సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ‘ఫార్ములా-ఈ’ రేసింగ్ మొదటిసారిగా మన దేశంలో ట్రాక్ ఎక్కనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇందుకోసం 100 రోజుల కౌంట్ డౌన్ దేశ రాజధాని ఢిల్లీలో లాంఛనంగా అభిమానుల కోలాహలం మధ్య శుక్రవారం ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ను కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, టీఆర్‌ఎస్ ఎంపీలు సురేశ్‌రెడ్డి, దామోదర్ రావు, వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, గ్రీన్ కో సంస్థ ప్రతినిధి సునీల్ చలిమిశెట్టి, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో 2.7 కి.మీ మార్గంలో రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి వెళ్లే విధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు మీదుగా మొత్తం 17 టర్నింగ్‌లు వచ్చేలా ట్రాక్ ప్లాన్ ఉంటుందన్నారు. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ద్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోగే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్‌గా ఫార్ములా–ఈ నిలవనుంది.
12 దేశాల్లోనే..
ఫార్ములా-ఈ ప్రిక్స్ ఈవెంట్‌ను ప్రపంచంలో 12 దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని, అందులో భారత్ కూడా ఒకటని కేంద్రమంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌లో జరగబోయేది 9వ సీజన్ అని వివరించారు. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు లండన్, బెర్లిన్, రోమ్, సౌ పాలో, మెక్సికో, జకార్తా, కేప్ టౌన్, మొనాకో, దిరియా (సౌదీ అరేబియా) సరసన నిలివనుంది. రానున్న నాలుగు సంవత్సరాల వరకు ఈ ఈవెంట్‌ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
2014లో ప్రారంభమైన ఫార్ములా-ఈ రేసింగ్ ఇప్పటివరకు 100 రేసులను పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగే ఈ ఈవెంట్‌ను హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) బాధ్యులైన రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయం ముందు జరిగే ఈ రేసింగ్‌లో గంటకు 280 కిలోమీటర్ల వేగంతో బ్యాటరీ కార్లు దూసుకుపోనున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల కంపెనీల్లో ఒకటైన గ్రీన్ కో ఈ ఈవెంట్‌ను ప్రమోట్ చేస్తుంది.
కేటీఆర్ సందేశం..
’ఫార్ములా ఈ-ప్రిక్స్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌తో అనేక గ్లోబల్ సిటీల స్థాయికి హైదరాబాద్ చేరుకున్నట్లయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు తన సందేశంలో పేర్కొన్నారు. విశ్వనగరంలో హైదరాబాద్‌కు గుర్తింపు రావడానికి అనేక అంశాల్లో ఇప్పుడు ఇది కూడా చేరిందన్నారు. ఈ ఈవెంట్‌ను హైదరాబాద్లో సమర్ధవంతంగా నిర్వహిస్తామని, 'ఈ-మొబిలిటీ సమ్మిట్’ పేరుతో ఆ రంగానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులు, ఇన్వెస్టర్లు వస్తారని, ఆ సందర్భంగా హైదరాబాద్ నగరానికి 'ఈ-వెహికల్' రంగంలో ఉన్న ప్రత్యేకతలను, ప్రాధాన్యతను వివరిస్తామని మంత్రి అన్నారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న ’ఫార్ములా-ఈ ప్రిక్స్’ ఈవెంట్ ఒక్కసారితో అయిపోదని , ఇకపైన ప్రతి ఏటా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని, ’ఈ-మొబిలిటీ’లో హైదరాబాద్ నగరం గ్లోబల్ లీడర్‌గా ఆవిష్కృతమవుతుందని పేర్కొన్నారు. ఫార్ములా వన్ తరహాలోనే ఇప్పుడు జరగనున్న ఫార్ములా-ఈ కూడా ఉంటుందని, అయితే ఈ రేస్‌లో పాల్గొనే వాహనాలు పూర్తిగా బ్యాటరీ సాయంతో నడిచే ఈ-వెహికల్స్ అని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తు ఆటోమొబైల్ రంగం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుందని, గంటకు 300 కి.మీ. వేగంతో నడిచే జెనరేషన్-3 కార్లు మొదటిసారిగా ఈ ఈవెంట్ సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో తయారైన బ్యాటరీ, వేగంగా రీచార్జ్ అయ్యే టెక్నాలజీ వీటి ప్రత్యేకత అని అన్నారు.
ఫార్ములా వన్ రేసింగ్ ప్రత్యేకంగా తయారుచేసిన ట్రాక్ రోడ్లపై జరుగుతాయని, కానీ ఫార్ములా-ఈ ఈవెంట్ మాత్రం నగరంలోని సాధారణ రోడ్లపైనే జరగనున్నట్లు తెలిపారు. స్ట్రీట్ సర్క్యూట్ తరహాలో వీధులపైనే జరుగుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తిగా, ఉత్కంఠగా వీక్షించే క్రీడ కార్ రేసింగ్ అని, 1990వ దశకం నుంచే ఎఫ్-3 రేసులు జరుగుతున్నట్లు గుర్తుచేశారు. ఫార్ములా వన్ రేసింగ్ మాత్రం 2011లో మొదలైందని, ఇప్పుడు ఫార్ములా-ఈ పేరుతో తొలిసారి హైదరాబాద్‌లో జరుగుతుందన్నారు. రానున్న మూడు నెలల్లో అనేక ఈవెంట్లు జరుగుతాయని, సుమారు 40 వేల మందికి పైగా దీన్ని ప్రత్యక్షంగా వీక్షించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. త్వరలోనే టికెట్ల విక్రయంపై నిర్ణయం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
చదవండి: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్‌గా ఐసీసీసీ
Comments
Please login to add a commentAdd a comment