సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రీతిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలన్న తన పంతాన్ని ఆమె నెగ్గించుకోబోతున్నారు. ప్రజాదర్బార్‌లో భాగంగా ఈ నెల 10న ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తమిళిసై రాజ్‌భవన్‌లో ‘మహిళా దర్బార్’నిర్వహిస్తారని గవర్నర్ కార్యాలయం బుధవారం ప్రకటించింది.
దీంతో గవర్నర్ ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్టు స్పష్టమైంది. మరుగునపడిపోయిన మహిళల గొంతుకను ఆలకించడానికి గవర్నర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాజ్‌భవన్ పేర్కొంది. గవర్నర్‌ను కలవాలనుకుంటున్న మహిళలు 040–23310521 నంబర్‌కు ఫోన్ లేదా rajbhavan&hyd@gov.inకు మెయిల్ చేసి అపాయింట్‌మెంట్ పొందాలని కోరింది.
రెండేళ్లుగా ఆలోచన...: తమిళిసై గవర్నర్‌గా 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఐదేళ్ల పాటు వ్యవహరించారు. గవర్నర్‌గా వచ్చిన తొలినాళ్లలోనే ప్రజాదర్బార్ నిర్వహించాలన్న తన మనోగతాన్ని బయటపెట్టారు. ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను సైతం రూపకల్పన చేయించారు. సామాన్య ప్రజలను స్వయంగా కలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించి, ఆన్‌లైన్ ద్వారా సంబం ధిత ప్రభుత్వ శాఖలకు పంపించడానికి, వాటి పరిష్కారానికి ఆయా శాఖలతో సమీక్షించడానికి, పురోగతిని తెలుసుకోవడానికి ఏర్పాట్లు చేశారు.
కోవిడ్–19 మహమ్మారి వల్ల ప్రజాదర్బార్ నిర్వహించాలన్న తన ఆలోచనను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, త్వరలో శ్రీకారం చుడతానని ఇటీవల తమిళిసై మీడియాకు వెల్లడించారు. అర్జీల స్వీకరణకు గత జనవరి 1న రాజ్‌భవన్ గేటు ఎదుట ఆమె ఓ పెట్టెను సైతం ఏర్పాటు చేయించగా, ప్రభుత్వానికి ఏ మాత్రం రుచించలేదు. గవర్నర్ చర్యపై విలేకరులు గతంలో ఓసారి సీఎం కేసీఆర్ అభిప్రాయం కోరగా, ఆయన దీనిని ‘సిల్టీ థింగ్’(చిల్లర విషయం)గా పరిగణి స్తున్నామని వెల్లడించడం గమనార్హం. ఆమె శుక్రవారం నుంచి ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టబోతుండగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందన ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.
పెరిగిన విభేదాలు, వివాదాలు: గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు పరాకాష్టకు చేరడంతో కొంత కాలంగా రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిపోయింది. బహిరంగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే స్థాయికి సంబంధాలు క్షీణించాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముందు తన ప్రసంగాన్ని రద్దు చేశారని, రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవానికి సీఎం, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులెవరూ హాజరు కాకుండా తనను అవమానించారని, మేడారం జాతరకు వెళ్లడానికి హెలికాప్టర్ కోరితే నిరాకరించారని, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు రావడం లేదని, సీఎం కేసీఆర్ తనను కలవడానికి రాజ్‌భవన్‌కు రావడం లేదని.. ఇలా గవర్నర్ పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
ఆమె ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సైతం కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్టు ఫిర్యాదులున్నాయని, దర్యాప్తు జరిపించాలని సైతం కోరారు. మరోవైపు గవర్నర్ తమిళిసై బీజేపీ మూలాలను కలిగి ఉండటంతో రాజ్‌భవన్‌ను బీజేపీ రాజకీయాలకు కేంద్రంగా మార్చారని పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ అగ్రనేతలు ప్రత్యారోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ప్రజాదర్బార్ నిర్వహించాలని గవర్నర్ నిర్ణయించడంతో వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment