లైసెన్స్‌ ఒకరిది.. అమ్మేది ఇంకొకరు..! | Fake Licence Fraud In Mancherial | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌ ఒకరిది.. అమ్మేది ఇంకొకరు..!

Published Sun, Jul 4 2021 10:38 AM | Last Updated on Sun, Jul 4 2021 10:38 AM

Fake Licence Fraud In Mancherial - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మంచిర్యాల: వారు ఇచ్చిందే విత్తనం.. వారు ఇచ్చినవే ఎరువులు, మందులు ఇదీ జిల్లాలోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో పరిస్థితి. జిల్లాలో 80శాతం ఫర్టిలైజర్‌ దుకాణాలను లైసెన్స్‌ పొందిన వ్యక్తులు కాకుండా వేరేవాళ్లు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కనీస అర్హత లేకపోయినా.. ఎరువుల శాస్త్రీయ నామాలు తెలియకున్నా.. ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా రైతులకు విక్రయిస్తున్నారు. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ విరివిగా ఫర్టిలైజర్‌ దుకాణాలు వెలుస్తున్నాయి.

డిగ్రీ అర్హత, బీఎస్సీ అగ్రికల్చర్‌ రసాయన శాస్త్రం అర్హత సాధించిన వారికి ఫర్టిలైజర్‌ దుకాణం లైసెన్స్‌ ఇస్తారు. డిగ్రీ ద్వారా లైసెన్స్‌ పొందితే డీలర్‌గా ఎరువులు, విత్తనాలు, ఇతర రసాయన మందుల దుకాణాల నిర్వహణకు అవకాశం ఉంటుంది. రసాయన మందులు అమ్మాలంటే తప్పనిసరిగా ఎవరి సర్టిఫికెట్‌ ద్వారా లైసెన్స్‌ పొందారో వారిని టెక్నికల్‌ పర్సన్స్‌గా దుకాణంలో ఉంచాల్సి ఉంటుంది. దుకాణాల తనిఖీ సమయంలో టెక్నికల్‌ పర్సన్‌ లేకుండా విక్రయాలు జరిపితే 6ఏ యాక్టు కింద కేసు నమోదు చేయవచ్చు. 80 నుంచి 90 శాతం దుకాణాల్లో టెక్నికల్‌ పర్సన్‌ లేకుండానే విక్రయాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

సర్టిఫికెట్‌ కలిగిన వ్యక్తులు ఎక్కడో ఉంటారు. ఇక్కడ కనీసం పదో తరగతి పాస్‌ కాని వారు కూడా దుకాణాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆయా కంపెనీల సేల్స్‌ మేనేజర్లు, సిబ్బంది చెప్పిన రసాయన మందులు రైతులకు అంటగడుతుంటారు. పంటలపై మందుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది.. ఎలాంటి వాతావరణం.. నేలలో పిచికారీ ప్రభావం తదితర అంశాలపై అవగాహన ఉండడం లేదు. వ్యవసాయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో దుకాణదారులకు అడ్డులేకుండా పోతోంది.

అవగాహన, శిక్షణ కరువు..
జిల్లాలో 320 ఫర్టిలైజర్, విత్తన దుకాణాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నవారి పేరిట, డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికెట్ల పేరిట లైసెన్స్‌లు పొంది మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుత జిల్లాలో వారు లేకపోయినా వారి సర్టిఫికెట్లతో దుకాణాల లైసెన్స్‌లు కొనసాగుతున్నాయి. వాటిని రద్దు చేసే అవకాశం లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కానీ టెక్నికల్‌ పర్సన్‌ లేకుండా, అర్హులైన వ్యక్తులు లేకుండా దుకాణాలు నిర్వహించరాదు.

దీంతోపాటు ప్రతీ డీలర్‌కు డిప్లామా ఇన్‌ అగ్రికల్చర్‌ టూర్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీస్‌ ఆఫ్‌ ఇన్‌ఫుట్‌(డీఏఈఎస్‌ఐ) కింద శాస్త్రవేత్తలు, రిటైర్డు వ్యవసాయ అధికారుల ద్వారా 48 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికేట్‌ అందజేస్తారు. ఈ శిక్షణ తరగతులు నామమాత్రం కాగా.. కొందరు “మామూలు’గానే సర్టిఫికేట్‌ పొందుతున్నట్లు తెలుస్తోంది. శిక్షణకు హాజరైన వారికి రూ.10వేలు, సర్టిఫికేట్‌ పొందడానికి మరో రూ.10వేలు తీసుకుంటున్నట్లు డీలర్లు చర్చించుకుంటున్నారు.

వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో ఫెస్టిసైడ్స్‌పై అవగాహన సదస్సులు లేక రసాయనిక శాస్త్రీయ నామాలు, దాని ప్రభావం, వినియోగం తెలియకపోయినా విక్రయాలు సాగిస్తున్నారు. దుకాణాల ముందు విత్తన, ఎరువుల తదితర స్టాక్‌ బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. రైతులు కొనుగోలు చేసిన విత్తనం, ఎరువు, రసాయన మందుల తాలుకు సరైన రశీదు ఇవ్వడం లేదు. తెల్లకాగితంపై రైతు పేరు, పేరు కొనుగోలు చేసిన తేదీ, ధర వేసి ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఏ మందు అమ్మినా తయారీ, ఎక్స్‌పైరీ తేదీ, కంపెనీ, బ్యాడ్జి నెంబర్‌ తదితర వివరాలతో డీలర్‌ పేరుతో ఉన్న రశీదు అందించాల్సి ఉంటుంది. అమాయక రైతులను ఆసరాగా చేసుకొని ఇష్టానుసారం కంపెనీల ఆఫర్లకు ఆశపడి కట్టడబెతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 

90 శాతం మందికి శిక్షణ
ఉమ్మడి జిల్లాలో గతంలో లైసెన్స్‌ పొందిన వారే ఎక్కువగా ఉన్నారు. డీఏఈఎస్‌ఐ 90 శాతం మంది డీలర్లు ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. డీలర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇష్టానుసారం అమ్మకానికి వీలు లేదు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

– వీరయ్య, జిల్లా వ్యవసాయ అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement