చూడటానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినవారు కూడా ఇటీవల ఉన్నట్టుండి మృత్యువాతపడ్డారు. వీరందరూ 50 ఏళ్లకు అటుఇటుగా ఉన్నవారే. ఈ పరిస్థితికి కోవిడ్ తదనంతర పరిణామాలే కారణమని వైద్యనిపుణులు అంటున్నారు. ఇటీవల ఒక ఆరోగ్యవంతుడైన రాజకీయవేత్త అకస్మాత్తుగా మరణించిన విషయం మరవక ముందే ఆస్ట్రేలియాకు చెందిన సుప్రసిద్ధ క్రికెటర్ షేన్ వార్న్(52) అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలొదిలాడు. వీరిద్దరూ ఇదివరకే కోవిడ్ సోకినవారు కావడం గమనార్హం.
ఈ రెండు ఘటనలు కోవిడ్ మహమ్మారి, గుండెపై దాని దుష్ప్రభావం, పరిణామాలను చర్చనీయాంశం చేశాయి. కరోనా వైరస్ మానవ శరీరంలోని గుండెను ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో ప్రభావితం చేస్తున్నట్టు ఇప్పటికే వెల్లడైందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్నవారు కోవిడ్ సోకిన తర్వాత పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఏడాది కూడా పట్టొచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెపై కరోనా ప్రభావం తదితర అంశాలపై ‘సాక్షి’తో నిమ్స్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఓరుగంటి సాయిసతీశ్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డి.శేషగిరిరావు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లో...
– సాక్షి, హైదరాబాద్
బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్స్‌కు కోవిడ్ ప్రమాదసూచిక
కోవిడ్–19 ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్ స్ట్రోక్‌కు, హార్ట్ స్ట్రోక్‌కు ప్రమాదసూచికగా పరిగణిస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలో శాస్త్రీయంగా ఇది నిరూపితమైంది. వీటితోపాటు బీపీ, షుగర్, పొగతాగడం వంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్‌గా ఉన్నాయి. కోవిడ్ సోకనివారితో పోల్చితే దాని నుంచి కోలుకున్నవారిలో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్‌ల ప్రమాదం అధికంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా బయటపడినా వివిధ అవయవాలు, ముఖ్యంగా రక్తనాళాలపై దాని ప్రభావం ఎక్కువ కాలం కొనసాగడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదముంటుంది.
కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ‘పల్మనరీ ఎంబాలిజం’వచ్చే అవకాశముంది. అంతవరకు గుండె సంబంధిత సమస్యలు లేకపోయినా గుండె అత్యంత వేగంగా కొట్టుకుని, గుండె నుంచి మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడంతో నిముషాల్లోనే మరణాలు సంభవిస్తున్న ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. అందువల్ల కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా డయాబెటీస్, బీపీతోపాటు ధూమపానం అలవాటు ఉన్నవారు, కుటుంబంలో గుండెజబ్బులున్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక జీవనశైలిని మార్చుకోవాలి. జంక్, ఫాస్ట్‌ఫుడ్ తినడం మానేయాలి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలి. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు చేయించుకోవాలి.
– డాక్టర్ ఓరుగంటి సాయి సతీశ్,ప్రొఫెసర్ కార్డియాలజీ, హెడ్ యూనిట్ 1, నిమ్స్
రక్తనాళాలు చిక్కబడి.. మరణాలు
కోవిడ్ కారణంగా రోగుల్లో రక్తం చిక్కబడటం పెరిగింది. కరోనా వచ్చి తగ్గాక కొన్నిరోజుల దాకా రక్తం గడ్డకట్టడం అనేది కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు అవి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాలను కూడా బ్లాక్ చేస్తాయి. దీనిని ‘పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం’అని పిలుస్తాం. గుండె ధమనుల్లో అవరోధాలు (బ్లాక్‌లు) ఉన్నా, వాటిపై రక్తం గడ్డకట్టినా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశముంది. శరీరంలో కొవ్వు పెరిగితే రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టడం, చిక్కబడటం పెరుగుతుంది. ఇలా రక్తనాళాల్లో అకస్మాత్తుగా రక్తం గడ్డకట్డడంతో గుండెపోటుకు గురై చనిపోవడం సంభవిస్తుంది.
పుట్టుకతోనే కండరాలు దళసరిగా ఉన్నవారిలోని గుండె లయ మార్పుల వల్ల కూడా అకస్మాత్తు మరణాలు సంభవించవచ్చు. పోస్ట్ కోవిడ్‌లో కొందరు పేషెంట్లు రొటీన్ మందులు వాడుతున్నా పరిస్థితి అదుపు తప్పుతోంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీనొప్పి వంటివి వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. మందులు వాడటం ఆపోద్దు. గుండె సంబంధిత సమస్యలు దీర్ఘకాలంపాటు ఉంటాయని అధ్యయనాల్లో వెల్లడైంది. కరోనా తదనంతరం గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటు కేసులు పెరిగినట్టు స్పష్టమైంది. అంతకు ముందు ఆరోగ్యంగా ఉన్న పేషెంట్లు కూడా అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్, గుండె సమస్యలకు గురికావడం చూస్తున్నాం. గతంలో గుండె జబ్బులున్నవారికి కరోనా సోకితే సమస్య తీవ్రంగా మారుతోంది. వైరస్ గుండెను ప్రభావితం చేశాక రక్తం చిక్కబడటం, గుండె లయలు పెరగడం, తగ్గడం.. గుండె వైఫల్యాలకు దారితీస్తోంది.
– డాక్టర్ డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment