సికింద్రాబాద్: పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయం వంటి గాంధీ ధర్మాస్పత్రిలో ఇరువురు మహిళలపై అఘాయిత్యం జరిగిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన ఒక మహిళ స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఆస్పత్రి ఆవరణలో స్పృహలేకుండా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరో మహిళ ఆచూకీ సోమవారం రాత్రి వరకు లభించలేదు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్ జిల్లా వేపురిగేరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు అటెండెంట్లుగా ఆయన భార్య, మరదలు(భార్య సోదరి) గాంధీ ఆస్పత్రికి వచ్చారు. గాంధీ ఆస్పత్రి ఉద్యోగి అయిన జేఎస్‌సీ ఉమామహేశ్వర్ రోగికి బంధువు అవుతాడు. ఇంతకాలం ఆస్పత్రి రేడియాలజీ విభాగంలో ఉద్యోగం చేసిన ఉమామహేశ్వర్ ఇటీవలే రిసెప్షన్‌కు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో అటెండెంట్లుగా ఉంటున్న ఇరువురు మహిళలు ఈ నెల 8 నుంచి కనిపించకుండా పోయారు.
తన తల్లితో పాటు చిన్నమ్మ కనిపించకపోడంతో రోగి కుమారుడు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. 11న ఆ వ్యక్తి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాడు. ఈ నెల 15న మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆ వ్యక్తి కుమారుడు తమకు బంధువైన ఉమామహేశ్వర్‌తో కలసి గాంధీ పరిసరాల్లో వెతకగా, ఆస్పత్రి భవనం సమీపంలోని చెట్ల పొదల్లో అతడి చిన్నమ్మ స్పృహలేకుండా, వివస్త్రగా కనిపించింది. చిన్నమ్మను తమ గ్రామానికి తీసుకెళ్లి ఆరా తీయగా, ఉమామహేశ్వర్ అతడి స్నేహితులు తనకు, సోదరికి మత్తు కలిపిన మద్యం ఇచ్చి కిడ్నాప్ చేశారని తెలిపింది. ఆస్పత్రిలోని సెల్లార్‌లో బంధించి తనపై వారు అత్యాచారం చేశారని వెల్లడించింది. తాను తప్పించుకుని బయటపడ్డానని, అయితే తన సోదరి ఎక్కడ ఉందో తెలియట్లేదని మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. గాంధీ ఆస్పత్రి తమ పరిధి కాదని పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి చిలకలగూడ పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది.
నాలుగు బృందాలు ఏర్పాటు: ఏసీపీ వెంకటరమణ
గాంధీ అత్యాచారం ఘటనకు సంబంధించి దర్యాప్తు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్టు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ తెలిపారు. గాంధీలో చికిత్స తీసుకున్న రోగి భార్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. బాధితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించడం కోసం ఆమెను భరోసా కేంద్రానికి పంపించామన్నారు. వివరాలు రాగానే దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తామన్నారు. అత్యాచారం ఘటన గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోనే జరిగిందా లేదా బయట జరిగిందా అన్న విషయాలపై దర్మాప్తు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితుడు
బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన చిలకలగూడ పోలీసులు నిందితుడిగా భావిస్తున్న గాంధీ ఉద్యోగి ఉమామహేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ నరేశ్, డీఐ సంజయ్‌కుమార్ విచారణ ప్రారంభించారు. బాధితురాలు పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పట్లేదని, విచారణకు సహకరించట్లేదని పోలీసులు చెబుతున్నారు. కనిపించకుండా పోయిన రోగి భార్య ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇరువురు మహిళలకు మద్యం అలవాటు ఉండటాన్ని ఆసరాగా తీసుకుని, ఉమామహేశ్వర్ వారిని కిడ్నాప్ చేసి, బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment