సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) కాంట్రాక్టర్ ఎంపిక కోసం హెచ్‌ఏఎంఎల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్టు అంచనా రూ 5,688 కోట్లు అని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వియస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన కాంట్రాక్టర్ మెట్రో రైలు వ్యవస్థకు అవసరమైన ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ పనులు, స్టేషన్లు, ట్రాక్ పనులు, ఎలక్ట్రికల్, మెకానికల్, సరఫరా పనులను చేపట్టాల్సి ఉంటుంది.
అలాగే రోలింగ్ స్టాక్ (రైలు బోగీలు), ఎలక్ట్రిక్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్‌సీ) గేట్లను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్‌మెంట్ ఫిక్సేషన్ వంటి ప్రాథమిక పనులన్నింటినీ ఇప్పటికే పూర్తి చేశారు. భూసామర్థ్య పరీక్షల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
కొత్త సర్వే ప్రకారం రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ స్టేషన్ వరకు దూరం 31 కి.మీ. ఉంది. ఇందులో 29.3 కి.మీ. ఆకాశమార్గం (ఎలివేటెడ్) కాగా. అండర్‌గ్రౌండ్‌లో 1.7 కి.మీ పొడవున పనులు చేపట్టాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయ టెర్మినల్‌కు ఆనుకొని ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌తో కలిపి రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మొత్తం 9 స్టేషన్లు ఉంటాయి.
ఆఖరు తేదీ జూలై 5
ఎయిర్‌పోర్టు మెట్రో రైలు నిర్మాణం పట్ల ఆసక్తి ఉన్న సంస్థలు జూలై 5లోగా టెండర్ పత్రాలను తెలంగాణ ప్రభుత్వ ఇ–పోర్టల్ https://tender. telangana.gov.in లో అప్‌లోడ్ చేయాలి. విమానాశ్రయ మెట్రో కారిడార్‌కు సమీపంలో అనేక వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. శివార్లలో మధ్యతరగతి వారికోసం తక్కువ ఖర్చుతో నివాసప్రాంతాలను అభివృద్ధి చేసి అన్ని తరగతులవారు ఎయిర్‌పోర్ట్ మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైతే నాలుగు అదనపు స్టేషన్ల నిర్మాణానికీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
టెండర్ విలువ, ప్రాజెక్టు వ్యయం వేర్వేరు
ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.6,250 కోట్లు కాగా, ప్రస్తుతం రూ,5,688 కోట్లకే టెండర్లను ఆహ్వానించారు. దీనిపై ఎన్విఎస్ రెడ్డి స్పందిస్తూ, ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ రెండూ భిన్నమైనవని చెప్పారు. అంచనా వేసిన టెండర్ విలువలో జీసీ ఖర్చు, ఆకస్మిక పరిస్థితులు, మల్టిమోడల్ ఇంటిగ్రేషన్ వంటివి ఉండవన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మాత్రం అవి ఉంటాయన్నారు. అందుకే ఈ రెండింటి మధ్య తేడా ఉన్నట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment