
ఆస్ట్రేలియాలో మహాత్మాగాంధీ విగ్రహం తరువాత ప్రతిష్ఠించిన రెండో భారతీయుడి విగ్రహం పీవీదే కావడం గమనార్హం...
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో శనివారం ఆవిష్కరించారు. ఆ దేశ రాజధాని సిడ్నీలోని స్ట్రాత్‌ఫీల్డ్ ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన పీవీ విగ్రహాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె వాణీదేవి, ఎన్‌ఆర్‌ఐ ఓవర్సీస్ కన్వీనర్ మహేశ్ బిగాల, అక్కడి నగర మేయర్ మాథ్యూ బ్లాక్మెర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, హార్న్ కౌన్సిలర్ శ్రీని పిల్లమర్రితో కలిసి ఆవిష్కరించారు.
ఆస్ట్రేలియాలో మహాత్మాగాంధీ విగ్రహం తరువాత ప్రతిష్ఠించిన రెండో భారతీయుడి విగ్రహం పీవీదే కావడం గమనార్హం. భారతదేశ పాలనావ్యవస్థలో అనేక మార్పులు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభ్యుదయానికి పీవీ పాటుపడ్డారని పలువురు వక్తలు కొనియాడారు. పీవీ సంస్కరణల ఫలితాలను, ప్రయోజనాలను ప్రస్తుతం భారత్ ప్రజలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ హేమచందర్‌రావు కల్వకోట, సుజాత కల్వకోట, భారతి, విజయ హాజరయ్యారు.
ఇదీ చదవండి: యూకే లేబర్ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్