
సాక్షి, హైదరాబాద్: 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం గవర్నర్ తమిళసై ప్రసంగిస్తూ.. ‘మునుపెన్నడూ లేని విధంగా కొత్త పథకాలను, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలుచేస్తూ అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన ఉద్యమ నాయకుడికే తెలంగాణ రాష్ర్టాన్ని నడిపించే బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రంలో అభివృద్ధి పరిపాలన సాగుతోంది’ అని గవర్నర్ తమిళిసై తెలిపారు.
హైదరాబాద్: ప్రగతి భవన్‌లో నిర్వహించిన 72వ గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు ఆయన పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.