Four Day Work Week In Europe Countries - Sakshi
Sakshi News home page

వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్‌

Published Wed, Mar 1 2023 3:59 AM | Last Updated on Wed, Mar 1 2023 10:27 AM

Four Day Work Week In Europe - Sakshi

సండే.. దేశంలో చాలామంది ఉద్యోగుల సేదతీర్చే రోజు.. వారమంతా పనిలో పడ్డ కష్టం నుంచి వారికి విశ్రాంతినిచ్చే ఒకే ఒక్క సెలవు రోజు.. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్‌ కంపెనీలు, ఐటీ, అనుబంధ రంగాల వంటి వాటిలో పనిచేసే ఉద్యోగులైతే వారానికి రెండు రోజులపాటు సెలవులు పొందుతుంటారని మనకు తెలుసు.

మరి వారానికి మూడు రోజులపాటు సెలవులు అందుకుంటున్న ఉద్యోగులు కూడా ఉన్నారని మీకు తెలుసా?! అదేంటి.. మన దేశంలో ఎవరిస్తున్నారని ఆలోచిస్తున్నారా? ఇంకా మన దేశంలో అమల్లోకి రాలేదులేండి... ప్రస్తుతానికి యూరప్‌లోని కొన్ని దేశాలు ఈ ట్రెండ్‌ను సెట్‌ చేసే పనిలో ఉన్నాయి.. అదేంటో తెలుసుకుందామా?

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ మహమ్మారి దెబ్బకు కంపెనీలు, సంస్థల పని విధానమే మారిపోయింది. అప్పటివరకు ఆఫీసుకు వెళ్లి చేసే పని బదులు వర్క్‌ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత కొన్నిరోజులు ఆఫీసు నుంచి, మరికొన్నిరోజులు ఇంటి నుంచి పని (హైబ్రీడ్‌) చేసే పద్ధతిని అమల్లోకి తెచ్చాయి. దీనికి కొనసాగింపుగా అన్నట్లు యూరప్‌లోని కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని, మూడు రోజుల సెలవుల విధానం అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో 61 కంపెనీలు 3 వేల మంది ఉద్యోగులకు 6 నెలలపాటు ఫోర్‌డే వీక్‌ విధానాన్ని పరిశీలించాయి. 

ఇరుపక్షాలకూ లాభమే.. 
వారానికి నాలుగు రోజుల పని వల్ల ఉత్పాదకత పెరగడంతోపాటు ఉద్యోగుల పని–జీవితం బ్యాలెన్స్‌ కూడా మెరుగైనట్లు ప్రయోగాత్మక పరిశీలనలో తేలింది. అలాగే ఉద్యోగాలు మానేసే వారి సంఖ్య తగ్గడంతోపాటు గతంలో మానేసిన వారు తిరిగి విధుల్లో చేరడం, అనారోగ్యంతో సెలవులు పెట్టే వారి సంఖ్య తగ్గడం వంటి ఎన్నో సానుకూల అంశాలు వెల్లడయ్యాయి. జీతం కంటే కూడా వారంలో ఒకరోజు పని తగ్గుదల వైపే మొగ్గుచూపుతున్నట్లు ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. 

భారత్‌లో నిపుణుల స్పందనేంటి? 
మన దేశంలోనూ వారానికి 4 రోజుల పని విధానంపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీనిపై కర్ణాటక అసెంబ్లీలో ఏకంగా ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. రోజుకు 12 గంటలు పనిచేసే ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫ్‌ తీసుకోవచ్చని ఇందులో పొందుపరిచారు. అయితే భారత్‌లో ఈ విధానం అమలుపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఎదురయ్యే కొన్ని సవాళ్లను అధిగమిస్తూ పక్కా ప్రణాళికలతో చేపడితేనే మన దేశంలో సత్ఫలితాలు సాధ్యమని వాల్యూ మ్యాట్రిక్స్‌.ఏఈ వ్యవస్థాపకుడు ఆదిత్య మాలిక్‌ పేర్కొన్నారు. ఈ విధానానికి తగ్గట్లుగా నియమ, నిబంధనలు ఇతర అంశాలను మార్చాల్సి ఉంటుందన్నారు. మన దేశంలో ఆతిథ్య, తయారీ, రిటైల్‌ రంగాల్లో నాలుగు రోజుల పనివిధానం అమలు సాధ్యం కాదని డే కొలాబ్‌ కో–ఫౌండర్, సీఈవో రాజేశ్వరీసింగ్‌ అభిప్రాయపడ్డారు. కేవలం ఈ–కామర్స్, బ్యాంకింగ్, బీమా, టెక్నాలజీ వంటి రంగాల్లోనే ఇది సాధ్యమని పేర్కొన్నారు.

ఈ పని పద్ధతికి సరిపోయే పరిశ్రమ ఎంపికతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించకుండా ఇందుకు అర్హమయ్యే సంస్థలనే ఎంపిక చేయాలని కర్మ వీ ఫౌండర్, సీఈవో ఉజ్జల్‌ డే సూచించారు. ప్రతి పరిశ్రమ, సంస్థకు 4 రోజుల పని విధానం సరిగ్గా వర్తించకపోవచ్చని, అయితే కోవిడ్‌ వ్యాప్తి తర్వాత పనిప్రదేశాలు మారిపోతున్న నేపథ్యంలో టెక్నాలజీ సహకారంతో నూతన ప్రక్రియలను చేపట్టడంలో నష్టమేమీ లేదని ఐమోచా సీఈవో అమిత్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఫోర్‌ డే వర్క్‌ విధానం అమలు వల్ల యాజమాన్యాలకు లేబర్‌ కాస్ట్‌లు, ఓవర్‌హెడ్‌ ఖర్చులు తగ్గడంతోపాటు ఉద్యోగులకూ వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ మెరుగవుతుందని జెన్‌లీప్‌ ఫౌండర్‌ సచిన్‌ తెలిపారు. 

ఫోర్‌ డే వీక్‌ ఆహ్వానించదగ్గదే.. 
మన దేశంలో ఈ విధానం పనిచేయదనుకోవడానికి లేదు. గత పదేళ్లలో భారత్‌ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే మనం ‘మెంటల్‌ వెల్‌నెస్‌’కు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాబోయే 5–10 ఏళ్లలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కొత్త పనివిధానంతో కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థిక రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఫైవ్‌ డే వీక్‌ బదులు రోజుకు మరో గంటన్నర, రెండు పనిగంటలు పెంచి ఫోర్‌ డే వీక్‌ చేస్తే ఉద్యోగులకు మూడు రోజులు వెసులుబాటుగా ఉంటుంది. ఈ దిశగా యాజమాన్యాలు ఆలోచించాలి. 
– సాక్షితో డాక్టర్‌ బి.అపర్ణారెడ్డి, హెచ్‌.ఆర్‌. నిపుణురాలు 

ఈ విధానం ఎలా అమల్లోకి...?
దాదాపు వందేళ్ల కిందటే వారానికి చేసే పనిదినాలను తగ్గించాలనే ఆలోచన వచ్చిందట. ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్‌ 1926లోనే 6 రోజులపని స్ధానంలో ‘ఫైవ్‌ డే వీక్‌’విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది పనిగంటలు తగ్గించినంత మాత్రాన ఉత్పాదకతపై దాని ప్రభావం పడలేదని వెల్లడైంది. దీంతో ఇతర కంపెనీలు కూడా ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభించాయి.

మారుతున్న కాలం, అభిరుచులను బట్టి ఐర్లాండ్, ఐస్‌లాండ్, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో అమలు చేసి సత్ఫలితాలు సాధించాయి. ఈ పని పద్ధతిపై న్యూజిలాండ్, యూఎస్, కెనడా, వివిధ ఐరోపా దేశాలు ప్రయోగాలు చేశాయి. ‘ఫోర్‌ డే వర్క్‌’సిస్టమ్‌ను 2018లోనే టెక్‌ కంపెనీ అమెజాన్‌ ఎంపిక చేసిన ఉద్యోగులకు అమలు చేసింది. 2019లో జపాన్‌లో మైక్రోసాఫ్ట్‌ నెలపాటు ఈ పద్ధతిని పరిశీలించింది. 2020లో యూనీలివర్‌ న్యూజిలాండ్‌లో ఏడాదిపాటు పరీక్షించింది. తద్వారా ఈ కంపెనీలు మంచి ఫలితాలనే సాధించాయి. ఆ తర్వాత విదేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. 

ఇప్పటికే ఇక్కడ స్టార్టప్‌ ‘త్రీడే వీక్‌’! 
దాదాపు ఏడాదిన్నర క్రితమే బెంగళూరుకు చెందిన ఓ ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ కంపెనీ కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి వారంలో మూడు రోజుల పనికి 80 శాతం జీతం, ఇతర సౌకర్యాలు కల్పించింది. కొత్త ఆలోచనలు, నవీన ఆవిష్కరణలపై జిజ్ఞాస పెంచేందుకు తమ ›ప్రాజెక్ట్‌లో పనిచేసే టీమ్‌ సభ్యులకు వారు కోరుకున్న పనివిధానంలో పనిచేసే అవకాశం కల్పించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement