మహ్మద్ హైదర్ అలీఖాన్, అబ్దుల్ సాల్మన్
సాక్షి, హైదరాబాద్: సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేశాడో యువకుడు. మాయమాటలతో స్నేహితుడిని, తన ప్రేయసిని ఇంటికి రప్పించి వారికి తెలియకుండా వారున్న రూమ్‌లో సీక్రెట్ కెమెరా అమర్చాడు. ఆ తర్వాత నుంచి తన కోరిక తీర్చాలంటూ వెంటపడి వేధించిన యువకుడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. మరో ఘటనలో అడ్రస్ చెబుతున్న యువతి పట్ల అసభ్యకరంగా తాకుతూ ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ సైతం జైలు పాలయ్యాడు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన షీటీం బృందం.. వివరాలను కోర్టులో పొందుపరిచారు. నాంపల్లిలోని మెట్రోపొలిటన్ క్రిమినెల్ కోర్టు ఇద్దరికీ ఎనిమిదేసి రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు షీటీం అడిషినల్ డీసీపీ సి.శిరీషరాఘవేంద్ర తెలిపారు. నగరానికి చెందిన అబ్థుల్ సాల్మన్(23) తన స్నేహితుడు, ప్రియురాలికి తన ఇంటిలో చోటు కల్పించాడు.
వారిద్దరూ శారీరకంగా కలిసిన సన్నివేశాల్ని ఫోన్‌లో చిత్రీకరించి తనతో కూడా గడపాలంటూ యువతిని బెదిరించాడు. దీనిపై యువతి, తన ప్రియుడు షీటీం పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన షీటీం అబ్దుల్ సాల్మన్ వద్ద ఉన్న ఫోన్‌ను పరిశీలించగా దానిలో నగ్నచిత్రాలు ఉన్నట్లు స్పష్టమవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకుని కోర్టుకు అందజేశారు.
అదేవిధంగా కొద్దిరోజుల క్రితం నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని మహ్మద్ హైదర్‌అలీఖాన్(25) అనే క్యాబ్ డ్రైవర్ తనకు అడ్రస్ చెప్పాలంటూ కోరాడు. తను అడ్రస్ చెప్పేందుకు హైదర్ అలీఖాన్ వద్దకు రావడంతో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో యువతి చాకచక్యంగా డ్రైవర్ ఫొటోలు, కారు నంబర్‌ను తన ఫోన్‌లో క్యాప్చర్ చేసి షీటీంకు పంపింది.
రంగంలోకి దిగిన షీటీం బృందం మహ్మద్ హైదర్ అలీఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను సేకరించి కోర్టులో సమర్చించారు. ఈ ఇద్దరి వ్యవహారంపై గురువారం ఇద్దరికీ వేర్వేరుగా 8 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment