వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. | Extramarital affair wife assassinated her husband | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

Published Mon, Aug 30 2021 8:15 AM | Last Updated on Mon, Aug 30 2021 8:15 AM

 Extramarital affair wife assassinated her husband - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ అశోక్, వెనుకాల నిందితులు

షాబాద్‌: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

షాబాద్‌ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కేశవగూడకు చెందిన పామెన మాణిక్యరావు(35)కు పన్నెండేళ్ల క్రితం షాబాద్‌కు చెందిన శోభారాణితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. షాబాద్‌కు చెందిన యాదయ్యతో శోభారాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త మాణిక్యరావు దీనికి అడ్డుగా ఉన్నాడని, అతన్ని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13న తనకు ఛాతిలో నొప్పిగా ఉందని శోభారాణి తన భర్తతో కలిసి షాద్‌నగర్‌ ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో చూపించుకుని అక్కడి నుంచి ఆటోలో మామిడిపల్లికి వచ్చారు. ఆటో దిగి ఇద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ షాబాద్‌కు వస్తున్నారు. అప్పటికే శోభారాణి తన ప్రియుడు యాదయ్యకు ఫోన్‌ చేసి రమ్మని చెప్పింది. ముందస్తు పథకం ప్రకారమే యాదయ్య బైక్‌పై మామిడిపల్లి శివారుకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి చున్నీ తీసుకుని మాణిక్యరావు మెడకు బిగించి హత్య చేశారు. అప్పటికే సాయంత్రం 7గంటలు కావడంతో శవాన్ని పొదల్లో వేశారు.

మరుసటి రోజు యాదయ్య తన స్నేహితులైన వినోద్, శ్రీశైలం సాయంతో ఓ కారు తీసుకుని వెళ్లి శవాన్ని డిక్కీలో వేసుకుని శ్రీశైలం హైవేలో గల అమ్రాబాద్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని లోయలో పడేశారు. ఆతర్వాత ఇంటికి వచ్చిన శోభారాణి ఏమీ తెలియనట్లు మీ కొడుకు కనిపించడం లేదని మామ అనంతయ్యకు చెప్పింది. ఆయన ఈ నెల 24న షాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శోభారాణి కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆదివారం నిందితురాలు శోభారాణితో పాటు ఆమె ప్రియుడు యాదయ్య, వినోద్, శ్రీశైలంను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు.

     
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement