ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చొనేవాణ్ణి కాదు..
యాదాద్రి ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
లక్ష్మీ నరసింహ స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపేందుకే కింద కూర్చున్నా
ప్రభుత్వ ప్రణాళికలు, నిర్ణయాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నా... సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగా 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు
సింగరేణిలో 1,352 కొలువుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడి
హైదరాబాద్‌లో సింగరేణి అతిథి గృహానికి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆశీస్సులతో సాధించిన పేదల ఇళ్ల విషయంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆశీర్వచనం తీసుకోవడంలో భాగంగా కావాలనే తాను కింద కూర్చున్నానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. పేదల ఇళ్ల కల నిజం కావడంతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం కోసమే తాను ఆలయంలో చిన్న పీట మీద కూర్చున్నట్టు వెల్లడించారు.
మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ఎంబీటీ నగర్‌లో సింగరేణి అతిథి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో తాను కింద కూర్చొ ని ఉండగా, సీఎం, ఇతర మంత్రులు కుర్చిల్లో కూర్చుని ఉండటంపై చెలరేగిన వివాదంపై వివరణ ఇచ్చారు.
తమ కోరికలను మన్నించి ఆశీర్వదించి అవకాశం ఇచ్చిన నరసింహ స్వామికి మొక్కు చెల్లించుకుంటూ నిండు మనసుతో తమను ఆశీర్వదించాలని కోరుకున్నట్టు చెప్పారు. దురదృష్టవశాత్తు కొందరు ఆ ఫొటో తీసుకుని ట్రోల్ చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ, ప్రణాళిక శాఖలను నిర్వహిస్తూ రాష్ట్రంలో తీసుకునే అనేక ప్రణాళికలు, విధానపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నానని వెల్లడించారు.
‘నేను ఎవరికో తలవంచే వాడిని కాదు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని అంతకన్నా కాదు. ఆత్మగౌరవాన్ని చంపుకునే వ్యక్తిని కాదు. మిత్రులు ఎవరైనా మానసిక క్షోభకు గురైతే అర్థం చేసుకోవాలి’అని అన్నారు.
పాదయాత్రలోనే గుట్టలో మొక్కుకున్నా...
‘నేను పాదయాద్ర చేసినప్పుడు మార్గమాధ్యంలో యాదగిరిగుట్టలో స్వామి వారిని దర్శించుకున్నా. రాష్ట్రంలో ప్రజలు అనేక బాధలు పడుతూ ఉన్నారు. ఇళ్లు లేని పేదలు, ఉద్యోగాలు లేని యువతీయువకులు.. వారాందరి బాధలు విన్న తర్వాత ఏదో ఒక విధంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చేలా ఆశీర్వదించి పంపించు అని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నా..’అని భట్టి తెలిపారు.
దుర్మార్గపు ప్రభుత్వాన్ని వదిలించుకుని, ఇళ్లు ఇచ్చే ఇందిరమ్మ రాజ్యాన్ని తేవాలని ప్రజలు తనను కోరారన్నారు. అందుకే అప్పట్లో స్వామి వారిని మొక్కు కోరుకున్నట్టు తెలిపారు. సింగరేణి ఏరియాలో జీవో 76 ప్రకారం 2006లో దాదాపు 23 వేల మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చామని, వాటిలో కట్టుకున్న ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. సింగరేణి, జెన్‌కోలో స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరిస్తామన్నారు.
మరో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు
సింగరేణి సంస్థలో ఇప్పటికే 489 కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, మరో 1,352 కొలువుల భర్తీకి త్వరలో ప్రకటన వస్తుందని భట్టి విక్రమార్క ప్రకటించారు. సింగరేణి పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లాల అభ్యర్థుల స్థానికత విషయంలో వచ్చిన సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు.
సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్‌లో 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలుండగా, కొత్తగా అక్కడ 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను సంస్థ నిర్మిస్తుందన్నారు. కాలం చెల్లిన 62.5 మెగావాట్ల రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో మరో 800 థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని, ఈ స్థలాన్ని జెన్‌కో నుంచి సింగరేణికి బదిలీ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment