సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ ప్రజల కు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని.. ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. మిగతా గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
గత పాలకుల నిర్వాకంతో చిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితి, వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్యానించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే..
‘‘పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించినప్పుడు.. పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి, హక్కులతోనే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగినప్పుడు, దీనికి చరమగీతం పాడే అవకాశాన్ని కూడా రాజ్యాంగం ఇచ్చింది. గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం.. ఇటీవలి ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది.
వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నాం
గత పదేళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలను ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నాం. సమాజంలోని అన్నివర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
ప్రజాపాలనలో 1.25 కోట్ల దరఖాస్తులు
ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుంచి పథకాల అమలు కోసం 1,25,84,383 దరఖాస్తులను స్వీకరించగా.. అందులో ఐదు గ్యారెంటీల కోసం దరఖాస్తులు 1,05,91,636, ఇతర దరఖాస్తులు 19,92,747 వచ్చాయి. వీటిని శాఖలవారీగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం.
యువతలో అపోహలు వద్దు
గత పదేళ్లు యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఈ విషయంలో గట్టి దృష్టి పెట్టింది. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికలో రూ.40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం రాష్ట్ర పురోగమనానికి సంకేతం. ముఖ్యమంత్రి, వారి బృందాన్ని అభినందిస్తున్నాను.
రూ.2లక్షల రుణమాఫీకి చర్యలు
రైతులకు మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నాం. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమచేశాం. రూ.2 లక్షల రుణమాఫీ కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
సామాన్యులు సైతం సీఎంను కలవచ్చు
గత ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో లేదు. ఇప్పుడు ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రభుత్వం ప్రజాసమస్యలను వింటోంది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
రాష్ట్రంలో తొలిసారిగా ప్రజాస్వామ్య పాలన
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన, ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన మొదలైంది. అంబేడ్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాపాలన అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని, సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకుంటున్నాను..’’ అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment