడంతో గూర్ఖా ట్రూప్స్ మోసుకు వెళ్లాయి.
ఆ రోజు ఉన్నతాధికారులకూ సమాచారం ఇవ్వకుండా ఇలా చేశాం. అలాంటివి మళ్లీ జరిగి ఉంటాయని అనుకోను. పాకిస్థాన్‌కు చెందిన ఆయుధాలు రికవరీ చేయడం, ఆ బలగాల కదలికల్ని కనిపెట్టడంలో బిపిన్ రావత్‌కు మంచి నెట్‌వర్క్ ఉండేది. సెకండ్ లెఫ్ట్‌నెంట్ నుంచే ముందుండి ట్రూప్‌ను నడిపే వారు. అందుకే అనేక మెడల్స్ ఆయన సొంతమయ్యాయి.
18 గంటల పాటు పనిచేసేవారు
► రావత్‌కు మానసిక స్థైర్యం, ధైర్యం చాలా ఎక్కువ. నాగాలాండ్ ఇన్‌సెర్జెన్సీ ఏరియాలో ఉండగా ఓ రోజు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయింది. ఆ వెంటనే కిందికి పడిపోయింది. అలా జరిగితే ఎవరైనా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. బిపిన్ రావత్ మాత్రం అలా చేయలేదు. మరో హెలికాప్టర్ తీసుకుని వెళ్లి పని పూర్తి చేసుకువచ్చారు. పని పట్ల ఆయనకు ఉండే నిబద్ధత అలాంటిది.
ఒక్కోసారి నిర్విరామంగా 18 గంటలూ ఆయన పని చేసే వారు. ఆయన భార్యను మేం మధు అని పిలిచేవాళ్లం. ఆమెది మధ్యప్రదేశ్‌కు చెందిన రాజకుటుంబం. అయినా ఆ దర్పం గాని, సీనియర్ అధికారి భార్య అనే భావన గాని ఏనాడూ ఆమెలో కనిపించలేదు. లక్నోలో మేమంతా కలిసి ఒకేచోట ఉండేవాళ్లం. నా భార్య అరుణకు ఆమె స్కూటర్ నడపడం నేర్పారు.
► రావత్ ఆర్మీ వైస్ చీఫ్, చీఫ్ అయిన తర్వాత కూడా ఆయన నాకు ఫోన్లు చేసి మాట్లాడేవారు. ఆయన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ వెళ్లి కలిసేవాడిని. రావత్ సీడీఎస్ అయిన తర్వాత ఒకేసారి కలిశాను. ఏడాది క్రితం ఆయన సీడీఎంలో లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు.
అప్పుడు దాదాపు గంటకు పైగా ఆయనతో గడిపా. బిపిన్ ఆర్మీ ఆపరేషన్స్‌లో దిట్ట. ఆయనకు అవంటే చాలా ఇష్టం. ఆయన కాంగోలో ఐక్యరాజ్య సమితి మిషన్‌లో పని చేశారు. అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలను అందరూ
అభినందించారు.
► బలగాల నైతిక ధైర్యం దెబ్బతీయడానికి యూఎన్ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించిన కాంగో మిలిటెంట్స్‌ను సమర్థంగా తిప్పికొట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచంలోని ప్రసిద్ధ దేశాల ఆర్మీలని ఆయన అధ్యయనం చేశారు బిపిన్.
ఈ నేపథ్యంలోనే ఆయన సీడీఎస్ అయిన తర్వాత థియేటర్ కమాండ్ అనే కొత్త కాన్సెప్ట్ పరిచయం చేశారు. దీంతో ఏ ప్రాంతంలో ఉన్న సైన్యానికైనా ఆయుధ, మౌలిక వసతుల కల్పన తేలికైంది. యుద్ధంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అది పూర్తిగా అమలులోకి వచ్చే సందర్భంలోనే విషాదం చోటుచేసుకోవడం దారుణం.
Comments
Please login to add a commentAdd a comment