ఏటూరునాగారం/చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ ప్రాంతం నుంచి కవ్వాల్ – 4(కె–4) పెద్దపులి ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలోకి ప్రవేశించిందనే సమాచారంతో ఉద్యోగులు అన్వేషణలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు చెన్నూరు, ఏటూరునాగారం వన్యప్రాణి సిబ్బంది సంయుక్తంగా పులిజాడల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రెండు నెలల క్రితం చెన్నూరు అటవీ ప్రాంతం నుంచి బుద్దారం అడవుల్లోకి వెళ్లే క్రమంలో కెమెరాకు చివరిసారిగా చిక్కిన పులి ఆ తర్వాత జాడ లేకుండా పోయింది.
దీంతో మహారాష్ట్ర, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అటవీ ప్రాంతాల్లోకి పులి వెళ్లి ఉంటుందనే అంచనాతో ఉద్యోగులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఏటూరునాగారం అభయారణ్యంలోకి కవ్వాల్ –4 (కె–4) పెద్దపులి వచ్చిన జాడల కోసం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులి ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఐలాపురం అడవుల్లో ఆనవాళ్లు
ఏటూరునాగారం రేంజ్ పరిధిలోని ఐలాపురం అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులను అటవీశాఖ అధికారులు ఈనెల 8న గుర్తించారు. దీంతో పెద్దపులి కదలికలను తెలుసుకునేందుకు కెమెరాలను కూడా ఏర్పాటు చేయించారు. ఏటూరునాగారం డీఎఫ్‌వో ప్రదీప్‌శెట్టిని వివరణ కోరగా ఆ పాదముద్ర ఇప్పటివరకు ఏ పులిది అనే విషయం నిర్ధారించలేదన్నారు.
అలాగే, ఈ ఏడాది జనవరి 29న కూడా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులు కనిపించడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో పెద్దపులులు ఉండేవని అటవీశాఖ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం కెమెరాలను ఈ ప్రాంతంలో అమర్చి పరిశీలిస్తున్నారు.
అనుమానాలు అనేకం..
నడుముకు ఉచ్చు బిగిసి నాలుగేళ్లపాటు ఎటూ కదలని కె–4 పులి రెండు నెలల క్రితం ఇతర ప్రాంతానికి ఎలా వెళ్లింది..? ఒకవేళ కె–4 మంచిర్యాల ఫారెస్ట్ డివిజన్‌లోని ఇతర ప్రాంతానికి వెళ్తే సీసీ కెమెరాలకు ఎందుకు చిక్కలేదు..? ఈ ప్రాంతంలో దాని పాదముద్రలు ఎందుకు లభ్యం కాలేదు..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
చదవండి: ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి..
జాడలేని తల్లి.. పాపం పులి కూనలు..
Comments
Please login to add a commentAdd a comment