four days in a week
-
వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్
సండే.. దేశంలో చాలామంది ఉద్యోగుల సేదతీర్చే రోజు.. వారమంతా పనిలో పడ్డ కష్టం నుంచి వారికి విశ్రాంతినిచ్చే ఒకే ఒక్క సెలవు రోజు.. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ కంపెనీలు, ఐటీ, అనుబంధ రంగాల వంటి వాటిలో పనిచేసే ఉద్యోగులైతే వారానికి రెండు రోజులపాటు సెలవులు పొందుతుంటారని మనకు తెలుసు. మరి వారానికి మూడు రోజులపాటు సెలవులు అందుకుంటున్న ఉద్యోగులు కూడా ఉన్నారని మీకు తెలుసా?! అదేంటి.. మన దేశంలో ఎవరిస్తున్నారని ఆలోచిస్తున్నారా? ఇంకా మన దేశంలో అమల్లోకి రాలేదులేండి... ప్రస్తుతానికి యూరప్‌లోని కొన్ని దేశాలు ఈ ట్రెండ్‌ను సెట్ చేసే పనిలో ఉన్నాయి.. అదేంటో తెలుసుకుందామా? సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి దెబ్బకు కంపెనీలు, సంస్థల పని విధానమే మారిపోయింది. అప్పటివరకు ఆఫీసుకు వెళ్లి చేసే పని బదులు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత కొన్నిరోజులు ఆఫీసు నుంచి, మరికొన్నిరోజులు ఇంటి నుంచి పని (హైబ్రీడ్) చేసే పద్ధతిని అమల్లోకి తెచ్చాయి. దీనికి కొనసాగింపుగా అన్నట్లు యూరప్‌లోని కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని, మూడు రోజుల సెలవుల విధానం అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో 61 కంపెనీలు 3 వేల మంది ఉద్యోగులకు 6 నెలలపాటు ఫోర్డే వీక్ విధానాన్ని పరిశీలించాయి. ఇరుపక్షాలకూ లాభమే.. వారానికి నాలుగు రోజుల పని వల్ల ఉత్పాదకత పెరగడంతోపాటు ఉద్యోగుల పని–జీవితం బ్యాలెన్స్ కూడా మెరుగైనట్లు ప్రయోగాత్మక పరిశీలనలో తేలింది. అలాగే ఉద్యోగాలు మానేసే వారి సంఖ్య తగ్గడంతోపాటు గతంలో మానేసిన వారు తిరిగి విధుల్లో చేరడం, అనారోగ్యంతో సెలవులు పెట్టే వారి సంఖ్య తగ్గడం వంటి ఎన్నో సానుకూల అంశాలు వెల్లడయ్యాయి. జీతం కంటే కూడా వారంలో ఒకరోజు పని తగ్గుదల వైపే మొగ్గుచూపుతున్నట్లు ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. భారత్‌లో నిపుణుల స్పందనేంటి? మన దేశంలోనూ వారానికి 4 రోజుల పని విధానంపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీనిపై కర్ణాటక అసెంబ్లీలో ఏకంగా ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. రోజుకు 12 గంటలు పనిచేసే ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫ్ తీసుకోవచ్చని ఇందులో పొందుపరిచారు. అయితే భారత్‌లో ఈ విధానం అమలుపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఎదురయ్యే కొన్ని సవాళ్లను అధిగమిస్తూ పక్కా ప్రణాళికలతో చేపడితేనే మన దేశంలో సత్ఫలితాలు సాధ్యమని వాల్యూ మ్యాట్రిక్స్.ఏఈ వ్యవస్థాపకుడు ఆదిత్య మాలిక్ పేర్కొన్నారు. ఈ విధానానికి తగ్గట్లుగా నియమ, నిబంధనలు ఇతర అంశాలను మార్చాల్సి ఉంటుందన్నారు. మన దేశంలో ఆతిథ్య, తయారీ, రిటైల్ రంగాల్లో నాలుగు రోజుల పనివిధానం అమలు సాధ్యం కాదని డే కొలాబ్ కో–ఫౌండర్, సీఈవో రాజేశ్వరీసింగ్ అభిప్రాయపడ్డారు. కేవలం ఈ–కామర్స్, బ్యాంకింగ్, బీమా, టెక్నాలజీ వంటి రంగాల్లోనే ఇది సాధ్యమని పేర్కొన్నారు. ఈ పని పద్ధతికి సరిపోయే పరిశ్రమ ఎంపికతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించకుండా ఇందుకు అర్హమయ్యే సంస్థలనే ఎంపిక చేయాలని కర్మ వీ ఫౌండర్, సీఈవో ఉజ్జల్ డే సూచించారు. ప్రతి పరిశ్రమ, సంస్థకు 4 రోజుల పని విధానం సరిగ్గా వర్తించకపోవచ్చని, అయితే కోవిడ్ వ్యాప్తి తర్వాత పనిప్రదేశాలు మారిపోతున్న నేపథ్యంలో టెక్నాలజీ సహకారంతో నూతన ప్రక్రియలను చేపట్టడంలో నష్టమేమీ లేదని ఐమోచా సీఈవో అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఫోర్ డే వర్క్ విధానం అమలు వల్ల యాజమాన్యాలకు లేబర్ కాస్ట్‌లు, ఓవర్‌హెడ్ ఖర్చులు తగ్గడంతోపాటు ఉద్యోగులకూ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ మెరుగవుతుందని జెన్లీప్ ఫౌండర్ సచిన్ తెలిపారు. ఫోర్ డే వీక్ ఆహ్వానించదగ్గదే.. మన దేశంలో ఈ విధానం పనిచేయదనుకోవడానికి లేదు. గత పదేళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే మనం ‘మెంటల్ వెల్నెస్’కు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాబోయే 5–10 ఏళ్లలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కొత్త పనివిధానంతో కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థిక రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఫైవ్ డే వీక్ బదులు రోజుకు మరో గంటన్నర, రెండు పనిగంటలు పెంచి ఫోర్ డే వీక్ చేస్తే ఉద్యోగులకు మూడు రోజులు వెసులుబాటుగా ఉంటుంది. ఈ దిశగా యాజమాన్యాలు ఆలోచించాలి. – సాక్షితో డాక్టర్ బి.అపర్ణారెడ్డి, హెచ్.ఆర్. నిపుణురాలు ఈ విధానం ఎలా అమల్లోకి...? దాదాపు వందేళ్ల కిందటే వారానికి చేసే పనిదినాలను తగ్గించాలనే ఆలోచన వచ్చిందట. ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ 1926లోనే 6 రోజులపని స్ధానంలో ‘ఫైవ్ డే వీక్’విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది పనిగంటలు తగ్గించినంత మాత్రాన ఉత్పాదకతపై దాని ప్రభావం పడలేదని వెల్లడైంది. దీంతో ఇతర కంపెనీలు కూడా ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభించాయి. మారుతున్న కాలం, అభిరుచులను బట్టి ఐర్లాండ్, ఐస్లాండ్, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో అమలు చేసి సత్ఫలితాలు సాధించాయి. ఈ పని పద్ధతిపై న్యూజిలాండ్, యూఎస్, కెనడా, వివిధ ఐరోపా దేశాలు ప్రయోగాలు చేశాయి. ‘ఫోర్ డే వర్క్’సిస్టమ్‌ను 2018లోనే టెక్ కంపెనీ అమెజాన్ ఎంపిక చేసిన ఉద్యోగులకు అమలు చేసింది. 2019లో జపాన్‌లో మైక్రోసాఫ్ట్ నెలపాటు ఈ పద్ధతిని పరిశీలించింది. 2020లో యూనీలివర్ న్యూజిలాండ్‌లో ఏడాదిపాటు పరీక్షించింది. తద్వారా ఈ కంపెనీలు మంచి ఫలితాలనే సాధించాయి. ఆ తర్వాత విదేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ స్టార్టప్ ‘త్రీడే వీక్’! దాదాపు ఏడాదిన్నర క్రితమే బెంగళూరుకు చెందిన ఓ ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి వారంలో మూడు రోజుల పనికి 80 శాతం జీతం, ఇతర సౌకర్యాలు కల్పించింది. కొత్త ఆలోచనలు, నవీన ఆవిష్కరణలపై జిజ్ఞాస పెంచేందుకు తమ ›ప్రాజెక్ట్‌లో పనిచేసే టీమ్ సభ్యులకు వారు కోరుకున్న పనివిధానంలో పనిచేసే అవకాశం కల్పించింది. -
గుడ్‌న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. ఉద్యోగులు ఫుల్ ఖుష్.!
లండన్: ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని బ్రిటన్ చేపట్టిన అతిపెద్ద ట్రయల్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. వివిధ రంగాలకు చెందిన 61 కంపెనీలు 6 నెలల పాటు నిర్వహించిన ఈ పైలట్ స్కీమ్‌లో పాల్గొన్నాయి. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ట్రయల్ జరిగింది. ఇందులో మొత్తం 3,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారానికి ఐదు రోజులు పనిచేసినప్పుడు ఎంత జీతం ఇచ్చారో.. నాలుగు రోజులు పనిచేసినా అంతే మొత్తాన్ని చెల్లించారు. చిన్న పెద్ద కంపెనీలు అనే తేడా లేకుండా అన్ని సంస్థలు ఈ ప్రయోగంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్లు చెప్పాయి. ట్రయల్‌లో పాల్గొన్న 91 శాతం కంపెనీలు ఈ విధానాన్నే తాము కొనసాగిస్తామని చెప్పాయి. 4 శాతం సంస్థలు కాస్త సందిగ్ధత వ్యక్తం చేయగా.. మరో 4 శాతం కంపెనీలు తాము పాత పద్ధతినే(ఐదు రోజుల పనిదినాలు) కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. 35 శాతం పెరిగిన రెవెన్యూ.. వారానికి నాలుగు రోజుల పనిదినాల అనుభవంపై కంపెనీలు 10 పాయింట్లకు సగటున 8.5 రేటింగ్ ఇచ్చాయి. బిజినెస్ ప్రొడక్టివిటీ, బిజెనెస్ పర్ఫామెన్స్‌కు 7.5 రేటింగ్ ఇచ్చాయి. ఈ విధానం వల్ల గతేడాదితో పాల్చితే రెవెన్యూ 35 శాతం పెరిగిందని సంస్థలు వెల్లడించాయి. కొత్త నియామకాలు పెరిగాయని, ఆఫీసులకు గైర్హాజరు శాతం తగ్గిందని పేర్కొన్నాయి. ఉద్యోగులకు సంతృప్తి.. నాలుగు రోజుల పనిదినాల వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని ట్రయల్‌లో తేలింది. చాలా మంది వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించారని, ఉద్యోగ సంతృప్తిలో గణనీయమైన పెరుగుదల కన్పించిందని వెల్లడైంది. అలాగే ఉద్యోగులకు ఒత్తిడి, అలసట, నిద్ర సమస్యలు కూడా తగ్గాయి. పర్యావరణ ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నాలుగు రోజులే పనిదినాలు కాడవంతో ఆపీస్‌కు వెళ్లే సమయంతో పాటు వాహనాల వినియోగం కూడా తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది. మహిళలకే ఎక్కువ బెనిఫిట్.. ఈ కొత్త విధానం వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మేలు జరుగుతున్నట్లు ట్రయల్‌లో తేలింది. ఇంటి పనులు, పిల్లలను చూసుకునేందుకు పురుషులు సమయం కేటాయించడంతో మహిళలకు ఆ భారం తగ్గినట్లు వెల్లడైంది. వారానికే నాలుగు రోజుల పనిదినాలు విధానాన్ని భవిష్యత్తులో తాము ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నట్లు '4 డే వీక్ గ్లోబల్' స్వచ్ఛంద సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ, చార్లోటె లాక్హార్ట్ చెప్పారు. చదవండి: 'రెచ్చిపోతున్న కిమ్.. మౌనంగా ఉంటే ప్రపంచానికే ప్రమాదం..' -
జాలీగా ఫోర్ డేస్ జాబ్..!
మనదేశంలో ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ‘వారానికి అయిదు రోజుల పని విధానం’ (ఫైవ్ డే వీక్)లో పనిచేస్తుండడం మనకు తెలిసిందే. శని,ఆదివారాలు సెలవులు ఉండడంతో ఫైవ్ డే వీక్ ఉన్న వారిని ఒకింత ప్రత్యేకంగానే చూస్తుంటాము. అయితే మనం మరింత ఆశ్చర్యపోయేలా న్యూజిలాండ్‌లోని ఒక సంస్థ వారానికి నాలుగు రోజుల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానంలో భాగంగా మంచి ఫలితాలే వచ్చినట్టుగా ఆ సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడి ఉద్యోగులకు కూడా ఈ కొత్త పద్ధతి తెగ నచ్చేసిందిట. నాలుగు రోజులకు పనిచేసినందుకు అయిదురోజుల జీతం రావడం తమకు కలిసొచ్చే అంశంగా వారు పరిగణిస్తున్నారు. వారానికి నాలుగు రోజులే పని... న్యూజిలాండ్ ట్రస్టీ కంపెనీ ‘పర్పెక్చువల్ గార్డియన్’ ఈ పని విధానాన్ని అమలు చేస్తోంది. ఈ సంస్థలోని 200 మంది ఉద్యోగులు మార్చి నెల మొదలైనప్పటి నుంచి ‘ఫోర్ డే వీక్’ పనిచేస్తున్నారు. ఆరువారాల పాటు అంటే ఏప్రిల్ 15 వరకు ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఈ సంస్థ నిర్ణయించింది. ఈ గడువు ముగిశాక ఈ కాలానికి (45 రోజులకు) ఉద్యోగుల ఉత్పాదకత డేటాను ఒకచోట చేర్చి విశ్లేషిస్తారు. ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారో లేదా అన్న విషయం జులైలో ఉద్యోగులకు తెలియజేస్తారు. లగ్జంబర్గ్‌లో అత్యధిక ఉత్పాదకత... న్యూజిలాండర్లు ఏడాదికి సగటున 1,752 గంటలు పనిచేస్తున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్, కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)లోని సహచర సభ్యదేశాల్లోని (న్యూజిలాండ్‌తో కలుపుకుని మొత్తం 35 దేశాలు) ఉద్యోగులతో ఈ పనిగంటలు ఇంచుమించు సమానం. జర్మనీలో ఫైవ్డే వీక్‌లో భాగంగా ఉద్యోగులు 40 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. డెన్మార్క్‌లో వారానికి సగటున మహిళలు 35 గంటలు, పురుషులు 41 గంటలు పనిచేస్తుం టారు. నార్వేలో వారానికి సగటున 37,38 గంటలు పనిచేస్తారు. నెదర్లాండ్స్, మెక్సికో, కొరియా, కోస్తారికాలలోని ఉద్యోగులు కొంచెం అటు, ఇటుగా ఇన్ని గంటలే పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకత గల దేశంగా లగ్జంబర్గ్ నిలుస్తోంది. అక్కడి ఉద్యోగులు,కార్మికులు వారానికి కేవలం 29 గంటల పాటే పనిచేస్తున్నా ఈ ఘనతను సాధించడంలో భాగం పంచుకున్నారు. మంచి ఫలితాలే వచ్చాయి... ‘ఈ ప్రయోగం ద్వారా ఆసక్తికరమైన డేటా వస్తోంది. న్యూజిలాండ్‌లోని రెండు ప్రముఖ యూనివర్సిటీల విద్యా వేత్తలతో ఈ సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. వచ్చే ఫలితాలను బట్టి మరి కొంతకాలం ఈ విధానాన్ని కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటాం. కొందరు ఉద్యోగులు తమకిచ్చిన సమయం కంటే ముందుగానే అప్పగించిన పని ముగిస్తున్నారు. ఉద్యోగుల్లో అధికశాతం సానుకూల దృక్పథం కనిపిస్తోంది. న్యూజిలాండ్‌లో ఈ విధానం అమలయ్యేందుకు వీలుగా మేము విజయం సాధించాలని ఇక్కడివారు కోరుకుంటున్నారు. అయితే ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశమున్న ఈ విధానాన్ని ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిరుత్సాహ పరుస్తోంది’ అని ‘పర్పెక్చువల్ గార్డియన్’ సీఈఓ ఆండ్రూ బార్న్స్ పేర్కొన్నారు. ‘వారంలో అదనంగా ఒకరోజు సెలవు లభించడాన్ని ఉద్యోగులు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు చేస్తున్న పనిని సమర్థవంతంగా చేస్తున్నారు. సెలవుల నుంచి తిరిగి వచ్చాక సోమవారం మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మూడురోజుల వారాంతం సెలవులను బాగా ఉపయోగించుకుంటున్నారు’ అని ఆ సంస్థ ఉన్నతోద్యోగి క్రిస్టినీ బ్రదర్టన్ తెలిపారు. అదేబాటలో మరిన్ని సంస్థలు.. కొందరి ఉద్యోగులపై వారానికి 30 గంటల పనివిధానాన్ని అమేజాన్ సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. పూర్తికాలం ఉద్యోగులకిచ్చే బెనిఫిట్స్ అన్ని వారికి కూడా ఇచ్చినా జీతం మాత్రం 75 శాతం ఇస్తారని తెలుస్తోంది. డెలాయిట్‌తో పాటు కేపీఎంజీ సంస్థ కూడా కొన్ని షరతులతో కొందరు ఉద్యోగులకు ‘ఫోర్ డే వీక్’ విధానాన్ని అమలుచేస్తోంది. గూగుల్ సంస్థ కూడా కొందరు ఉద్యోగులకు వారంలో తాము చేసే పనిలో 20 శాతం సమయాన్ని తమకు ఇష్టం వచ్చినట్టుగా గడిపేలా అవకాశం కల్పిస్తోంది. ఇలాంటి సృజనాత్మక స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుందని ఈ సంస్థ భావిస్తోంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇక వారంలో నాలుగు రోజులు ఎల్టీటీ
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు, వికారాబాద్‌ల మీదుగా ముంబై, విశాఖపట్నం వెళ్లే లోకమాన్య తిలక్ టెర్మినల్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రైల్వే అధికారులు పొడిగించారు. ప్రస్తుతం వారంలో రెండు రోజులు నడుస్తున్న ఈ రైలును ఈ నెల 25నుంచే నాలుగు రోజులు నడుపుతున్నారు. ఈ రైలు జిల్లాలో తాండూరు, వికారాబాద్ స్టేషన్లలో ఆగుతున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం నుంచి ఎల్టీటీ (నంబర్ 18519) వైపునకు ప్రతి ఆది, బుధ, గురు, శనివారాల్లో, ఎల్టీటీ నుంచి విశాఖపట్నం (నంబర్ 18520) వైపునకు ఆది, సోమ, గురు, శుక్రవారాల్లో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. విశాఖపట్నంలో ఆయా రోజుల్లో రాత్రి 11.30 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు (సోమ, గురు, శుక్ర, ఆది) మధ్యాహ్నం 2.25 గంటలకు వికారాబాద్, మధ్యాహ్నం 3.30 గంటలకు తాండూరుకు వస్తుంది. అలాగే ముంబై ఎల్టీటీ టెర్మినల్ నుంచి ఆది, సోమ, గురు, శుక్రవారాల్లో బయలుదేరే రైలు అదే రోజు సాయంత్రం 6.45 గంటలకు తాం డూరు, రాత్రి 7.30గంటలకు వికారాబాద్ రైల్వే స్టేషన్లలో రెండు నిమిషాలు ఆగి వెళ్తుంది. ఎల్టీటీ సర్వీసులను రెండు రోజుల నుంచి నాలుగు రోజులకు పొడిగించడంతో ముంబై, విశాఖపట్నం వెళ్లేందుకు మరింత సౌలభ్యం లభించిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.